ఇండియాలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. పెరుగుతున్న ఇంధన ధరలతో విసిగిపోయిన ప్రజలు ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ కార్లు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. టాటా మోటార్స్ ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలలో ముందంజలో ఉంది.
టాటా ప్రతి నెలా రికార్డు స్థాయిలో ఈవీలను డెలివరీ చేస్తోంది. టాటా నెక్సాన్ ఈవీకి భారీ డిమాండ్ ఉంది. ఇప్పుడు చైనాకు చెందిన ఎంజీ మోటార్ భారతదేశంలో నెక్సాన్‌కు సరైన పోటీదారుని విడుదల చేసింది. అదే ఎంజీ విండ్సర్ ఈవీ.
రెండు కార్ల మధ్య ధర, లక్షణాలు, పనితీరు గురించి చూద్దాం.. కొత్త టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు ధర రూ. 12.49 లక్షలు నుంచి రూ. 17.19 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు వరకు ఉంది. రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. అవి 30 kWh, 45 kWh.
భారతదేశంలో కొత్త ఎంజీ విండ్సర్ ధర, వేరియంట్లను బట్టి ఉంది. ప్రారంభ ధర రూ. 14 లక్షలు, టాప్ వేరియంట్ ధర రూ. 16 లక్షలు(ఎక్స్-షోరూమ్). ఇది 604 లీటర్ల బూట్ స్పేస్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది ఐపీ67-సర్టిఫైడ్ 38kWh బ్యాటరీని కూడా కలిగి ఉంది.
30 kWh బ్యాటరీ ప్యాక్‌తో కూడిన టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ SUV మోడల్, పూర్తి ఛార్జ్‌పై 275 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. అదేవిధంగా 45 kWh బ్యాటరీ ప్యాక్ కలిగిన మోడల్ పూర్తి ఛార్జ్ మీద 489 కిలోమీటర్లు రేంజ్ అందిస్తుందని టాటా పేర్కొంది.
ఎంజీ విండ్సర్ ఈవీ కారు 38 kWh బ్యాటరీ ప్యాక్ ఎంపికతో మాత్రమే లభిస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 332 కి.మీ సర్టిఫైడ్ రేంజ్ తో ఉంటుంది. సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ 134 బిహెచ్‌పీ పవర్, 200 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.
కొత్త టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారులో 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 9-స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, ఆటో ఏసీ, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, సన్‌రూఫ్ వంటి వివిధ ఫీచర్లు ఉన్నాయి.
ఎంజీ విండ్సర్‌లో ఏరో లాంజ్ సీట్లు, 15.6-అంగుళాల గ్రాండ్‌వ్యూ టచ్ డిస్‌ప్లే, రియల్-టైమ్ నావిగేషన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ పోర్ట్, కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్, రిమోట్ వెహికల్ కంట్రోల్, సేఫ్టీ అలర్ట్‌లతో సహా 80 కి పైగా కనెక్ట్ చేసిన ఫీచర్లు ఉన్నాయి.