ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ప్రీమియం ఫోన్‌లు సరికొత్త ఆవిష్కరణలతో కస్టమర్ల ముందుకు వస్తున్నాయి. నథింగ్ ఫోన్ 3- వన్‌ప్లస్ 13 వంటి మోడల్స్ ఈ ట్రెండ్‌కి చక్కటి ఉదాహరణలు. ఈ రెండు ఫోన్‌ల ధరలు దాదాపు ఒకే విధంగా ఉన్నప్పటికీ, వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఇవి వేర్వేరు మార్గాలను ఎంచుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్స్ మధ్య ఉన్న ప్రధాన తేడాలు, ఏది కొంటే బెటర్? వంటి వివరాలను ఇక్కడ చూసేయండి.
నథింగ్ ఫోన్ 3 తన ప్రత్యేకమైన డిజైన్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ట్రాన్స్పరెంట్ బ్యాక్ ప్యానెల్ దీనికి బోల్డ్ లుక్‌ను ఇస్తుంది. గొరిల్లా గ్లాస్ విక్టస్, ఐపీ68 రేటింగ్‌తో, ఇది డిజైన్- మన్నికను కలుపుతుంది. అయితే, 9ఎంఎం థిక్నెస్ కారణంగా ఇది జేబులో కొంత ప్లేస్‌ని ఆక్రమించవచ్చు. వన్‌ప్లస్ 13 మాత్రం సాదాసీదా డిజైన్‌ను ఎంచుకుంది. దాని గ్లాస్-పాలిమర్ బిల్డ్, అల్యూమినియం ఫ్రేమ్, ఐపీ68/ఐపీ69 రేటింగ్ మన్నికకు ప్రాధాన్యత ఇస్తాయి. 8.9ఎంఎం మందం, 213 గ్రాముల బరువుతో, ఇది పట్టుకోవడానికి సులభంగా, సున్నితంగా అనిపిస్తుంది.
నథింగ్ ఫోన్ 3 6.67-ఇంచ్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే 120హెచ్‌జెడ్ స్మూత్‌నెస్‌ను అందిస్తుంది. అయితే, అడాప్టివ్ రిఫ్రెష్ లేకపోవడం వల్ల వేగంగా కదిలే కంటెంట్ అంత చురుకుగా కనిపించకపోవచ్చు. వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ ఎల్‌టీపీఓ 120హెచ్‌జెడ్ అమోలెడ్, డాల్బీ విజన్ హెచ్‌డీఆర్, సెరామిక్ గార్డ్ గ్లాస్ రక్షణతో కూడిన మెరుగైన అనుభవాన్ని అందిస్తుంది. ఇది స్ట్రీమర్‌లు, గేమర్‌లు, క్రియేటివ్‌లకు అనుకూలంగా ఉంటుంది.
నథింగ్ ఫోన్ 3 స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 4 చిప్, గరిష్టంగా 16జీబీ ర్యామ్‌తో వస్తుంది. ఇది రోజువారీ పనులు, గేమింగ్‌ను సులభంగా నిర్వహిస్తుంది. అయితే, వన్‌ప్లస్ 13లోని స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్, 24GB వరకు ర్యామ్ మరింత శక్తివంతంగా ఉంటాయి. డిమాండింగ్ మల్టీటాస్కింగ్, హెవీ యాప్‌లు, భవిష్యత్ అవసరాలకు ఇది అనుకూలం. రెండు ఫోన్‌లు ఆధునిక ఆండ్రాయిడ్ 15 ఇంటర్‌ఫేస్‌లను అందిస్తాయి. నథింగ్ ఓఎస్ ఐదేళ్ల ఓఎస్ అప్‌డేట్‌లను అందిస్తే, వన్‌ప్లస్ నాలుగు సంవత్సరాలు మాత్రమే అందిస్తుంది.
రెండు స్మార్ట్ఫోన్లు ఓఐఎస్‌తో కూడిన 50ఎంపీ ట్రిపుల్ రియర్ సెన్సార్‌లను ఉపయోగిస్తాయి. అయితే, నథింగ్ ఫోన్ 3లోని 50ఎంపీ ఫ్రెంట్ కెమెరా వీడియో కాల్‌లు, సెల్ఫీలకు మరింత అనుకూలంగా ఉంటుంది. వన్‌ప్లస్ 13లోని 32ఎంపీ సెల్ఫీ సెన్సార్ కూడా విభిన్న పరిస్థితుల్లో మంచి ఫలితాలను ఇస్తుంది.
నథింగ్ ఫోన్ 3లోని 5500ఎంఏహెచ్ బ్యాటరీ రోజువారీ అవసరాలకు సరిపోతుంది. ఇది 65వాట్ వైర్డ్, 15వాట్ వైర్‌లెస్, పరిమిత రివర్స్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. కానీ ఛార్జింగ్ అడాప్టర్ బాక్స్‌లో ఉండదు! వన్‌ప్లస్ 13 6000ఎంఏహెచ్ బ్యాటరీతో, వేగవంతమైన 100వాట్ వైర్డు ఛార్జింగ్, 50వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్, బాక్స్‌లోనే ఛార్జింగ్ ఉపకరణాలతో వస్తుంది.
ఇండియాలో నథింగ్ ఫోన్ 3 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 79,999గా ఉంది. జులై 4న ప్రీ-ఆర్డర్లు మొదలవుతాయి. ఇక మార్కెట్‌లో వన్‌ప్లస్ 13 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 69,999గా ఉంది.
సంబంధిత కథనం