భారీ భూకంపాల ఘటనలతో ఆగ్నేయ ఆసియా ఉలిక్కిపడింది! మయన్మార్‌లో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. పొరుగున ఉన్న థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్లోనూ భూమి కంపించింది. భూకంపానికి సంబంధించిన దృశ్యాలను సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అవి భయానకంగా ఉన్నాయి.
సెంట్రల్ మయన్మార్‌లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:50 గంటలకు సగింగ్ నగరానికి వాయవ్యంగా 16 కిలోమీటర్ల దూరంలో, 10 కిలోమీటర్ల లోతులో భూ ప్రకంపనలు సంభవించినట్లు యూఎస్జీఎస్ తెలిపింది.
అయితే ఈ మొదటి భారీ భూకంపం తర్వాత మయన్మార్‌లో రెండోసారి ప్రకంపనలు వెలుగులోకి వచ్చాయి. 12 నిమిషాల తర్వాత 6.4 తీవ్రతతో మళ్లీ భూప్రకంపనలు నమోదయ్యాయి.
దేశంలోనే అతిపెద్ద నగరమైన యంగాన్లో కూడా ప్రకంపనలు భయపెట్టాయి. ప్రజలు ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
మయన్మార్‌లో భారీ భూకంపాలు ఎప్పటికప్పుడు ప్రజలను భయపెడుతుంటాయి. 1930 నుంచి 1956 మధ్యలో 7 అంతకంటే ఎక్కువ తీవ్రతతో ఆరు భారీ భూకంపాలు సగింగ్ ప్రాంతంలో, సమీపంలో సంభవించాయి. 2016లో బగన్ నగరంలో సంభవించిన భూకంపంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
మయన్మార్ పొరుగున ఉన్న థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో కూడా ప్రకంపనలు వెలుగులోకి వచ్చాయి. 10 కిలోమీటర్ల లోతున భూకంపం కేంద్రీకృతమై ఉందని యూఎస్జీఎస్, జర్మనీ జీఎఫ్జెడ్ సెంటర్ ఫర్జియోసైన్స్లు వెల్లడించాయి.
గ్రేటర్ బ్యాంకాక్ ప్రాంతంలో 17 మిలియన్లకు పైగా ప్రజలు నివసిస్తున్నారు. ఇందులో అనేక ఎత్తైన అపార్ట్మెంట్లు ఉన్నాయి. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో భూకంపం రావడంతో భవనాల్లో హెచ్చరికలు జారీ చేశారు. ఫలితంగా ప్రజలను జనసాంద్రత ఎక్కువగా ఉండే సెంట్రల్ ఏరియాలోని ఎత్తైన హోటళ్లు, మెట్ల ద్వారా ఖాళీ చేయించారు. ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు.
బ్యాంకాక్‌లో ప్రజలు భయాందోళనలతో వీధుల్లోకి పరుగులు తీశారని, స్విమ్మింగ్ పూల్స్ నుంచి నీరు బయటకు చిమ్మిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
బలమైన ప్రకంపనలకు థాయ్‌లాండ్‌లో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలిందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఉత్తర, మధ్య థాయ్‌లాండ్ అంతటా భూప్రకంపనలు సంభవించిన తర్వాత ప్రముఖ పర్యాటక నగరం చియాంగ్ మాయి నివాసి దువాంగ్జాయ్ ఏఎఫ్‌పీతో మాట్లాడుతూ.. "నేను ఇంట్లో నిద్రపోతున్నాను, నేను భవనం నుంచి సాధ్యమైనంత వేగంగా పరుగు తీసి బయటపడ్డాను," అని చెప్పారు.
మయన్మార్ భూకంపం, బ్యాంకాక్ భూ ప్రకంపనల్లో సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టాలపై ప్రస్తుతానికి సమాచారం లేదు.
సంబంధిత కథనం