Nissan India : నిస్సాన్ ఇండియా బిగ్ ప్లాన్.. హైబ్రిడ్, సీఎన్జీ, ఈ-కారును తీసుకొచ్చేందుకు ప్రణాళికలు
Nissan India : నిస్సాన్ ఇండియా భారత మార్కెట్ కోసం బిగ్ ప్లాన్ చేస్తోంది. హైబ్రిడ్, సీఎన్జీ, ఈ కార్లను భారత్‌లో లాంచ్ చేయనుంది. ప్రస్తుతం దాని సింగిల్ మోడల్ మాగ్నైట్‌కు భారత మార్కెట్‌లో డిమాండ్ ఉంది.
భారత కార్ల మార్కెట్లో తన పట్టును మరింత బలోపేతం చేసుకునేందుకు నిస్సాన్ భారీగా ప్రణాళికలు వేస్తోంది. తన పోర్ట్‌ఫోలియోను విస్తరించనుంది. ఇందులో హైబ్రిడ్, సీఎన్జీ వంటి కొత్త కార్లు ఉంటాయి. అంతేకాకుండా నిస్సాన్ 2026 ఆర్థిక సంవత్సరం నాటికి భారతదేశంలో మొదటి ఎలక్ట్రిక్ వాహనాన్ని విడుదల చేయనుంది.

కొత్త మోడళ్లు
ప్రస్తుతం నిస్సాన్ మాగ్నైట్, ఎక్స్-ట్రైల్ ఎస్‌యూవీలను భారతదేశంలో విక్రయిస్తోంది. అయితే త్వరలో కంపెనీ తన బెస్ట్ సెల్లింగ్ మోడల్ మాగ్నైట్ హైబ్రిడ్, సీఎన్జీ వేరియంట్లను విడుదల చేయవచ్చు. అయితే కంపెనీ ఈ పవర్ట్రెయిన్లను మాగ్నైట్‌కు మాత్రమే తీసుకువస్తుందా లేదా కొత్త మోడళ్లకు కూడా జోడిస్తుందా అనే దాని మీద మాత్రం ఇంకా స్పష్టత లేదు.
గతంలో కంపెనీ ప్రకటించిన ప్రణాళికలన్నీ పక్కాగా ఉన్నాయని నిస్సాన్ ఇండియా ఆపరేషన్స్ ప్రెసిడెంట్ ఫ్రాంక్ టోర్రెస్ తెలిపారు. ఇందులో రెండు కొత్త మిడ్ సైజ్ ఎస్‌యూవీలు, ఒక ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఉన్నాయి. వాటిలో 5 సీట్ల ఎస్‌యూవీ, 7 సీట్ల ఎస్‌యూవీ ఉన్నాయి.
ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ
2026 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ తీసుకొచ్చేలా ప్రణాళికలు వేస్తోంది నిస్సాన్. ఇది కాకుండా హైబ్రిడ్, సీఎన్జీ పవర్ట్రెయిన్లను జోడించాలని కంపెనీ ఆలోచిస్తోంది. ఇది భారతీయ వినియోగదారులకు మరిన్ని ఆప్షన్స్ అందిస్తుంది.
అమ్మకాలపై ఫోకస్
2026 ఆర్థిక సంవత్సరం నాటికి భారత మార్కెట్లో తన అమ్మకాలను మూడు రెట్లు పెంచాలని నిస్సాన్ టార్గెట్ పెట్టుకుంది. ఏటా లక్ష దేశీయ అమ్మకాలు, లక్ష ఎగుమతులు చేసేలా ప్లాన్ వేస్తోంది. కంపెనీ ఇటీవల తన కాంపాక్ట్ ఎస్‌యూవీ మాగ్నైట్ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ (ఎల్‌హెచ్‌డీ) వేరియంట్లను ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేయడం ప్రారంభించింది.
గతంలో నిస్సాన్ భారత్ నుంచి 20 దేశాలకు వాహనాలను పంపుతుండగా, ఇప్పుడు ఈ సంఖ్య 65 దేశాలకు చేరనుంది. మిడిల్ ఈస్ట్, ఉత్తర ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి కొత్త మార్కెట్లకు 10,000 యూనిట్లకు పైగా రవాణా చేయాలని నిస్సాన్ యోచిస్తోంది.