Trump tariffs : అన్నంత పని చేసిన ట్రంప్! ఒకేసారి 3 దేశాలపై 'టారీఫ్' అస్త్రం..
డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు! మూడు దేశాలపై సుంకాలను విధించారు. ఫలితంగా.. ట్రంప్ చర్యలతో అమెరికా వృద్ధి తగ్గడమే కాదు, 3 దేశాల్లోని రెండింటిలో ఆర్థిక మాంద్యం సంభవించే ప్రమాదం కూడా ఏర్పడింది!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు! ఒకేసారి 3 దేశాలపై టారీఫ్‌ను వేసి అందరికి షాక్ ఇచ్చారు. ‘మేక్ అమెరికా గ్రేట్ అగెయిన్’ నినాదంతో అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ తాజా నిర్ణయంతో అగ్రరాజ్య ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఒకేసారి 3 దేశాలపై సుంకాలు..
కెనడా, మెక్సికన్ దిగుమతులపై 25 శాతం, చైనా నుంచి వచ్చే వస్తువులపై 10 శాతం సుంకం విధించినట్లు వైట్‌హౌస్ అధికారులు తెలిపారు.
అక్రమ వలసలు, ఫెంటానిల్ కోసం ఉపయోగించే రసాయనాల స్మగ్లింగ్‌ని అరికట్టేందుకు పొరుగు దేశాల నుంచి మరింత సహకారం లభించేలా సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. దేశీయ తయారీని పెంచడానికి, ఫెడరల్ ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచడానికి ఆ సుంకాలను ఉపయోగిస్తామని అమెరికా అధ్యక్షుడు హామీ ఇచ్చారు.
"ఈ రోజు, నేను మెక్సికో, కెనడా దిగుమతులపై 25% సుంకం (కెనడియన్ ఎనర్జీపై 10%), చైనాపై 10% అదనపు సుంకాన్ని అమలు చేశాను. ఫెంటానిల్ సహా మన దేశంలోకి వస్తున్న అక్రమ విదేశీయులు, ప్రాణాంతక మాదకద్రవ్యాలను అరికట్టేందుకు అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (ఐఈఈపీఏ) ద్వారా ఈ సుంకాలు విధించాను. మనం అమెరికన్లను రక్షించాల్సిన అవసరం ఉంది. అందరి భద్రతను నిర్ధారించడం అధ్యక్షుడిగా నా కర్తవ్యం. అక్రమ విదేశీయులు, మాదకద్రవ్యాల వరద మన సరిహద్దుల గుండా ప్రవహించకుండా నిరోధించడానికి నేను నా ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశాను. అమెరికన్లు దీనికి అనుకూలంగా ఓటు వేశారు," అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో ఒక పోస్ట్ చేశారు.
రిపబ్లికన్ అధ్యక్షుడు ట్రంప్ తన చర్యకు చట్టపరంగా మద్దతు ఇవ్వడానికి అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం కింద "జాతీయ అత్యవసర పరిస్థితిని" ప్రకటించారు. దీంతో సంక్షోభాలను పరిష్కరించేందుకు అమెరికా అధ్యక్షుడికి విస్తృత అధికారాలు లభించనున్నాయి.
అయితే మెక్సికన్ ఎనర్జీ దిగుమతులపై 25శాతం సుంకంతో పోల్చితే, యూఎస్‌కి కెనడా చేసే ఎనర్జీ ఎగుమతులపై విధించిన 10శాతం సుంకం తక్కువగానే ఉంది.
సుంకాల నుంచి ఎలాంటి మినహాయింపులు ఉండవని వైట్‌హౌస్ అధికారులు తేల్చిచెప్పారు. కెనడా నుంచి 800 డాలర్లలోపు విలువ చేసే చిన్న ఎగుమతులపై సుంకాలను మినహాయించే 'డీ కమిస్' నిబంధనను కూడా రద్దు చేసినట్టు వివరించారు.
ట్రంప్ ఆదేశాల ప్రకారం మంగళవారం అర్ధరాత్రి 12:01 గంటలకు (భారత కాలమానం ప్రకారం 05:01 గంటలకు) సుంకాలు అమల్లోకి వస్తాయి. రవాణాలో ఉన్న వస్తువులు, కటాఫ్ సమయానికి ముందే అమెరికా సరిహద్దులోకి ప్రవేశించే వారికి సుంకాల నుంచి మినహాయింపు ఉంటుంది!
సరిహద్దు వెంబడి సంక్షోభం తగ్గే వరకు సుంకాలు అమలు చేస్తామని వైట్‌హౌస్ తెలిపింది. అయితే ట్రంప్ టారిఫ్ ఆర్డర్ల నుంచి మినహాయింపు పొందేందుకు మూడు దేశాలు తీసుకోబోయే చర్యలపై అధికారులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
ఆర్థిక వృద్ధిపై ప్రభావం తప్పదా..?
ట్రంప్ విధించిన ఈ సుంకాలతో ఈ ఏడాది అమెరికా ఆర్థిక వృద్ధి 1.5% తగ్గుతుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ట్రంప్ తీసుకున్న ఈ ఒక్క నిర్ణయంతో కెనడా, మెక్సికోలు ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటాయని హెచ్చరిస్తున్నారు.
సంబంధిత కథనం