Income Tax: ‘‘విదేశాలకు వెళ్లడానికి ఇన్ కమ్ ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కచ్చితంగా ఉండాలా?’’ - సీబీడీటీ వివరణ
విదేశాలకు వెళ్లే భారతీయ పౌరులు కచ్చితంగా తమ ఆదాయపు పన్ను క్లియరెన్స్ సర్టిఫికెట్ ను చూపాలన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఐటీసీసీ లేకుండా విదేశాలకు వెళ్లడం సాధ్యం కాదని సీబీడీటీ రూల్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ వార్తలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది.
భారత పౌరులందరూ విదేశాలకు వెళ్లే ముందు తప్పనిసరిగా ఆదాయపు పన్ను క్లియరెన్స్ సర్టిఫికేట్ (ITCC) పొందాలన్న వార్తలను ఆర్థిక మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ఈ మేరకు సీబీడీటీ ప్రకటనను ఆగస్టు 20 న ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ‘‘దేశం విడిచి వెళ్ళే ముందు భారతీయ పౌరులందరూ ఆదాయపు పన్ను క్లియరెన్స్ సర్టిఫికేట్ (ITCC) పొందాలని తప్పుగా వార్తలు వస్తున్నాయి. అది వాస్తవం కాదు.’’ అని ఆ ప్రకటనలో సీబీడీటీ (Central Board of Direct Taxes CBDT) స్పష్టం చేసింది. ఒక వ్యక్తి తీవ్రమైన ఆర్థిక అవకతవకలకు పాల్పడినప్పుడు కానీ, రూ .10 లక్షల కంటే ఎక్కువ పన్ను డిమాండ్ పెండింగ్ లో ఉన్నప్పుడు కానీ భారత పౌరులు విదేశాలకు వెళ్లడానికి అనుమతి ఉండదని తెలిపింది.
ఐటీసీసీ ఎప్పుడు అవసరం?
భారత్ లో నివసిస్తున్న వ్యక్తి తీవ్రమైన ఆర్థిక అవకతవకలకు పాల్పడినప్పుడు మాత్రమే ఐటీసీసీ అవసరం అని సీబీడీటీ పేర్కొంది. అలాగే, ఆదాయపు పన్ను (IT) చట్టం పరిధిలో అతడు లేదా ఆమెపై విచారణ జరుగుతున్న సమయంలో విదేశాలకు వెళ్లాలనుకుంటే ఐటీసీసీ అవసరం అవుతుంది. ఒక వ్యక్తి రూ.10 లక్షలకు మించి ప్రత్యక్ష పన్ను బకాయిలు ఉన్నప్పుడు, అతడు విదేశాలకు వెళ్లడానికి అనుమతి లభించదు. ఆదాయపు పన్ను ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ లేదా చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అనుమతితో, సరైన కారణాలను నమోదు చేసిన తర్వాతే ఐటీసీసీని పొందవచ్చు.
ఐటీ చట్టంలోని ఈ సెక్షన్ ప్రకారం
ఆదాయపు పన్ను చట్టం, 1961 ('చట్టం') లోని సెక్షన్ 230 (1 ఎ) భారతదేశంలో నివసించే వ్యక్తులు "కొన్ని పరిస్థితులలో" పన్ను క్లియరెన్స్ సర్టిఫికేట్ పొందడానికి సంబంధించినదని సీబీడీటీ ప్రకటన పేర్కొంది. 'ఫైనాన్స్ యాక్ట్ ద్వారా ఈ నిబంధన చట్టంలోకి వచ్చింది. ఫైనాన్స్ (నెం.2) చట్టం, 2024, చట్టంలోని సెక్షన్ 230 (1 ఎ)లో మాత్రమే సవరణ చేసింది, దీని ద్వారా నల్లధనం (అప్రకటిత విదేశీ ఆదాయం మరియు ఆస్తులు) మరియు పన్ను విధింపు చట్టం, 2015 ('నల్లధనం చట్టం') ప్రస్తావనను ఈ సెక్షన్లో చేర్చారు. ‘‘ఈ సవరణను తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ఈ సవరణ గురించి తప్పుడు సమాచారం వచ్చినట్లు కనిపిస్తుంది. భారత పౌరులందరూ దేశం విడిచి వెళ్లే ముందు ఐటీసీసీ చేయించుకోవాలని తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఇది వాస్తవం కాదు’’ అని ఆ పత్రికా ప్రకటనలో పేర్కొంది. చట్టంలోని సెక్షన్ 230 ప్రకారం ప్రతి ఒక్కరూ ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికేట్ పొందాల్సిన అవసరం లేదు. ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికేట్ పొందాల్సిన పరిస్థితులు ఉన్న కొంతమంది వ్యక్తులు మాత్రమే దానిని పొందాల్సి ఉంటుంది.
టాపిక్