ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారుగా దూసుకెళుతున్న ఎంజీ విండ్సర్ ఈవీపై మరో బిగ్ అప్డేట్! ఈ మోడల్ 2024 సెప్టెంబర్‌లో లాంచ్ అవ్వగా, తాజాగా 27000 సేల్స్ మైలురాయిని దాటింది. తొలుత ఈ ఈవీ చిన్న 38 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వచ్చింది. అయితే మే 2025లో పెద్ద 52.9 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో కూడిన విండ్సర్ ఈవీ ప్రో వేరియంట్‌ను ఎంజీ విడుదల చేసింది. అంతేకాదు, కొత్త వేరియంట్ ప్రారంభించిన 24 గంటల్లోనే 8,000 బుకింగ్‌లు సాధించిందని కంపెనీ ప్రకటించడం విశేషం.
మెట్రో నగరాలతో పాటు, అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుంచి కూడా ఎంజీ విండ్సర్ ఈవీకి బలమైన డిమాండ్ కనిపిస్తుండటం హైలైట్! ఈ ఎలక్ట్రిక్ కారు మొత్తం అమ్మకాల్లో నాన్-మెట్రో నగరాల వాటా దాదాపు 48 శాతం ఉందని కార్ల తయారీ సంస్థ తెలిపింది.
ఎంజీ విండ్సర్ ఈవీ అనేది బ్రాండ్ మొదటి 'బ్యాటరీ-యాస్-ఏ-సర్వీస్ (BaaS)' ఆప్షన్‌తో వచ్చిన ఎలక్ట్రిక్ కారు. ఇది ఎలక్ట్రిక్ క్రాసోవర్ ధరలను గణనీయంగా తగ్గించడానికి సహాయపడింది. BaaS ప్యాకేజీతో, ఎంజీ విండ్సర్ ఈవీ ధర రూ. 10 లక్షల నుంచి టాప్-ఎండ్ ఎసెన్స్ ప్రో మోడల్‌కు రూ. 13.10 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. అయితే, బ్యాటరీతో సహా పూర్తి కారును కొనుగోలు చేయాలనుకుంటే, విండ్సర్ ఈవీ ధర రూ. 14 లక్షల నుంచి రూ. 18.10 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది.
ఎంజీ విండ్సర్ ఈవీ మార్కెట్లో ఉన్న ఏ క్రాసోవర్‌తో పోల్చినా భిన్నంగా ప్రత్యేకమైన డిజైన్‌ను కలిగి ఉంది. ఇది హ్యాచ్‌బ్యాక్, ఎంపీవీ, కాంపాక్ట్ ఎస్యూవీ స్టైల్ ఎలిమెంట్స్ సమ్మేళనంతో తయారైంది. ముందు భాగంలో ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు, ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, ప్రకాశవంతమైన ఎంజీ లోగోతో కూడిన స్ప్లిట్ లైటింగ్ డిజైన్ ఉంది. ఎలక్ట్రిక్ కారు సైడ్‌లో ఫ్లోయింగ్ లైన్స్, పెద్ద విండోలు, అల్లాయ్ వీల్స్ కనిపిస్తాయి. కొన్ని ట్రిమ్‌లలో బ్లాక్-అవుట్ పిల్లర్ ఉండటం వల్ల కారుకు 'ఫ్లోటింగ్ రూఫ్' రూపాన్ని ఇస్తుంది.
కారు వెనుక భాగంలో కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు, రూఫ్ స్పాయిలర్, వాలుగా ఉండే రేర్ విండో డిజైన్‌కు మరింత ఆకర్షణ ఇస్తాయి. లోపల, డార్క్ కలర్ స్కీమ్, బ్రాంజ్- వుడ్ యాక్సెంట్‌లు క్యాబిన్ అట్రాక్టివ్‌గా ఉంటుంది. పానోరమిక్ గ్లాస్ రూఫ్ (పెద్ద సన్‌రూఫ్) మరొక అట్రాక్షన్.
ఎంజీ విండ్సర్ ఈవీ అనేక ఫీచర్లు, విశాలమైన క్యాబిన్‌తో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోడల్ 15.6-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో కూడిన యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 9-స్పీకర్ల ఇన్ఫినిటీ సౌండ్ సిస్టమ్, ఆటో క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ గ్లాస్ రూఫ్, రిక్లైనింగ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటివి ఇందులో ఉన్నాయి. భద్రతా కిట్‌లో భాగంగా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, హిల్ హోల్డ్ ఫంక్షన్ వంటివి కూడా ఈ ఈవీలో ఉన్నాయి.
ఎంజీ విండ్‌సర్ ఈవీలోని అన్ని వేరియంట్లలో 38 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ 134 బీహెచ్పీ పీక్ పవర్‌ని, 200 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ ఈవీ 331 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంది. కాగా, ప్రొ వేరియంట్లలో పెద్ద 52.9 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంది, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 449 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. అయితే, ప్రొ వేరియంట్ల పవర్ స్పెసిఫికేషన్ మాత్రం మారదు.
సంబంధిత కథనం