New Scam Alert: ఈ ఫేక్ SMSతో జాగ్రత్త.. మీ ఖాతా మొత్తం ఖాళీ అవుతుంది
మరో కొత్తరకం స్కామ్ ఇది. పోస్టల్ డిపార్ట్‌మెంట్ పేరుతో ఒక ఫేక్ ఎస్.ఎం.ఎస్. వస్తుంది. మీ ఖాతా బ్లాక్ చేయకుండా ఉండటానికి పాన్ కార్డు వివరాలను అప్డేట్ చేయాలని దీని సారాంశం. ఈ మోసపూరిత సందేశం గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు ఇక్కడ చూడొచ్చు.
స్కామర్లు మిమ్మల్ని మోసం చేయడానికి నిరంతరం కొత్త పద్ధతులను వెతుకుతున్నారు. ఇండియా పోస్ట్ పేరుతో వచ్చే ఇప్పుడు వస్తున్న ఎస్ఎంఎస్‌ల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ పాన్ కార్డు వివరాలను అప్డేట్ చేయమని సందేశాలు వస్తాయి.
అయితే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి) ఫ్యాక్ట్ చెక్ ఈ ఎస్ఎంఎస్ మోసపూరితమైనదిగా గుర్తించింది. పాన్ కార్డు అప్‌డేట్‌లకు సంబంధించి ఇండియా పోస్ట్ పేరిట వచ్చే సందేశాలు నిజమైనవి కావని, ఫేక్ అని హెచ్చరించింది. 24 గంటల్లోగా వినియోగదారులు తమ పాన్ కార్డు వివరాలను అప్డేట్ చేయకపోతే, వారి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతా బ్లాక్ అవుతుందని ఆ సందేశం సారాంశం. ఇండియా పోస్ట్ ఎప్పుడూ అలాంటి నోటిఫికేషన్లను పంపదని, వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని పిఐబి స్పష్టం చేసింది.
మోసపూరిత సందేశం సాధారణంగా ఇలా ఉంటుంది:
‘ప్రియమైన వినియోగదారు, మీ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఖాతా ఈ రోజు బ్లాక్ చేయబడింది. దయచేసి వెంటనే మీ పాన్ కార్డును అప్డేట్ చేయండి ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..’ అంటూ ఒక లింక్ వస్తుంది. దాని పొరపాటున క్లిక్ చేస్తే మీ ఖాతా ఖాళీ అవుతుంది.
ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోండి.
- ఊహించని సందేశాలతో జాగ్రత్తగా ఉండండి: మీకు తెలియని నంబర్ లేదా మీరు సాధారణంగా ఉపయోగించని సంస్థ నుండి ఎస్ఎంఎస్ వస్తే జాగ్రత్తగా వ్యవహరించండి.
- లింక్‌లు లేదా అటాచ్‌మెంట్‌లపై క్లిక్ చేయవద్దు: అనుమానాస్పద సందేశాల్లోని లింకులు వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి ఉద్దేశించిన ఫిషింగ్ ప్రయత్నాలు కావచ్చు. అందువల్ల వాటిని క్లిక్ చేయొద్దు.
- సమాచారాన్ని నేరుగా ధృవీకరించండి: వారి నుండి వచ్చిన ఏదైనా సందేశం యొక్క ప్రామాణికతను ధృవీకరించడానికి కంపెనీని అధికారిక వెబ్సైట్ లేదా ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించండి.
- వ్యక్తిగత సమాచారాన్ని ఎస్ఎంఎస్ ద్వారా పంచుకోవద్దు: టెక్స్ట్ సందేశాలకు ప్రతిస్పందనగా బ్యాంకు ఖాతా నంబర్లు లేదా పాస్‌వర్డ్‌లు వంటి వ్యక్తిగత వివరాలను అందించడం మానుకోండి.
- అనుమానాస్పద సందేశాలను నివేదించండి: మీకు మోసపూరిత ఎస్ఎంఎస్ వస్తే మీ మొబైల్ క్యారియర్, సంబంధిత అధికారులకు తెలియజేయండి.
- మీ సాఫ్ట్‌వేర్‌ను అప్ డేట్ చేసుకోండి: మీ స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్, అప్లికేషన్‌లు లేటెస్ట్ సెక్యూరిటీ అప్‌డేట్‌లతో ఉండేలా చూసుకోండి.