MG Windsor EV : ఈ బెస్ట్ ఎలక్ట్రిక్ కారు ధర పెంచేసింది.. ఇప్పుడు కొంటే 50 వేలు ఎక్కువ ఇవ్వాల్సిందే!
MG Windsor EV Price Hike : దేశంలో తోపు ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి ఎంజీ విండ్సర్ ఈవీ. దీనిపై మెుదటి నుంచి కస్టమర్లకు ఆసక్తి. తాజాగా కంపెనీ ఈ ఈవీపై ధరలు పెంచింది.
బ్రిటీష్ ఆటో బ్రాండ్ ఎంజీ తన పాపులర్ ఎలక్ట్రిక్ కారు విండ్సర్ ఈవీ ధరలను 50,000 పెంచింది. అంటే ఇప్పుడు ఎంజీ విండ్సర్ ఈవీ కొనడం కాస్త ఖరీదైనదిగా మారింది. ఈ పెంపు అన్ని వేరియంట్లకు వర్తిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తున్నట్టుగా ప్రకటించింది. ఎంజీ విండ్సర్ ఈవీ ప్రారంభ ధర రూ .14 లక్షల నుండి రూ .16 లక్షలు(ఎక్స్-షోరూమ్). ఈ ఈవీకి సంబంధించిన ఫీచర్లు ఏంటో తెలుసుకుందాం..
ఈ కలర్ ఆప్షన్స్
ఎంజీ విండ్సర్ ఈవీ మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఎక్సైట్, ఎక్స్ క్లూజివ్, ఎసెన్స్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇది కాకుండా ఈ కారు నాలుగు కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఇది క్లే బీజ్, పెర్ల్ వైట్, స్టార్బర్స్ట్ బ్లాక్, టర్కోయిస్ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది.
రేంజ్ వివరాలు
ఎంజీ విండ్సర్ ఈవి 38 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగిస్తుంది. ఇది ఒకే ఎలక్ట్రిక్ మోటార్‌కు కనెక్ట్ అయి ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 134బిహెచ్‌పీ పవర్, 200ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఈ కారు 331 కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. అనేక రకాల ఫీచర్లను అందిస్తుంది.
బ్యాటరీ ప్లాన్
విండ్సర్ ఈవి కోసం బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్(బీఏఏఎస్) ప్లాన్‌లను కూడా కంపెనీ ప్రవేశపెట్టింది. ఇది వినియోగదారులు బ్యాటరీని కొనుగోలు చేయడానికి బదులుగా సబ్‌స్క్రిప్షన్ ప్రాతిపదికన ఉపయోగించడానికి అనుమతిస్తుంది. ఖర్చును తగ్గించుకోవాలనుకునే కస్టమర్లకు ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది.
పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ఎంజీ విండ్సర్ ఈవీని ప్రత్యేకంగా రూపొందించారు. దీని డిజైన్ ప్రీమియం, ఆధునికమైనది. ఎలక్ట్రిక్ వాహనం కొనాలనుకుంటే ఎంజీ విండ్సర్ ఈవీ మంచి ఆప్షన్. ఇది లాంగ్ రేంజ్, గొప్ప ఫీచర్లతో రావడమే కాకుండా బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.