దేశమంతా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించింది. కొత్త ఏడాది జనవరి 1 నుండి దేశవ్యాప్తంగా అనేక ముఖ్యమైన మార్పులు అమలులోకి వచ్చాయి. దేశంలో ఎల్‌పీజీ ధరల నుండి ఈపీఎఫ్‌ఓ వరకు అనేక కీలక విషయాల్లో మార్పులు జరిగాయి. అవేంటో చూద్దాం..
ప్రభుత్వం ప్రతినెలా ఒకటో తేదీన ఎల్‌పీజీ ధరను మారుస్తుంది. గత కొద్ది రోజులుగా 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలో అనేక మార్పులు వస్తున్నాయి. కానీ దేశంలో చాలా కాలంగా 14 కిలోల కిచెన్ సిలిండర్ ధర స్థిరంగా ఉంది. ఈసారి కూడా ఎల్పీజీ సిలిండర్ ధరలో మార్పును చూడవచ్చు.
పీఎఫ్ ఖాతాదారులకు 2025 ప్రారంభంలో ప్రత్యేక గిఫ్ట్ వస్తుందని చెప్పవచ్చు. ఏటీఎం మెషిన్ నుంచి పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. కార్మిక మంత్రిత్వ శాఖ ఇటీవల దీనిపై కసరత్తు చేస్తోంది. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ పీఎఫ్ ఉపసంహరణను సులభతరం చేయడానికి, సేవలను మెరుగుపరచడానికి తన IT వ్యవస్థను అప్‌గ్రేడ్ చేస్తోంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులకు గుడ్‌న్యూస్ అందించింది. UPI 123Payని ఉపయోగించి ఇప్పుడు రూ. 10,000 వరకు UPI చెల్లింపులు చేయవచ్చు. ఈ సదుపాయం జనవరి 1, 2025 నుండి ప్రారంభమైంది. గతంలో ఈ పరిమితి ఐదు వేల వరకు ఉండేది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రైతులకు పెద్ద రిలీఫ్ ఇచ్చింది. రైతులకు లభించే అసురక్షిత రుణ పరిమితిని ఆర్‌బీఐ రూ.2 లక్షలకు పెంచింది. ఎటువంటి పూచీకత్తు లేకుండా తీసుకునే రుణం కొత్త నిబంధనలు జనవరి 1, 2025 నుండి అమలులోకి వస్తాయి. గతంలో ఈ పరిమితి రూ.1.60 లక్షలుగా ఉండేది.
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ తన ఒప్పందాల గడువు తేదీలో మార్పును ప్రకటించింది. జనవరి 1, 2025 నుండి అమలులోకి వస్తుంది. ఈ మేరకు ఎన్‌ఎస్‌ఈ సర్క్యులర్ జారీ చేసింది. ఇప్పుడు FinNifty, MidCPNifty, NiftyNext50 నెలవారీ ఒప్పందాలు ప్రతి నెల చివరి మంగళవారంతో ముగుస్తాయి.
మారుతీ సుజుకీ, మెర్సిడెస్ బెంజ్, బీఎమ్‌డబ్ల్యూ, ఆడి, హ్యుందాయ్, మహీంద్రా, హోండా, కియా తదితర కార్ల ధరలు 2-4 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.
నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCలు), హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల (HFC) ఫిక్స్‌డ్ డిపాజిట్లకు సంబంధించిన నియమాలు కూడా జనవరి 1, 2025 నుండి మారుతాయని బ్యాంక్ కస్టమర్‌లు గమనించాలి.
పన్ను చెల్లింపుదారులు జనవరి 1, 2025 నుండి కఠినమైన జీఎస్టీ నియమాలను పాటించాలి. జీఎస్టీ పోర్టల్‌లో భద్రతను పెంచేందుకు పన్ను చెల్లించే వారికీ మల్టీ ఫ్యాక్టర్ అథంటికేషన్ తప్పనిసరి అవ్వనుంది.