Vehicle Insurance : ఇన్సూరెన్స్ లేని వాహనం టోల్ గేట్ దాటితే ఆటోమేటిక్‌గా చలానా.. జైలు శిక్ష కూడా!
e-Detection system : ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం ఇప్పుడు ఒడిశాలో ఖరీదైనది. ఎందుకంటే కారుకు బీమా లేకపోతే కారు టోల్ గేట్ దాటిన వెంటనే ఆటోమేటిక్ చలాన్ వస్తుంది.
రోడ్లపై ఇన్సూరెన్స్ లేని వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. చాలా మంది వెహికల్ ఇన్సూరెన్స్‌ను లైట్ తీసుకుంటున్నారు. వాహన యజమానులు ప్రమాదంలో పడటమే కాకుండా రోడ్డు ప్రమాదాల బాధితులకు కూడా సరైన పరిహారం అందడం లేదు. ఇప్పుడు ఈ సమస్యను తొలగించేందుకు ఒడిశా స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. 2025 ఫిబ్రవరి 1 నుంచి ఒడిశాలోని 22 టోల్‌గేట్ల్ వద్ద ఈ-డిటెక్షన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, ఇది బీమా లేని వాహనాలను గుర్తించి ఆటోమేటిక్‌గా ఈ-చలాన్లు జారీ చేస్తుందని అధికారులు తెలిపారు.
ఈ-డిటెక్షన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది?
టోల్ గేట్ల వద్ద ఏర్పాటు చేసిన ఈ-డిటెక్షన్ వ్యవస్థలు వెంటనే వాహనాల బీమా చెల్లుబాటును చెక్ చేస్తాయి. ఇన్సూరెన్స్ లేకుండా వాహనం కనిపిస్తే తొలిసారి రూ.2,000 చలానా విధిస్తారు. మళ్లీ అదే వాహనం పట్టుబడితే రూ.4 వేల చలానా వేస్తారు. దీంతోపాటు నేరం రుజువైన వాహన యజమానికి మూడు నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో జైలు, జరిమానా రెండూ పడవచ్చు.
ఈ విధానం దేనికి?
చాలా మంది తమ వాహనాలకు సకాలంలో ఇన్సూరెన్స్ చేయించుకోవడం లేదని, దీనివల్ల రోడ్డు ప్రమాదాల బాధితులకు పరిహారం అందడం లేదని అధికారులు చెబుతున్నారు. ఈ కొత్త విధానం ద్వారా రోడ్డుపై తిరిగే అన్ని వాహనాలకు చెల్లుబాటు అయ్యే బీమా ఉండేలా చూడాలని, తద్వారా ప్రమాదం జరిగితే నష్టాన్ని పూడ్చుకోవచ్చని ఒడిశా ప్రభుత్వం భావిస్తోంది.
ఈ-డిటెక్షన్ విధానాన్ని అమలు చేయడం ఇదే తొలిసారి కాదు. కొన్ని నెలల క్రితం బీహార్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 32 టోల్ ప్లాజాల వద్ద ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసింది. పీయూసీ (పొల్యూషన్ అండర్ కంట్రోల్) సర్టిఫికెట్లను తనిఖీ చేయడానికి కూడా ఈ వ్యవస్థను ఉపయోగించారు. పీయూసీ లేకుండా కనిపిస్తే వాహన యజమానికి రూ.10 వేలు జరిమానా విధించారు.
బిహార్‌లో అమలు చేసిన ఈ విధానం కేవలం రెండు రోజుల్లోనే 5 వేలకు పైగా ఈ-చలాన్లను జారీ చేసింది. భవిష్యత్తులో పాట్నా, ముజఫర్ పూర్, భాగల్ పూర్ తదితర స్మార్ట్ సిటీల్లో కూడా ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఇప్పుడు ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడుపుతున్నట్లయితే అప్రమత్తంగా ఉండాలి. ఒడిశా, బిహార్ వంటి రాష్ట్రాల్లో అమలు చేసిన ఈ-డిటెక్షన్ వ్యవస్థను త్వరలో ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించే అవకాశం ఉంది. ఇది రహదారి భద్రతను మెరుగుపరచడమే కాకుండా రోడ్డు ప్రమాద కేసులలో న్యాయం చేసేందుకు కూడా సహాయపడుతుంది.