మిడిల్ క్లాస్ మైండ్‌సెట్‌కి సూట్ అయ్యే మ్యూచువల్ ఫండ్స్ ఇవి! రిస్క్ తక్కువ- రిటర్నులు ఎక్కువ..
Mutual funds investment tips : మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి భయపడుతున్నారా? అయితే తక్కువ రిస్క్‌తో మంచి లాభాలు పొందే ఆప్షన్ ఒకటి మ్యూచువల్ ఫండ్స్‌లో ఉందని మీకు తెలుసా? అదే.. ‘ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్’!
ద్రవ్యోల్బణంతో పోరాడాలంటే ‘ఇన్వెస్ట్మెంట్’ చేయాల్సిందే అని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. కానీ ఇప్పటికీ, చాలా మందికి పెట్టుబడులపై భయాలు ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా స్టాక్ మార్కెట్ అంటే భయంతో చాలా దూరంగా ఉండిపోతుంటారు. మ్యూచువల్ ఫండ్స్వైపు కూడా చూడటం లేదు! మిడిల్ క్లాస్ వారిలో చాలా మంది ఇప్పటికీ డబ్బులను ఎఫ్‌డీల్లో లేదా సేవింగ్స్ అకౌంట్స్‌లో వదిలేస్తున్నారు. వీటితో ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడం కష్టం. అయితే, దీర్ఘకాలంలో పెట్టుబడులపై గొప్ప రిటర్నులు ఇచ్చిన చరిత్ర మ్యూచువల్ ఫండ్స్‌కి ఉన్నాయి. మరీ ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్‌లో రిస్క్ తక్కువగా ఉండి, మంచి రిటర్నులు పొందాలని చూసే వారికి ‘ఇండెక్స్ ఫండ్స్’ ఉత్తమం! ఈ నేపథ్యంలో అసలు ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి? ఈ తరహా ఫండ్స్‌తో ఉపయోగాలేంటి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి?
సెన్సెక్స్, నిఫ్టీ వంటి స్టాక్ మార్కెట్ సూచీల్లో ఇన్వెస్ట్ చేయడాన్ని ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ అంటారు. ఉదాహరణకు నిఫ్టీ 50లో.. 50 సంస్థలకు చెందిన స్టాక్స్ ఉంటాయి కదా! అవి పెరుగుతూ ఉంటే.. నిఫ్టీ 50 వృద్ధిచెందుతుంది. ఆయా స్టాక్స్ పడితే.. నిఫ్టీ పతనమవుతుంది. నిఫ్టీ 50 ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ కూడా ఇంతే! ఇందులో నిఫ్టీ 50కి చెందిన స్టాక్స్ ఉంటాయి. అందువల్ల.. నిఫ్టీ 50 రిటర్నుల తగ్గట్టుగానే నిఫ్టీ 50 మ్యూచువల్ ఫండ్‌లోనూ రిటర్నులు ఉంటాయి.
ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ విషయంలో మేనేజర్లు పెద్దగా కష్టపడరు. ఒక ఇండెక్స్‌ని ఎంచుకుని అందులోని స్టాక్స్‌లో ఎప్పటికప్పుడు మదుపర్ల నగదును పెడితే సరిపోతుంటారు. ఏ స్టాక్‌లో ఎంత శాతం పెట్టుబడి పెట్టాలి? అన్నది.. సెబీ నిర్ణయించే వెయిటేజ్‌పై ఆధారపడి ఉంటుంది.
ఒక్క మాటలో చెప్పాలంటే ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి స్టాక్ మార్కెట్లో ఎఫ్డీల్లాంటివి! దీర్ఘకాలంలా ఈ ఇండెక్స్ ఫండ్స్ 12శాతం రిటర్నులు తెచ్చుపెట్టాయి. అందుకే, స్టాక్ మార్కెట్లో ఈ 12శాతాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు.
ఉదాహరణకు మీరు 30ఏళ్ల పాటు, ప్రతి నెలా రూ. 5వేల వరకు ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయగలిగితే.. మీరు పెట్టుబడి పెట్టింది కేవలం రూ. 18లక్షలు అవుతుంది. కానీ మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ రూ. 1,76,49,569 అవుతుంది! ఇలా తక్కువ రిస్క్‌తో మీరు కోటీశ్వరులు అవ్వొచ్చు.
ఎక్కువ రిస్క్ తీసుకోకుండా, దీర్ఘకాలంలో మంచి లాభాలు పొందాలని చూసే వారికి ఇవి కరెక్ట్‌గా సూట్ అవుతాయి.
అయితే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే ముందు వాటి హిస్టరీతో పాటు ఎక్స్పెన్స్ రేషియో, ట్యాక్స్ పర్సెంటేజ్ వంటివి కూడా పరిగణలోకి తీసుకోవాలి.
ఏదేమైనా మ్యూచువల్ ఫండ్స్ అనేది రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం అని గుర్తుపెట్టుకోవాలి.
(గమనిక:- ఇది సమాచారం రూపొందించిన కథనం మాత్రమే. హెచ్‌టీ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మీరు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించడం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం