Nvidia stock crash : ఒక్క రోజులో 600 బిలియన్ డాలర్లు ఉఫ్! ఎన్విడియా కొంపముంచిన చైనా 'ఏఐ'
Nvidia share price : అమెరికా టెక్ దిగ్గజ ఎన్విడియా షేర్ ప్రైజ్.. ఒక్క ట్రేడింగ్ సెషన్లో రూ. 5,18,84,43,00,00,000 కోల్పోయింది! చైనాకి చెందిన డీప్‌సీక్ ఏఐ ఇందుకు కారణం.
చైనాకు చెందిన డీప్‌సీక్ ఐఏ.. అమెరికా స్టాక్ మార్కెట్లలో రక్తపాతాని కారణమైంది. సోమవారం ట్రేడింగ్ సెషన్లో టెక్ ఇండెక్స్ నాస్డాక్ 3శాతం పతనమైంది. మరీ ముఖ్యంగా.. ఏఐ వృద్ధిపై భారీ ఆశలు, అంచనాలు పెట్టుకున్న చిప్ తయారీ సంస్థ ఎన్విడియాపై డీప్‌సీక్ ప్రభావం భారీగా పడింది. ఈ ఎన్విడియా స్టాక్.. ఒక్క ట్రేడింగ్ సెషన్లో దాదాపు 600 బిలియన్ డాలర్లను (రూ. 5,18,84,43,00,00,000) కోల్పోయింది. ప్రపంచ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇదే అతిపెద్ద 'సింగిల్ డే లాస్' అని నివేదికలు చెబుతున్నాయి.

అసలేంటి ఈ డీప్‌సీక్..!
డీప్‌సీక్ అనేది చైనాకు చెందిన ఒక ఏఐ స్టార్టప్. గత వారంలో ఆర్1 పేరుతో ఏఐ మోడల్ని ఈ డీప్‌సీక్ ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది. ఇది.. ఓపెన్ఏఐకి చెందిన చాట్‌జీపీటీ సహా ఇతర దిగ్గజ టెక్ కంపెనీల ఏఐలకు గట్టి పోటీనిస్తోంది.
తక్కువ ఖర్చు, తక్కువ స్టోరేజ్, హై- పర్ఫార్మెన్స్, హై- ఎఫీషియెన్సీ.. ఈ డీప్‌సీక్ ప్రత్యేకత! ఫలితంగా.. అమెరికా యాపిల్ యాప్ స్టోర్‌లో చాట్‌జీపీటీని వెనక్కి నెట్టి, ఈ డీప్‌సీక్ ఏఐ యాప్ టాప్‌లోకి దూసుకెళ్లింది.
డీప్‌సీక్ ఏఐకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఎన్విడియా స్టాక్‌లో రక్తపాతం ఎందుకు?
గత కొన్నేళ్లుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో విపరీతమైన అభివృద్ధి కనిపిస్తోంది. ఏడాది కాలంలోనే అనేక కంపెనీలు తమ ఏఐ మోడల్స్‌ని లాంచ్ చేశాయి. చాట్‌జీపీటీ, మెటా ఏఐలకు విపరీతమైన డిమాండ్ కనిపించింది.
అయితే ఈ ఏఐ మోడల్స్‌ని నడిపేందుకు భారీగా ఖర్చు అవుతోంది. మరీ ముఖ్యంగా వీటి కోసం హై ఎండ్ సెమీకండక్టర్ చిప్స్, స్టోరేజ్ వంటివి చాలా చాలా అవసరం. ఇక్కడే ఎన్విడియా కంపెనీకి అదృష్టం కలిసివచ్చింది!
ప్రపంచంలోనే లీడింగ్ చిప్ తయారీ సంస్థ అయిన ఎన్విడియా.. ఏఐ బూమ్‌తో భారీగా లబ్ధిపొందేందుకు రెడీ అయ్యింది. ఈ కంపెనీ తయారు చేసే హై పర్ఫార్మెన్స్ చిప్స్‌కి భారీ డిమాండ్ కనిపించింది. కంపెనీ ఆదాయం, ప్రాఫిట్లు విపరీతంగా పెరుగుతాయని అంచనాలు మొదలయ్యాయి. అందుకు తగ్గట్టుగానే ఎన్విడియా షేరు రెండేళ్ల వ్యవధిలో 20 డాలర్ల నుంచి 150 డాలర్లకు పెరిగింది. కొన్ని నెలల క్రితం.. స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద 'సింగిల్ డే గెయిన్'ని కూడా ఈ ఎన్విడియా చూసింది.
కానీ డీప్‌సీక్ ఎంట్రీతో కథ అడ్డం తిరిగింది! తక్కువ ఖర్చు, తక్కువ సామర్థ్యం గల చిప్స్, తక్కువ స్టోరేజ్తోనే ఏఐ మోడల్స్‌ని సృష్టించవచ్చని ఈ చైనా సంస్థ నిరూపించింది. ఈ డీప్‌సీక్‌ని చూసి రానున్న రోజుల్లో మరిన్ని ఏఐ కంపెనీలు పుట్టుకురావొచ్చు. ఈ నేపథ్యంలో ఎన్విడియా రూపొందించే హై కాస్ట్, హై పర్ఫార్మెన్స్ చిప్స్‌కి డిమాండ్ తగ్గిపోతుందని మదుపర్లు భావించారు. ఫలితంగా సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎన్విడియా స్టాక్ ప్రైజ్ దాదాపు 17శాతం పతనమైంది.
ఎన్విడియా షేర్ ప్రైజ్..
శుక్రవారం 142.62 డాలర్ల దగ్గర క్లోజ్ అయిన ఎన్విడియా షేరు ధర సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఏకంగా 124.80 డాలర్ల వద్ద ఓపెన్ అయ్యింది. 116.70 డాలర్ల వద్ద ఇంట్రాడే- లోని నమోదు చేసి, చివరికి 118.58 డాలర్ల వద్ద స్థిరపడింది. సింగిల్ ట్రేడింగ్ సెషన్లో ఇది 16.86శాతం నష్టం! ఫలితంగా ఒక్క రోజులో ఎన్విడియా స్టాక్ 600 బిలియన్ డాలర్లను కోల్పోయింది.
సంబంధిత కథనం