ద్రవ్యోల్బణంతో పోరాడేందుకు సామాన్యుడికి ఉన్న అతిపెద్ద ఆయుధం 'ఇన్వెస్ట్మెంట్'. ఈ విషయం ఇటీవలి కాలంలో బాగా అర్థమవ్వడంతో చాలా మంది భవిష్యత్తు కోసం పెట్టుబడులను ప్రారంభిస్తున్నారు. వీరిలో చాలా మంది సులభతరమైన మ్యూచువల్ ఫండ్స్‌ని ఎంచుకుంటున్నారు. నెల నెల సిప్ చేస్తూ, సంపద సృష్టికి కలలు కంటున్నారు. కానీ ఇప్పటికీ చాలా మంది తమ ఇన్వెస్ట్మెంట్ జర్నీని ప్రారంభించడం లేదు. తక్కువ జీతంలో డబ్బులు సరిపోవడం లేదని, మిగిలిన అర-కొరతో ఇన్వెస్ట్మెంట్ చేసినా ప్రయోజనం లేదని అనుకుంటున్నారు. కానీ ఇది నిజం కాదు! స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో ఎంత పెట్టుబడి పెడుతున్నాము అన్నది కాదు, ఎంత కాలం పెట్టుబడి పెట్టాము అన్నదే ముఖ్యం! ఈ నేపథ్యంలో, నెలకు కనీసం రూ. 1000తో సిప్ ప్రారంభిస్తే ఏమవుతుంది? అసలు ఏమైనా ప్రయోజనం ఉందా? అన్న విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాము..
మ్యూచువల్ ఫండ్స్ చాలా రకాలు ఉంటాయి. కానీ రిటర్నులను లెక్కించేటప్పుడు ఇండెక్స్ ఫండ్స్‌ని ప్రామాణికంగా తీసుకుంటారు. స్టాక్ మార్కెట్ సూచీల్లో పెట్టుబడి చేయడమే ఇండెక్స్ ఫండ్స్‌కి అర్థం. దీర్ఘకాలంలో ఇవి సగటున 12శాతం రిటర్నులు ఇచ్చాయి.
ఉదాహరణకు.. 25ఏళ్ల వ్యక్తి తన రిటైర్మెంట్ కోసం 12శాతం వడ్డీని ఇచ్చే ఇండెక్స్ ఫండ్‌లో నెలకు రూ. 1000 సిప్‌ని ప్రారంభించాడు అనుకుందాము. 60ఏళ్లకు రిటైర్మెంట్ కాబట్టి.. ఇంకా 35ఏళ్లు మగిలి ఉంటుంది. ఫలితంగా 60ఏళ్లు వచ్చేసరికి సదరు వ్యక్తి ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ రూ. 4,20,000 కాగా, ఇన్వెస్ట్మెంట్ వాల్యూ రూ. 55,10,831 అవుతుంది.
అదే వ్యక్తి.. తన ఇన్వెస్ట్‌మెంట్‌ని ప్రతియేటా 10శాతం పెంచి స్టెప్-అప్ సిప్‌ని అనుసరిస్తే, ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ రూ. 32,52,292 కాగా, ఇన్వెస్ట్మెంట్ వాల్యూ రూ. 1,57,64,827 అవుతుంది.
ఇలా.. రూ.1000 సిప్‌ని ప్రారంభించి రిటైర్మెంట్ నాటికి రూ. కోటి సంపాదించుకోవచ్చు.
నిజమే! ఎంత ఎక్కువ పెట్టుబడి పెడితే, అంత ఎక్కువ రాబడి వస్తుంది. కానీ అది అందరికి సాధ్యం కాదు. ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి.. తక్కువ జీతంతో ఏం మిగలడం లేదని కాకుండా, ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసినా మంచి ఫలితాలు చూడవచ్చు. రెండో విషయం.. ఇన్వెస్ట్మెంట్ అనేది ఫైనాన్షియల్ జర్నీ. ఈ జర్నీని ముందు మొదలుపెట్టాలి! ప్రతినెలా కొంత కొంత ఇన్వెస్ట్ చేస్తుంటే ఆ మైండ్‌సెట్ క్రియేట్ అవుతుంది. మైండ్‌సెట్ అనేది చాలా ముఖ్యం. రేపు అనే రోజున జీతం పెరిగితే, మీరు అనవసరమైన ఖర్చులు కాకుండా, ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా మీ మైండ్‌సెట్ మారుతుంది. అది రావాలంటే ముందు మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని ప్రారంభించాలి.
మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చాలా సులభమైంది. యూట్యూబ్ లేదా సోషల్ మీడియా, న్యూస్ వెబ్‌సైట్స్‌లో అందిస్తున్న సమాచారంతో జ్ఞానం పెంచుకుని, మన ఫోన్ నుంచే సింపుల్‌గా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్‌ని ప్రారంభించవచ్చు. అంతేకాదు, ఇండియాలో రూ.500తోనే ఇన్వెస్ట్ చేయవచ్చు.
అయితే, పెట్టుబడులకు ఒక 'గోల్' ఇస్తే, మనం వాటికి కట్టుబడి, రెగ్యులర్‌గా, క్రమశిక్షణతో ఇన్వెస్ట్ చేస్తాము. ఉదాహరణకు, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్‌ని ప్రారంభించే ముందే.. అది పిల్లల చదువుకా? కారు కొనాలనా? రిటైర్మెంట్ ఫండ్ కోసమా? ఇల్లు కొనడం కోసమా? అని నిర్ణయించుకోవాలి. అందుకు తగ్గట్టు పెట్టుబడి పెట్టాలి.
సంబంధిత కథనం