ఫ్యాక్టరీలు బంద్​, 20వేల ఉద్యోగాలు కట్​- తీవ్ర కష్టాల్లో దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ!-nissan shuts plants slashes jobs after worst loss in 25 years ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఫ్యాక్టరీలు బంద్​, 20వేల ఉద్యోగాలు కట్​- తీవ్ర కష్టాల్లో దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ!

ఫ్యాక్టరీలు బంద్​, 20వేల ఉద్యోగాలు కట్​- తీవ్ర కష్టాల్లో దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ!

Sharath Chitturi HT Telugu

దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ నిస్సాన్​ తీవ్ర కష్టాల్లో పడింది. గత ఆర్థిక ఏడాదిలో అత్యధిక నష్టాలు నమోదు చేసిన ఈ సంస్థ, ప్రస్తు ఫైనాన్షియల్​ ఇయర్​లో ఆపరేటింగ్​ ప్రాఫిట్​ అంచనాలను చెప్పేందుకు వెనకాడింది. ఇప్పుడు 20వేలకుపైగా ఉద్యోగాలను తొలగించేందుకు సిద్ధపడింది.

తీవ్ర కష్టాల్లో దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ! (Representative)

దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ నిస్సాన్​ తీవ్ర సంక్షోభంలోకి జారుకుంది! మార్చ్​తో ముగిసిన ఆర్థిక ఏడాదిలో అతిపెద్ద నష్టాలను నమోదు చేసింది. 25ఏళ్లల్లోనే అత్యధిక నష్టాలను నమోదు చేయడంతో కాస్ట్​ కటింగ్​ చర్యలను ప్రకటించి 7 ఫ్యాక్టరీలు మూసివేస్తున్నట్టు, 20వేలకుపైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్టు వెల్లడించింది.

నిస్సాన్​కు ఏమైంది?

మార్చ్​తో ముగిసిన ఆర్థిక ఏడాదిలో నిస్సాన్​ ఏకంగా 670.9 బిలియన్​ యెన్​ల నష్టాన్ని నమోదు చేసింది. అంతేకాదు, 2026 ఆర్థిక ఏడాదికి సంబంధించి ఆపరేటింగ్​ ప్రాఫిట్​ అంచనాలను కూడా చెప్పేందుకు వెనకాడింది!

ఫ్రెంచ్​ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్​.. నిస్సాన్​ని దివాళా నుంచి ఆదుకున్న 25ఏళ్లల్లో పరిస్థితులు ఈ స్థాయిలో దిగజారిపోవడం ఇదే తొలిసారి.

భారీ నష్టాల నేపథ్యంలో నిస్సాన్​ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం 17గా ఉన్న ఫ్యాక్టరీల సంఖ్యను 2027 ఆర్థిక ఏడాది నాటికి 10కి తగ్గించనున్నట్టు వెల్లడించింది. గతేడాది 3.5 మిలియన్​ యూనిట్​లుగా ఉన్న ఉత్పత్తిని 2.5 మిలియన్​కి తగ్గించనున్నట్టు స్పష్టం చేసింది. 20వేల ఉద్యోగాలను తీసేస్తున్నట్టు పేర్కొంది. వీటి వల్ల 500 బిలియన్​ యెన్​ ఖర్చు తగ్గుతుందని సంస్థ భావిస్తోంది.

అమెరికా, చైనాలో సేల్స్​ సరిగ్గా జరగకపోతుండటం నిస్సాన్​ని భారీగా దెబ్బకొట్టింది. హోండా మోటార్​ కంపెనీతో భాగస్వామ్యం ఏర్పరచుకునేందుకు సంస్థ చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారాయి.

నిస్సాన్​ భవితవ్యం ఇప్పుడు ఆ కంపెనీ సీఈఓ ఇవాన్​ ఎస్పినోసాపై ఆధారపడి ఉంది. మాజీ సీఈఓ మకోటా ఉచిడా జాబ్స్​ కట్​ చేసి ఖర్చులు తగ్గించుకోలేదన్న విమర్శల నేపథ్యంలో ఇవాన్​ చర్యలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. "వాస్తవం చాలా స్పష్టంగా ఉంది. నిస్సాన్​ సంస్థ స్వీయ అభివృద్ధివైపు వేగంగా, అర్జెంటుగా అడుగులు వేయాలి," అని ఇవాన్​ అన్నారు.

కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ వేసిన టారీఫ్​ రూపంలో నిస్సాన్​పై మరో పిడుగు పడింది. యూఎస్​ టారీఫ్​ వల్ల కంపెనీకి మొత్తం మీద 450 బిలియన్​ యెన్​ నష్టం వాటిల్లుతుందని సంస్థ చెప్పింది. ఈ ఆర్థిక ఏడాది మొదటి త్రైమాసికంలో అంచనా వేసిన 200 బిలియన్​ యెన్​ నష్టానికి ఇది అదనపు భారం!

నిస్సాన్​కి సంబంధించి అమెరికాలో 45శాతం సేల్స్​ ఎగుమతుల రూపంలోనే జరుగుతున్నాయి. ఇవి మెక్సికో, జపాన్​ నుంచి అమెరికాకు వెళుతున్నాయి. ట్రంప్​ తాజా చర్యలతో మెక్సికోకు చెందిన 3లక్షల యూనిట్​లు, జపాన్​కి చెందిన 1.2లక్షల యూనిటల్​పై ప్రతికూల ప్రభావం పడుతుందని నిస్సాన్​ సీఎఫ్​ఓ జెరేమి పాపిన్​ స్వయంగా చెప్పారు.

ట్రంప్​ టారీఫ్​ పిడుగుతో నిస్సాన్​ మాత్రమే కాదు, అనేక దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థలు తమ లాభాల అంచనాలను సవరించుకున్నాయి.

దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ రెనాల్ట్​కి నిస్సాన్​లో 36శాతం వాటా ఉంది. నిస్సాన్​ తాజా సంక్షోభంతో, ఈ ఆర్థిక ఏడాది మొదటి త్రైమాసికంలో రెనాల్ట్​కి 2.2 బిలియన్​ యూరోల (ఆదాయం) నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కాగా ఇండియా, యూరోప్​, లాటిన్​ అమెరికాలో బిజినెస్​ కోసం రెనాల్ట్​తో ఉన్న భాగస్వామ్యాన్ని మరింత పెంచుకునేందుకు నిస్సాన్​ ప్రయత్నిస్తోంది. అమెరికాలో హోండాతో కలిసి పనిచేసేందుకు కృషి చేస్తోంది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం