ఎన్​ఆర్​ఐల చూపు అంతా ఈ నగరంలోని రియల్​ ఎస్టేట్​ వైపే- భారీగా పెరగనున్న ధరలు..!-nris bet big on bengaluru real estate driven by strong dollar and us visa woes ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఎన్​ఆర్​ఐల చూపు అంతా ఈ నగరంలోని రియల్​ ఎస్టేట్​ వైపే- భారీగా పెరగనున్న ధరలు..!

ఎన్​ఆర్​ఐల చూపు అంతా ఈ నగరంలోని రియల్​ ఎస్టేట్​ వైపే- భారీగా పెరగనున్న ధరలు..!

Sharath Chitturi HT Telugu

క్రెడాయ్ బెంగళూరు అధ్యక్షుడు జాయ్ద్ నోవామన్ మాట్లాడుతూ, నగర రియల్ ఎస్టేట్​పై ఎన్​ఆర్​ఐ ఆసక్తి పెరుగుతోందని, బలమైన డాలర్ కారణంగా భారతీయ పెట్టుబడులు మరింత ఆకర్షణీయంగా మారుతున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరులో రియల్​ ఎస్టేట్​ ధరలు పెరగొచ్చని అంచనా వేశారు.

ఈ నగరంలో భారీగా పెరగనున్న ధరలు..!

నగర రియల్ ఎస్టేట్ రంగంలో దేశీయ కొనుగోలుదారుల ఆధిపత్యం కొనసాగుతున్నప్పటికీ, ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐ) నుండి కూడా డిమాండ్ పెరుగుతోందని క్రెడాయ్ (కాన్ఫిడరేషన్​ ఆఫ్​ రియల్​ ఎస్టేట్​ డెవలపర్స్​ అసోసియేషన్​ ఆఫ్​ ఇండియా) బెంగళూరు అధ్యక్షుడు జాయ్ద్ నోమన్ తెలిపారు. డాలర్ విలువ బలపడటం, అమెరికాలో కొనసాగుతున్న వీసా సవాళ్లు ఇందుకు కారణం అని వివరించారు. ఈ మేరకు హెచ్​టీతో జరిగిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

ఎన్​ఆర్​ఐల చూపు బెంగళూరు రియల్​ ఎస్టేట్​ వైపు..!

డాలర్ బలపడటం వల్ల భారతీయ రియల్ ఎస్టేట్ పెట్టుబడులు ఎన్ఆర్ఐలకు, ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడి కోసం అణ్వేషిస్తున్న వారికి మరింత ఆకర్షణీయంగా మారాయని జాయ్ద్​ నోమన్​ అన్నారు.

“ఇటీవలి సంవత్సరాల్లో, ఎన్ఆర్ఐ భాగస్వామ్యంలో గణనీయమైన పెరుగుదలను చూశాము. డాలర్ బలపడటం వల్ల భారతీయ పెట్టుబడులు మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక అవకాశాల కోసం చూస్తున్న వారికి ఇది ఉపయోగకరంగా ఉంది,” అని నోమన్ అన్నారు.

అమెరికా వీసాల చుట్టూ ఉన్న అనిశ్చితులు చాలా మంది ఎన్ఆర్ఐలను భారతదేశ దీర్ఘకాలిక గ్రోత్​ స్టోరీపై ఎక్కువ నమ్మకాన్ని పెట్టుకోవడానికి ప్రేరేపించాయని నోమన్​ పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికాలో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో పరిస్థితులు చక్కబడిన తర్వాత భారత్​లోకి పెట్టుబడులు తిరిగి వస్తాయని అంచనా వేస్తున్నట్లు అభిప్రాయపడ్డారు.

పెరిగిన ఎన్ఆర్ఐ పెట్టుబడులతో బెంగళూరు రియల్ ఎస్టేట్ మార్కెట్​పై సానుకూల ప్రభావం పడుతుందని నోవామన్ ఆశాభావం వ్యక్తం చేశారు. అదే సమయంలో ప్రస్తుత స్థాయిల నుంచి ప్రాపర్టీ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ చేసే సుంకాల ప్రకటనలు వంటివి ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో అనివార్య మార్పులకు దారి తీసినప్పటికీ, అవి భారతీయ స్థిరాస్తి రంగంపై పెద్దగా ప్రభావం చూపించవని నోమన్​ తెలిపారు. పరిశ్రమ ప్రాథమిక దృష్టి సృజనాత్మకతను ప్రోత్సహించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంపై ఉండాలని ఆయన అన్నారు.

స్థానిక తయారీ రంగానికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వం చేపట్టిన ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం రియల్ ఎస్టేట్ రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు దీర్ఘకాలంలో విస్తృత ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు దోహదపడుతుందని నోమన్​ అభిప్రాయపడ్డారు.

వేతన జీవులే అధికం..!

నోమన్ మాట్లాడుతూ టెక్ పరిశ్రమకు సమగ్ర పర్యావరణ వ్యవస్థను బెంగళూరు అందిస్తుందని, విద్య, బలమైన టాలెంట్ పూల్, రియల్ ఎస్టేట్ రంగానికి పుష్కలమైన అవకాశాలను కల్పిస్తుందని అన్నారు.

బెంగళూరులో రియల్ ఎస్టేట్ కొనుగోలుదారుల్లో ఎక్కువ మంది వేతన జీవులేనని, వీరిలో గణనీయమైన సంఖ్యలో గృహ రుణాలపై ఆధారపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. వీరిలో అత్యధికులు ఐటీ కంపెనీల్లో లేదా టెక్ పరిశ్రమకు తోడ్పడే పాత్రల్లో పనిచేస్తున్నారు. అపార్ట్​మెంట్ ధరలు పెరుగుతున్న కొద్దీ సీఎక్స్​ఓలు, బిజినెస్ ప్రొఫెషనల్స్, ముఖ్యంగా టెక్నాలజీ రంగంతో ముడిపడి ఉన్నవారి నుంచి ఆసక్తి పెరుగుతోందని తెలిపారు.

హౌసింగ్ సేల్స్ విషయానికొస్తే.. గత ఏడాదితో పోలిస్తే 2025 మొదటి త్రైమాసికంలో బెంగళూరులో అమ్మకాలు స్వల్పంగా తగ్గాయని నోమన్ పేర్కొన్నారు. ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) రంగం మాదిరిగా కాకుండా, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అనుమతులు, సమ్మతిపై ఎక్కువగా ఆధారపడి ఉంటుందని, ఇది ప్రాజెక్ట్ లాంచింగ్​లో జాప్యానికి దారితీస్తుందని వివరించారు.

గత ఏడాది జరిగిన పలు ఎన్నికలు కూడా ఆమోద ప్రక్రియను నెమ్మదించాయని నోమన్​ అభిప్రాయపడ్డారు.

“ప్రస్తుతం, బెంగళూరు ప్రధాన నగరాల్లో అతి తక్కువ స్థాయిలో అమ్ముడుపోని ఇన్వెంటరీని కలిగి ఉంది. మార్కెట్​లో కేవలం 2-3 సంవత్సరాల విలువైన సరఫరా మాత్రమే అందుబాటులో ఉంది. పాత ఇన్వెంటరీ తగ్గిపోయే తరుణంలో, కొత్త అనుమతులు వేగవంతం చేస్తే, సరఫరా పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది,” అని నోమన్ చెప్పారు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం