National Startup Day : చిన్నతనంలోనే తండ్రి మరణం.. కష్టాలను లెక్కచేయకుండా వ్యాపారంలో విజయం!
National Startup Day 2025 : జనవరి 16న నేషనల్ స్టార్టప్ డే. ఈ సందర్భంగా కష్టాల నుంచి విజయం వైపు నడిచిన కనకా ఆచార్య గురించి తెలుసుకుందాం. అతడికి భారతీయ యువ శక్తి ట్రస్ట్ సాయం తోడైంది. ఎన్ని సమస్యలు వచ్చినా ఇంటీరియర్, ఫర్మిచర్ బిజినెస్‌లో ముందుకెళ్లి విజయం సాధించాడు.
చిన్నతనంలోనే తండ్రి మరణిస్తే ఆ బాధ వర్ణించలేం. సరైన దిశలో వెళ్లకుంటే జీవితమే నాశనం అవుతుంది. కానీ కొందరు ఎలాంటి కష్టం వచ్చినా జీవితంలో విజయం సాధించాలనే తపనతో ముందుకు వెళ్తారు. అలాంటి వ్యక్తే కనకా ఆచార్య. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయి కనకా ఆచార్య బాల్యం కష్టాల్లోకి వెళ్లింది. 7వ తరగతి చదువుతున్నప్పుడు కుటుంబాన్ని పోషించడానికి చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం ప్రారంభించాడు. 10వ తరగతి తర్వాత చదువు మానేసి ఉద్యోగం చేయడం ప్రారంభించాడు.

ఇంటీరియర్, ఫర్నిచర్ వ్యాపారంలో కనకా ఆచార్యకు ఆసక్తి ఉండేది. ఫర్నిచర్ తయారీకి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని నిశితంగా పరిశీలించేవాడు. ఐదు సంవత్సరాలు ఫర్నిచర్ తయారీపై శిక్షణ పొందాడు. అదే సమయంలో సబ్-కాంట్రాక్ట్‌గా కూడా పని చేసేవాడు, ఇంటి నుండే తయారీ పనులు చేస్తుండేవాడు.
ఇంటీరియర్ బిజినెస్
తన భాగస్వామి కె.స్వప్నతో కలిసి మూడు సంవత్సరాల క్రితం తన వెంచర్ కె.కె చారి ఇంటీరియర్స్‌ను స్థాపించాడు. మెుదట ఫర్నిచర్‌ను చేతితో తయారు చేసేవాడు. ఇది కాస్త కష్టంగా అనిపించేది. ఉత్పత్తిని పెంచడానికి యంత్రంతో ఫర్నిచర్ తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. తన వ్యాపారాన్ని పెంచుకోవడానికి అవకాశాల కోసం వెతికాడు.
ఇదే సమయంలో కనకా ఆచార్యకు తన స్నేహితుడు భారతీయ యువ శక్తి ట్రస్ట్(BYST) గురించి చెప్పాడు. 'నేను బీవైఎస్టీ కార్యాలయాన్ని సందర్శించినప్పుడు నాకు సమాధానం దొరుకుతుంది అనిపించింది. కౌన్సెలింగ్ సెషన్‌లు, శిక్షణలు నా అవగాహనను పెంచాయి. ఎలా ముందుకు వెళ్లాలో అర్థమయ్యేలా చేశాయి.' అని కనకా ఆచార్య చెప్పారు.
ఆరుగురికి ఉపాధి
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి రూ. 22 లక్షలు లోన్ తీసుకున్నాడు ఆచార్య. ఈ రుణం ఫిబ్రవరి 2023లో వచ్చింది. తర్వాత ఫర్నిచర్ తయారు చేయడానికి యంత్రాలను కొనుగోలు చేశాడు. మాడ్యులర్ కిచెన్, బెడ్‌లు, కప్‌బోర్డ్‌లు, క్యాబిన్ లు మొదలైన వాటిని తయారు చేయడం మెుదలుపెట్టాడు. బిల్డర్లు, నిర్మాణ సంస్థలకు కూడా కనకా ఆచార్య ఫర్నిచర్‌ను సరఫరా చేస్తున్నాడు. ఇప్పుడు అతడి టర్నోవర్ రూ. 80 లక్షలుగా ఉంది. అంతేకాదు ఆరుగురికి ఉపాధి కూడా కల్పించాడు.
దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్లాన్
ప్రస్తుతం తన వ్యాపారాన్ని భారతదేశం అంతటా విస్తరించే ప్లాన్‌లో ఉన్నాడు కనకా ఆచార్య. దీనికోసం భారతీయ యువశక్తి ట్రస్ట్ సాయం తీసుకుంటున్నాడు. మార్కెటింగ్ వ్యూహం, ఉత్పత్తి మెరుగుదల, రోజువారీ సమస్యల్లో ఎలా ముందుకు వెళ్లాలనే విషయంపై బీవైఎస్టీ నుంచి మార్గదర్శకత్వం పొందుతున్నాడు.