Myntra refund scam: 'రీఫండ్' స్కామ్ లో రూ.1.1 కోట్లు నష్టపోయిన మింత్రా
Myntra refund scam: ఈ-కామర్స్ యాప్ మింత్రా ఒక రిఫండ్ స్కామ్ లో రూ. 1.1 కోట్లు నష్టపోయింది. మింత్రా యాప్ లో అందుబాటులో ఉన్న 'రిఫండ్' ఆప్షన్ ను దుర్వినియోగం చేసిన జైపూర్ కు చెందిన గ్యాంగ్ రూ.1.1 కోట్లు మోసం చేసింది. ఈ విషయం మింత్రా ఆడిట్ లో బయటపడింది. దాంతో, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Myntra refund scam: చాలా ఈ-కామర్స్ ఫ్యాషన్ ప్లాట్ ఫామ్ లు వినియోగదారులకు రంగు, ఫిట్ లేదా అనేక ఇతర ఫిర్యాదులపై ఆయా ప్రొడక్ట్స్ ను మార్చుకునే లేదా రిఫండ్ అందించే సదుపాయం కల్పిస్తాయి. అయితే, ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకుని ఒక గ్యాంగ్ ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ ‘మింత్రా’ ను రూ. 1.1 కోట్లకు మోసం చేసింది. ఈ ఏడాది మార్చి నుంచి జూన్ వరకు జరిగిన ఈ మోసం మింత్రా ఆడిట్ లో వెల్లడైంది.
మింత్రాను ఎలా మోసం చేశారంటే?
కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మోసగాళ్లు బ్రాండెడ్ బూట్లు, దుస్తులు, హ్యాండ్ బ్యాగులు, కాస్మొటిక్స్, గడియారాలు, ఆభరణాలు వంటి ఇతర వస్తువుల కోసం మింత్రా యాప్ లేదా పోర్టల్ లో బల్క్ ఆర్డర్లు పెట్టేవారు. ఆ తర్వాత 'ఆన్లైన్' లేదా 'క్యాష్ ఆన్ డెలివరీ (సీఓడీ)'ను చెల్లింపు విధానంగా ఎంచుకునేవారు.
ఆర్డర్ పూర్తిగా రాలేదని..
ఆర్డర్ డెలివరీ అయిన తరువాత ఈ ముఠా ఆ ప్రొడక్ట్స్ పై పలు ఫిర్యాదులు చేసేవారు. ఆ ఫిర్యాదుల్లో, ఆర్డర్ చేసిన అన్ని ప్రొడక్ట్స్ రాలేదని, లేదా క్వాలిటీ సరిగ్గా లేదని, లేదా ఆర్డర్ ఇచ్చిన కలర్ రాలేదని ఫిర్యాదు చేసేవారు. అనంతరం, 'రీఫండ్' ఆప్షన్ ను ఎంచుకునేవారు. ఉదాహరణకు, పది జతల బ్రాండెడ్ బూట్లకు ఆర్డర్ ఇస్తే, పార్శిల్ అందుకున్న తర్వాత, ఆ వ్యక్తి పార్శిల్ లో ఐదు జతలు మాత్రమే ఉన్నాయని ఫిర్యాదు చేసేవాడు. మిగతా ఐదు జతలకు రీఫండ్ కోరేవాడు. దాంతో, మింత్రా (Myntra) వారికి రీఫండ్ చెల్లించేది.
బెంగళూరులోనే ఎక్కువ డెలివరీలు..
ఈ స్కామ్ (scam) లో ఎక్కువ డెలివరీలు బెంగళూరులో చేశారని, ఆర్డర్లు మాత్రం జైపూర్ నుంచి ఇచ్చారని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు తెలిపారు. బెంగళూరులోని వివిధ చిరునామాలకు సుమారు 5,529 మోసపూరిత ఆర్డర్లను డెలివరీ చేయడం వల్ల మింత్రాకు రూ. 1.1 కోట్ల నష్టం సంభవించిందని మింత్రా డిజైన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి సర్దార్ ఎంఎస్ పోలీసులకు తెలిపారు. దాదాపు అన్ని ఆర్డర్లు జైపూర్ నుంచే రావడంతో రాజస్థాన్ కు చెందిన ఓ ముఠా ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మోసగాళ్లు డెలివరీ కోసం బెంగళూరు (bengaluru news), ఇతర మెట్రో నగరాల్లో చిరునామాలు ఇచ్చారు. టీ స్టాల్స్, టైలర్ షాపులు లేదా ప్రొవిజన్ లేదా స్టేషనరీ దుకాణాలు వంటి వాణిజ్య సంస్థలకు కొన్ని ఆర్డర్లు డెలివరీ అయ్యాయి.