ఈ దేశంలో దాదాపు 90 శాతం అమ్మకాలు ఎలక్ట్రిక్ కార్లవే.. పెట్రోల్, డీజిల్ కార్లను వదిలేస్తున్న జనాలు!
Electric Cars : నార్వే ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. దేశంలో 90 శాతం మంది ప్రజలు పెట్రోల్, డీజిల్ కార్ల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు మారారు. గణాంకాల ప్రకారం 2024లో నార్వేలో విక్రయించిన కొత్త కార్లలో 88.9 శాతం అంటే దాదాపుగా 90 శాతం పూర్తిగా ఎలక్ట్రిక్ కార్లు.
2024లో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) అమ్మకాల్లో నార్వే కీలక మైలురాయిని సాధించింది. నార్వేజియన్ రోడ్ ఫెడరేషన్ ప్రకారం 2024లో విక్రయించిన కొత్త కార్లలో 88.9 శాతం పూర్తిగా ఎలక్ట్రిక్ కార్లు. ఇది 2023లో 82.4 శాతంతో పోల్చితే పెరిగింది. ఈ పెరుగుదల 2025 నాటికి అన్ని కొత్త కార్లను జీరో-ఎమిషన్ వాహనంగా మార్చాలనే నార్వే లక్ష్యానికి దగ్గరగా వెళుతుంది. 2035 నాటికి కార్బన్ డయాక్సైడ్ ను విడుదల చేసే కార్ల అమ్మకాలను నిషేధించాలని యూరోపియన్ యూనియన్ నిర్ణయించింది.
నార్వేలో అత్యధిక ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించిన సంస్థలలో టెస్లా, ఫోక్స్ వ్యాగన్, టయోటా ఉన్నాయి. అలాగే చైనీస్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులైన ఎంజీ, బీవైడీ, ఎక్స్ పెంగ్ వంటి బ్రాండ్లు నార్వేలో తమ ఉనికిని పెంచుకున్నాయి. చైనీస్ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వాటాను సుమారు 10శాతానికి తీసుకువచ్చాయి.
ఆ కార్లపై పన్ను
నార్వే ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ కార్లపై పన్నులను పెంచింది. అయితే ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి పన్ను, వ్యాట్(విలువ ఆధారిత పన్నులు) లేవు. ఇది వినియోగదారులను మరింత పెంచేలా చేస్తుందని చెప్పవచ్చు. 2023లో కొన్ని పన్నులను తిరిగి ప్రవేశపెట్టారు. అయినప్పటికీ ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతూనే ఉంది. అమెరికా, ఈయూ మాదిరిగా కాకుండా నార్వే చైనా ఈవీ దిగుమతులపై కూడా సుంకాలు విధించలేదు.
ఛార్జింగ్ స్టేషన్ల పెంపు
నార్వేలో పెరుగుతున్న ఎలక్ట్రిక్ కార్ల సంఖ్య, ఛార్జింగ్ స్టేషన్లు వంటి మౌలిక సదుపాయాల విస్తరణతో ఈవీల వైపు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకోసం దేశంలోని పెట్రోల్ బంకులను వేగంగా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లుగా మారుస్తున్నారు. తద్వారా పెరుగుతున్న ఛార్జింగ్ డిమాండ్‌ను తీర్చవచ్చు. నార్వేలో ఇప్పుడు 27,000 కంటే ఎక్కువ పబ్లిక్ ఛార్జర్లు ఉన్నాయి. దీని అర్థం నార్వేలో ప్రతి 100,000 మందికి 447 ఛార్జర్లు ఉన్నాయి.
ఈవీలవైపు వచ్చేలా చర్యలు
ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతోంది. కానీ దానితో పాటు కొన్ని సవాళ్లు కూడా వస్తుంటాయి. ఇందులో ప్రధాన సమస్య శీతాకాలంలో ఛార్జింగ్ సమయం పెరగడం, ఇది డ్రైవర్లకు కొంత ఇబ్బంది కలిగిస్తుంది. పర్యాటకులకు ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించడం కొత్త అనుభవంగా ఉంటుంది. సరైన విధానాలు, ప్రోత్సాహకాలతో, ఎలక్ట్రిక్ వాహనాల వైపు ప్రజల మొగ్గుచూపేలా చేయాలని ప్రభుత్వం అనుకుంటోంది.