నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) తన బెంచ్‌మార్క్ సూచీల్లో భారీ మార్పులను ప్రకటించింది. ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (జేఎఫ్ఎస్ఎల్) మార్చి 28, 2025 నుంచి ప్రారంభమయ్యే అర్ధ-వార్షిక పునర్వ్యవస్థీకరణలో.. నిఫ్టీ50 ఇండెక్స్‌లోకి ప్రవేశించనున్నాయి. ఈ రెండూ చేరడం, న్యూ ఏజ్ టెక్నాలజీ షేర్లపై ఇన్వెస్టర్ల నమ్మకాన్ని సూచిస్తుంది. అంతేకాదు, భారతదేశం అత్యంత విస్తృతంగా ట్రాక్ చేసే దేశీయ బెంచ్‌మార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఇండెక్స్‌కి డిజిటల్-యుగం స్టాక్స్ మొదటి చేర్పులను సూచిస్తుంది.
నిఫ్టీ 50 ఇండెక్స్ రివిజన్ల ప్రకారం ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీ (ఓఎంసీ) అయిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) దిగ్గజం బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్లను ఇండెక్స్ నుంచి తీసేస్తున్నారు.
గతేడాది చివరిలో జొమాటోను బీఎస్ఈ సెన్సెక్స్‌లో చేర్చారు. ఎన్ఎస్ఈ ఇండెక్స్ లిమిటెడ్ ఇండెక్స్ మెయింటెనెన్స్ సబ్ కమిటీ మార్చి 28, 2025 నుంచి అమల్లోకి వచ్చే తన అర్ధ-వార్షిక సమీక్షలో భాగంగా నిఫ్టీ50 ఇండెక్స్‌లో మార్పులను ప్రకటించింది. ఈ మార్పులు ప్రస్తుత మార్కెట్ ధోరణులను ఖచ్చితంగా ప్రతిబింబిస్తాయి.
జొమాటో, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్‌లు నిఫ్టీ 50 ఇండెక్స్‌లో చేరడానికి కారణం.. గత ఆరు నెలల్లో వాటి సగటు ఫ్రీ-ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది బీపీసీఎల్, బ్రిటానియా కంటె కనీసం 1.5 రెట్లు ఎక్కువ. జొమాటో మార్కెట్ క్యాప్ రూ.1,69,837 కోట్లు కాగా, జియో ఫైనాన్షియల్ మార్కెట్ క్యాప్ రూ.1,04,387 కోట్లు. బీపీసీఎల్ రూ.60,928 కోట్లు, బ్రిటానియా రూ.64,151 కోట్ల మార్కెట్ క్యాప్స్ కలిగి ఉన్నాయి.
ఆగస్టు 1 నుంచి జనవరి 31 వరకు సగటు ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ ఆధారంగా ఈ రీబ్యాలెన్సింగ్ జరుగుతుంది. నిఫ్టీ 50 ఇండెక్స్‌లో చేరడానికి అర్హత పొందేందుకు స్టాక్ ఎఫ్ అండ్ ఓ విభాగంలో భాగంగా ఉండాలి. వీటితో పాటు నిఫ్టీ100, నిఫ్టీ200 సహా పలు సూచీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.
నువామా వెల్త్ మేనేజ్మెంట్ ఆల్టర్నేటివ్ & క్వాంటిటేటివ్ రీసెర్చ్ ప్రకారం.. నిఫ్టీ50 ఇండెక్స్‌లో చేర్చడం వల్ల జొమాటో షేర్లలో 631 మిలియన్ డాలర్లు, జియో ఫైనాన్స్ షేర్లలో 320 మిలియన్ డాలర్ల విలువైన గణనీయమైన ప్రవాహాలకు దారితీసే అవకాశం ఉంది. మరోవైపు బీపీసీఎల్, బ్రిటానియా ఇండస్ట్రీస్‌ని మినహాయిస్తే వరుసగా 201 మిలియన్ డాలర్లు, 240 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు వెళ్లిపోయే అవకాశం ఉంది.
సంబంధిత కథనం