Nykaa shares below IPO price: నైకా షేర్స్ ఎందుకు పడిపోతున్నాయి?
Nykaa shares below IPO price: ఈకామర్స్ కంపెనీ నైకా గత ఏడాది అక్టోబర్‌లో మార్కెట్లో లిస్టయింది. ఏకంగా 79 శాతం ప్రీమియంతో ఇష్యూ ప్రైస్ రూ. 2,001గా ఉంది. కానీ ఇప్పుడు ఎందుకు పతనమైంది?
బెంగళూరు: ఆన్‌లైన్ బ్యూటీ అండ్ ఫ్యాషన్ రిటైలర్ నైకా యాజమాన్య కంపెనీ ఎఫ్‌ఎస్‌ఎన్ ఇ-కామర్స్ వెంచర్స్ లిమిటెడ్ షేర్లు మంగళవారం 2.9% క్షీణించాయి. దాని ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ధర రూ. 1,125 గా ఉండగా.. ఇప్పుడు ఆ మార్క్ దిగువకు పడిపోయాయి.
Nykaa షేర్లు గత నెలలో 13% పడిపోయాయి. మంగళవారం బీఎస్‌ఈలో రూ. 1,110 వద్ద ముగిశాయి. నైకా ప్రీ-ఐపీఓ షేర్ హోల్డర్లకు ఒక సంవత్సరం లాక్-ఇన్ పీరియడ్ నవంబర్ 10న ముగియనుంది.
ఇండియా స్టాక్‌మార్కెట్ బెంచ్ మార్క్ సెన్సెక్స్ మంగళవారం 0.5 శాతం పడిపోయింది. పేటీఎం, జొమాటో, మ్యాప్‌మైఇండియా వంటి టెక్ స్టాక్స్ లాభాల్లో ముగిశాయి.
‘ప్రి-ఐపీఓ షేర్‌హోల్డర్స్ లాక్ ఇన్ పీరియడ్ నవంబరు 10న ముగియనుంది. ఆయా ఇన్వెస్టర్లు తమ షేర్లను విక్రయిస్తారా? లేక భవిష్యత్తులో లాభాల కోసం కొనసాగిస్తారా? అన్న అంశం ఇక్కడ కీలకంగా మారనుంది..’ అని జేఎం ఫైనాన్షియల్ అక్టోబరు 12న ఒక నివేదికలో అభిప్రాయపడింది. ‘షేర్‌కాపిటల్‌లోని 69 శాతం షేర్లు.. అంటే 319 మిలియన్ షేర్లు నవంబరు 10న ట్రేడింగ్‌కు అందుబాటులోకి రానున్నాయి..’ అని వివరించింది.
గత ఏడాది అక్టోబరులో నైకా మార్కెట్లో పటిష్టమైన అంచనాల మధ్య లిస్టయింది. లిస్టయినప్పుడు దాని విలువ ఏకంగా 79 శాతం పెరిగి రూ. 2,001కి చేరింది. సంస్థాగత ఇన్వెస్టర్లు ఆసక్తి కనబరచడంతో నాడు అనూహ్య ప్రీమియంతో లిస్టయింది. లిస్టయిన నాటి నుంచి నేడు అతి తక్కువ స్థాయికి పడిపోయింది.
‘బ్యూటీ, పర్సనల్ కేర్ ఉత్పత్తులకు నైకా చౌకైన ప్లేస్ కానందున ఆ కంపెనీకి విజయం అంత సులువేం కాదు. అలాగే ఇక్కడ ప్రామాణికత అంశాన్ని కూడా నైకా పరిష్కరించలేదు..’ అని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఆగస్టులో విడుదల చేసిన ఒక నివేదికలో విశ్లేషించింది.
ఇక లాజిస్టిక్స్ కంపెనీ ‘డెలివరీ’ స్టాక్ కూడా ఈ దివాళీ కలిసిరాలేదు. కంపెనీ షేర్లు మంగళవారం మరో 3.82 శాతం పడిపోయి రూ. 383.75 స్థాయికి తగ్గాయి.
గడిచిన 5 రోజుల్లో డెలివరీ కంపెనీ స్టాక్స్ 31 శాతం పడిపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలంలో షిప్‌మెంట్ వాల్యూమ్స్‌లో అభివృద్ధి మితంగా ఉంటుందని కంపెనీ అక్టోబరు 20 నాటి సమావేశంలో మార్గనిర్దేశం చేయడం వల్ల ఈ పరిణామం చోటు చేసుకుంది. పూర్తిగా సమీకృత లాజిస్టిక్ సేవలు అందించే సంస్థగా మే నెలలో ఐపీఓకు వచ్చిన డెలివరీ కంపెనీ 1.63 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఆ ఐపీవో ద్వారా రూ. 5,235 కోట్లు సమీకరించింది.
ఐపీఓ ఇష్యూ ప్రైస్ రూ. 487గా ఉండగా.. ప్రస్తుతం ఆ మార్క్ దిగువకు పడిపోవడం ఇది రెండోసారి.
అధిక ద్రవ్యోల్భణం, యూజర్ వ్యయం తగ్గడం, కొనుగోలుదారుల సంఖ్య యథాతథంగా ఉండడం, పండగ సీజన్‌లో ఊహించినంత కొనుగోళ్లు లేకపోవడం వంటి అంశాలను కంపెనీ తన వాటాదారులకు వెల్లడించడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది.