Multibaggar stock : ఏడాది తిరగకుండానే రూ. 1 లక్షను రూ. 1 కోటి చేసిన మల్టీబ్యాగర్ స్టాక్!
Multibaggar stock : తక్కువ సమయంలోనే ఇన్వెస్టర్లకు మంచి రాబడులు ఇచ్చిన కంపెనీలు స్టాక్ మార్కెట్లో చాలా ఉన్నాయి. వాటిల్లో ఒక స్టాక్.. ఏడు నెలల్లో ఏకంగా రూ. 1లక్షను రూ. 1కోటి చేసింది!

భారత స్టాక్ మార్కెట్లో తక్కువ సమయంలోనే ఇన్వెస్టర్లకు గొప్ప రాబడులు ఇచ్చిన స్టాక్స్ చాలానే ఉన్నాయి. పెట్టుబడిదారులకు బలమైన రిటర్నులు ఇచ్చిన అటువంటి ఒక స్టాక్ గురించి ఈ రోజు మేము మీకు చెబుతాము. శ్రీ అధికారి బ్రదర్స్ టెలివిజన్ నెట్వర్క్ లిమిటెడ్ స్టాక్ ఏడాది కాలంలో భారీగా పెరిగి, గత కొన్ని సెషన్లలో స్థిరమైన పెరుగుదలను చూస్తోంది. ఈ కంపెనీ షేరు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దాదాపు 11,000 శాతం పెరిగింది! ఈ కాలంలో షేరు ధర రూ.2.90 నుంచి ప్రస్తుత ధర రూ.319.78కి చేరింది. అంటే రూ. 2.90 వద్ద రూ. 1లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, 7 నెలల్లో అది రూ. 1 కోటి అయ్యుండేది!
భారీగా పెరిగిన మల్టీబ్యాగర్ స్టాక్..
శ్రీ అధికారి బ్రదర్స్ టెలివిజన్ నెట్వర్క్ లిమిటెడ్ షేర్లు ఒక నెలలో సుమారు 45 శాతం పెరిగాయి! గత ఆరు నెలల్లో ఈ 8,427.47 శాతం లాభాలు చూశాయి. ఇదే సమయంలో రూ.3.75 నుంచి ప్రస్తుత ధరకు పెరిగింది. గత ఏడాది కాలంలో ఈ షేరు 23,587.41 శాతం లాభపడటం విశేషం. ఏడాదిలో షేరు ధర రూ.1.35 నుంచి ప్రస్తుత ధరకు పెరిగింది. ఐదేళ్లలో ఈ షేరు 14,000 శాతం వృద్ధిచెందింది. దీని 52 వారాల గరిష్ట ధర రూ .319.78, 52 వారాల కనిష్ట ధర రూ .41.25. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.811.38 కోట్లుగా ఉంది.
శ్రీ అధికారి బ్రదర్స్ టెలివిజన్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక భారతీయ టెలివిజన్ నెట్వర్క్ సంస్థ. దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. 1994లో స్థాపించిన శ్రీ అధికారి బ్రదర్స్ టెలివిజన్ నెట్వర్క్ లిమిటెడ్ వివిధ బ్రాడ్కాస్టర్లు, అగ్రిగేటర్లు, శాటిలైట్ నెట్వర్క్ కోసం కంటెంట్ ఉత్పత్తి, సిండికేషన్లలో నిమగ్నమైన ఒక మీడియా సంస్థ.
స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు మల్టీబ్యాగర్ స్టాక్స్ కోసం వెతుకుతుంటారు. వీటిల్లో రివార్డు ఎంత ఉంటుందో, రిస్క్ కూడా అదే విధంగా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. మరీ ముఖ్యంగా పెన్నీ స్టాక్స్‌లో చాలా రిస్క్ ఉంటుంది. కంపెనీ ఫండమెంటల్స్ తెలుసుకోకుండా, కేవలం స్టాక్ పెరుగుతోందన్న కారణంతో పెట్టుబడులు పెడితే, భారీగా నష్టపోయే అవకాశం కూడా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి.
(గమనిక: ఇది కేవలం సమచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించడం శ్రేయస్కరం.)