New tax refund rule: కొత్త ఆదాయ పన్ను బిల్లు ప్రకారం.. ఆలస్యంగా రిటర్న్ దాఖలు చేస్తే రీఫండ్ రాదా?
New Income tax bill 2025: ఆదాయ పన్ను కు సంబంధించి నూతన బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఈ బిల్లులో పలు కొత్త అంశాలు, నిబంధనలు ఉన్నాయి. అయితే, బిల్లులోని పలు నిబంధనల గురించి సోషల్ మీడియాలో పలు పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. అందులో ఒకటి టాక్స్ రీఫండ్ కు సంబంధించినది.
New Income tax bill 2025: కొత్త ఆదాయ పన్ను బిల్లు ప్రకారం.. గడువు తేదీ ముగిసిన తర్వాత ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేస్తే రిఫండ్స్ పొందడానికి అర్హత ఉంటుందా? అనే విషయంలో పన్ను చెల్లింపుదారుల్లో ఆందోళన నెలకొంది. ఆలస్యంగా రిటర్నులు దాఖలు చేసే వారు రిఫండ్ క్లెయిమ్ చేసుకోవడానికి అర్హులు కారని ఈ కొత్త బిల్లులో నిబంధన ఉందని సోషల్ మీడియాలో పలు వార్తలు సూచించాయి. ప్రస్తుత ఆదాయ పన్ను చట్టం, 1961 లో ఈ నిబంధన లేదు. ఈ చట్టం ప్రకారం ఇది మదింపు సంవత్సరంలో ఆలస్యంగా, అంటే, డిసెంబర్ 31 లోగా రిటర్న్ సమర్పించినట్లయితే రిఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు.
2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి..
2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రానున్న కొత్త ఆదాయ పన్ను చట్టం గడువులోగా రిటర్నులు దాఖలు చేయడంలో విఫలమైన పన్ను చెల్లింపుదారులకు రీఫండ్ లకు క్లెయిమ్ చేసే అవకాశాన్ని తొలగించవచ్చని నిపుణులు సోషల్ మీడియాలో హైలైట్ చేస్తున్నారు. ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం సకాలంలో రిటర్నులు దాఖలు చేయని వారికి కూడా, రిఫండ్ క్లెయిమ్ చేసుకోవడానికి ఎలాంటి ఆటంకం లేదు. అయితే, ‘‘ఆదాయపు పన్ను బిల్లు, 2025 లో ఒక కొత్త నిబంధన ఉంది. అదేంటంటే, రిటర్న్ ఆలస్యంగా దాఖలు చేస్తే, వారికి రీఫండ్ క్లెయిమ్ చేసే అవకాశం లేదు’’ అని ట్యాక్స్ గురు ట్వీట్ చేశారు.
ఆదాయ పన్ను శాఖ వివరణ
అయితే, ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారి, పన్ను చెల్లింపుదారుల్లో గందరగోళానికి దారి తీయడంతో, దీనిపై ఆదాయ పన్ను శాఖ వివరణ ఇచ్చింది. రీఫండ్ నిబంధనల్లో ఎలాంటి మార్పులు లేవని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది. ‘‘ప్రియమైన @taxguru_in, మా ఎఫ్ఎక్యూలలో వివరించినట్లుగా, కొత్త ఆదాయ పన్ను బిల్లు, 2025 లో రిఫండ్స్ కు సంబంధించిన నిబంధనలలో విధానపరమైన మార్పులు ఏవీ లేవు’’ అని ఆదాయ పన్ను శాఖ తమ ఎక్స్ హ్యాండిల్ లో పోస్ట్ చేసింది. ఆదాయ పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 239 ప్రకారం రిటర్న్ ఫైలింగ్ ద్వారా రీఫండ్ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఎప్పటి నుంచో ఉందని, ఇప్పుడు కొత్త బిల్లులోని సెక్షన్ 263(1)(9)లో కూడా ఇది ప్రతిబింబిస్తుందని ఐటీ విభాగం తెలిపింది. ‘‘రీఫండ్ క్లెయిమ్ ల కోసం రిటర్న్ దాఖలు చేయాల్సిన అవసరాన్ని మాత్రమే ఈ బిల్లు బలపరుస్తుంది.అంతేకానీ, కొత్త పరిమితులను ప్రవేశపెట్టదు’’ అని ట్యాక్స్ 2విన్ సిఇఒ మరియు సహ వ్యవస్థాపకుడు అభిషేక్ సోనీ అన్నారు.
మినహాయింపు పొందిన సంస్థలు ఆదాయ రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం ఉందా?
అవును, మినహాయింపును అనుమతించే ముందు వారి మొత్తం ఆదాయం ఆదాయ పన్ను విధించలేని గరిష్ట మొత్తాన్ని మించి ఉంటే మినహాయింపు పొందిన సంస్థలు ఆదాయ రిటర్నులను దాఖలు చేయాల్సిన బాధ్యతను కొనసాగిస్తాయి.
ఆదాయ రిటర్నుల దాఖలు గడువు తేదీలు మారిపోయాయా?
లేదు, ప్రతి కేటగిరీ పన్ను చెల్లింపుదారులకు ఆదాయ రిటర్ను(ITR) లను దాఖలు చేయడానికి గడువు తేదీలు ఇప్పటికీ ఒకేలా ఉన్నాయి. వాటిని సులభంగా అర్థం చేసుకోవడానికి ఇప్పుడు పట్టిక రూపంలో అందిస్తున్నారు.
ఆలస్యమైన, సవరించిన, అప్ డేట్ చేసిన రిటర్నుల నిబంధనలు మారిపోయాయా?
లేదు, ఆలస్యంగా, సవరించిన, అప్ డేట్ చేసిన రిటర్నులకు సంబంధించిన నిబంధనలు ఆదాయ పన్ను చట్టం, 1961 లో మాదిరిగానే ఉంటాయి.
సూచన: పై అభిప్రాయాలు, సిఫార్సులు వ్యక్తిగత విశ్లేషకులవి. హెచ్ టీ తెలుగు వి కావు. ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ నిపుణులను సంప్రదించాలని మేము పెట్టుబడిదారులకు సలహా ఇస్తున్నాము.
సంబంధిత కథనం
టాపిక్