Pension Hike : కనీస పింఛను పెంపునకు మోదీ ప్రభుత్వం కసరత్తు.. 78 లక్షల మందికి ప్రయోజనం!
ఈపీఎస్-95 పథకం కింద సుమారు 78 లక్షల మంది పెన్షనర్లకు గుడ్ న్యూస్! కనీస నెలవారీ పెన్షన్‌ని రూ.7,500కు పెంచాలన్న డిమాండ్‌ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ విషయంపై మోదీ సైతం సీరియస్‌గా ఉన్నారని తెలుస్తోంది.
కనీస నెలవారీ పింఛను పెంచాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న లక్షలాది మందికి శుభవార్త అందింది! అధిక పింఛన్ల డిమాండ్‌ని పరిశీలిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ విషయాన్ని పెన్షనర్ల సమాఖ్య ఈపీఎస్-95 నేషనల్ ఆజిటేషన్ కమిటీ (ఎన్ఏసీ) శుక్రవారం తెలిపింది. ప్రధాని మోదీ కూడా ఈ విషయంపై సీరియస్‌గా ఉన్నారని వెల్లడించింది.
రూ. 7,500కి పింఛను పెంపు!
కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తమ ప్రతినిధులతో సమావేశమయ్యారని పెన్షనర్ల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా కార్మిక శాఖ మంత్రి మాట్లాడుతూ కనీస పింఛను పెంపు డిమాండ్‌ని తీర్చడానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈపీఎస్-95 పథకం కింద సుమారు 78 లక్షల మంది పెన్షనర్లు కనీస నెలవారీ పెన్షన్‌ని రూ.7,500కు పెంచాలని చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు.
దిల్లీలో ఈపీఎస్-95 ఎన్ఏసీ సభ్యులు చేపట్టిన నిరసన అనంతరం మన్సుఖ్ మాండవీయతో భేటీ అయ్యారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సభ్యులు ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసి, నెలవారీ సగటు పెన్షన్ రూ .1,450 కి బదులుగా ఎక్కువ పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాదాపు 36 లక్షల మంది పెన్షనర్లకు నెలకు రూ.1,000 లోపు అందుతోందని గుర్తు చేశారు.
ఇదీ చూడండి:- ITR filing: ఐటీఆర్ ఫైలింగ్ గడువు మిస్ అయ్యారా?.. బిలేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేయండి.. అయితే, షరతులు వర్తిస్తాయి!
“ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సీరియస్‌గా ఉందని కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ హామీ ఇచ్చారు. మా సమస్యల పరిష్కారానికి ప్రధాని కూడా కట్టుబడి ఉన్నారని చెప్పారు. రెగ్యులర్ పెన్షన్ ఫండ్‌కు దీర్ఘకాలిక కంట్రిబ్యూషన్లు చేసినప్పటికీ పెన్షనర్లకు చాలా తక్కువ పెన్షన్ లభిస్తుందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఉన్న పింఛన్ మొత్తం కూడా వృద్ధ దంపతులకు బతకడం కష్టతరం చేస్తుంది,” అని ఎన్ఏసీ పేర్కొంది.
కనీస పింఛనును నెలకు రూ.7,500కు పెంచాలని ఈపీఎస్-95 ఎన్ఏసీ కోరిందని, డియర్నెస్ అలవెన్స్, పెన్షనర్ జీవిత భాగస్వామికి ఉచిత వైద్య సదుపాయాలు వంటి డిమాండ్లు కూడా ఉన్నాయని ఎన్ఏసీ జాతీయ అధ్యక్షుడు అశోక్ రౌత్ తెలిపారు. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు కూడా సంస్థ సభ్యులను కలుసుకుని మరింత పింఛను డిమాండ్‌ని నెరవేర్చడానికి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చినట్టు రౌత్ తెలిపారు.
సంబంధిత కథనం