SIM card fraud: ‘ఈ- సిమ్’ కార్డు పేరుతో కొత్త సైబర్ స్కామ్; 27 లక్షలు మోసపోయిన మహిళ; ఇలా జాగ్రత్త పడండి..-noida woman loses rs 27 lakh sim card fraud heres what went wrong ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Sim Card Fraud: ‘ఈ- సిమ్’ కార్డు పేరుతో కొత్త సైబర్ స్కామ్; 27 లక్షలు మోసపోయిన మహిళ; ఇలా జాగ్రత్త పడండి..

SIM card fraud: ‘ఈ- సిమ్’ కార్డు పేరుతో కొత్త సైబర్ స్కామ్; 27 లక్షలు మోసపోయిన మహిళ; ఇలా జాగ్రత్త పడండి..

Sudarshan V HT Telugu
Sep 14, 2024 03:56 PM IST

ఈ - సిమ్ కార్డు మోసం బారిన పడిన ఒక మహిళ రూ. 27 లక్షలు పోగొట్టుకుంది. ఈ సిమ్ కార్డు యాక్టివేట్ చేస్తానంటూ నకిలీ టెలికాం ఎగ్జిక్యూటివ్ చేసిన వాట్సాప్ కాల్ ను నమ్మిన ఆ మహిళ రెండు రోజుల వ్యవధిలో రూ. 27 లక్షలు మోసపోయింది.

‘ఈ- సిమ్’ కార్డు పేరుతో కొత్త సైబర్ స్కామ్; 27 లక్షలు మోసపోయిన మహిళ
‘ఈ- సిమ్’ కార్డు పేరుతో కొత్త సైబర్ స్కామ్; 27 లక్షలు మోసపోయిన మహిళ

తాను టెలీకాం సంస్థ ఎగ్జిక్యూటివ్ నని, స్మార్ట్ ఫోన్ లో ఎంబెడెడ్ సిమ్ (e-SIM) ను యాక్టివేట్ చేస్తామని వాట్సాప్ కాల్ లో చెప్పిన వ్యక్తిని నమ్మిన ఒక మహిళ రూ.27 లక్షలు పోగొట్టుకుంది. రెండు రోజుల తరువాత మోసపోయిన విషయం గుర్తించి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

అసలేం జరిగింది?

నోయిడా సెక్టార్ 82లో నివసించే జ్యోత్సానా భాటియాకు టెలికాం సంస్థ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ గా నటిస్తూ ఓ వ్యక్తి నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. ఒకవేళ మొబైల్ ఫోన్ పోతే, యాక్టివేట్ అయ్యే ఈ-సిమ్ (e-SIM) కొత్త ఫీచర్ గురించి సదరు వ్యక్తి ఆమెకు వివరించాడు. ఆ కాల్ ను నమ్మిన మహిళ ఈ-సిమ్ కు మారేందుకు అంగీకరించి తనకు మెసేజ్ లో వచ్చిన కోడ్ ను ఆ వ్యక్తితో పంచుకుంది. మరో 2-3 రోజుల్లో ఆమెకు ఫిజికల్ సిమ్ కూడా ఇస్తానని మోసగాడు మహిళకు హామీ ఇచ్చాడు. ఆ తరువాత ఆమె ఫోన్ లో ఉన్న సిమ్ డీ యాక్టివేట్ అయింది.

మూడు రోజుల్లో సిమ్ కార్డు రాలేదు

సిమ్ కార్డు డీయాక్టివేట్ అయిన మూడు రోజుల తర్వాత మహిళకు కొత్త సిమ్ కార్డు రాకపోవడంతో ఆమె కస్టమర్ కేర్ నంబర్ కు డయల్ చేసింది. డూప్లికేట్ సిమ్ కోసం సర్వీస్ సెంటర్ కు రావాలని ఆమెకు కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ సూచించారు. దాంతో ఆమె సర్వీస్ సెంటర్ కు వెళ్లి కొత్త సిమ్ కార్డు తీసుకుంది. ఆ సిమ్ ను తన ఫోన్ లో వేసుకుని తన నంబర్ ను యాక్టివేట్ చేశారు.

వరుస మెసేజ్ లు..

ఆ వెంటనే ఆమె ఫోన్ కు వరుసగా మెసేజ్ లు రావడం ప్రారంభమైంది. ఆమె బ్యాంక్ ఖాతా నుండి డబ్బులు డిడక్ట్ అయినట్లు ఆ మెసేజ్ ల్లో ఉంది. ‘‘ఆ సైబర్ నేరస్తుడు నా ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బులను తీసుకున్నాడు. రెండు బ్యాంకు ఖాతాల నుండి డబ్బును దారి మళ్లించాడు. నాకు తెలియకుండా నా పేరు మీద రూ .7.40 లక్షల రుణం తీసుకున్నాడు" అని భాటియా పోలీసులకు తెలిపారు. అంతేకాక, నిందితుడు ఆమె మొబైల్ నంబర్ ద్వారా ఆమె మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ను కూడా యాక్సెస్ చేశాడు. ఆమె ఈమెయిల్ ఐడీని కూడా మార్చి పలు లావాదేవీలు నిర్వహించి మొత్తంగా సుమారు రూ. 27 లక్షల నగదును డెబిట్ చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు.

నోయిడా ఈసిమ్ మోసం కేసు: ఏం తప్పు జరిగింది?

ఆ మహిళ చేసిన పలు పొరపాట్ల కారణంగానే డబ్బులు మోసపోయింది. అందులో, మొదటిది కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పిన వ్యక్తి చేసిన వాట్సాప్ కాల్ ను విశ్వసించడం. సాధారణంగా, కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ వాట్సాప్ కాల్స్ చేయరు. అలాగే, ఆమె చేసిన మరో తప్పు గుర్తు తెలియని వ్యక్తికి ఫోన్ లో ఓటీపీ, పాస్ వర్డ్ షేర్ చేయడం. ఈ తప్పుల కారణంగా ఆమె రూ. 27 లక్షలు కోల్పోయారు.

ఈసిమ్ కార్డు మోసాన్ని ఎలా నివారించాలి?

- ఈ - సిమ్ అనేది డిజిటల్ సిమ్ కార్డు. దీన్ని ఉపయోగిస్తే, ఫిజికల్ చిప్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. అధికారిక వెబ్ సైట్ సోర్స్ లేదా సర్వీస్ సెంటర్లో టెలికాం ఎగ్జిక్యూటివ్ ను వ్యక్తిగతంగా కలిసిన తర్వాత మాత్రమే ఈ - సిమ్ కు మారాలి.

  • పాస్ వర్డ్, లేదా ఓటీపీ వంటి సున్నితమైన సమాచారాన్ని ఫోన్ ద్వారా షేర్ చేయకండి.
  • కొత్త ఫీచర్లు లేదా సేవలకు సంబంధించి అవాంఛిత కాల్స్ లేదా సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండండి.
  • వాట్సాప్ (whatsapp) వంటి అప్లికేషన్ల నుంచి వచ్చే కాల్స్ ను విశ్వసించవద్దు.
  • బ్యాంకు ఖాతాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే నివేదించండి.