Electric Car : ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో ఈ కంపెనీ కార్లు నెంబర్ 1.. టాటాకు గట్టి పోటీ అనుకోవచ్చు!
MG Windsor EV Sales : మార్కెట్‌లో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతుంది. దీనికి తగ్గట్టుగా కంపెనీలు సైతం కొత్త మోడల్స్ ప్రవేశపెడుతున్నాయి. ఎంజీ విండ్సర్ ఈవీ.. అమ్మకాల్లో దూసుకెళ్లింది. అక్టోబర్ నెలలో టాప్‌లో నిలిచింది.
ఎంజీ విండ్సర్ ఈవీ ఈ పండుగ సీజన్‌లో అమ్మకాల్లో జోరు చూపించింది. టాప్ గెయినర్‌లలో ఒకటిగా నిలిచింది. ఎంజీ అక్టోబర్ నెలలో అత్యధిక నెలవారీ అమ్మకాలను సొంతం చేసుకుంది. గత నెలలో భారతదేశంలో మొత్తం 7045 కార్లను విక్రయించింది. 2023లో విక్రయించిన 5108 యూనిట్లతో పోలిస్తే ఇదే అధికం. ఈ లెక్కన ఏడాది ప్రాతిపదికన వృద్ధి 37.92 శాతంగా ఉంది. భారతదేశంలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇదే బెస్ట్ సేల్స్ అని చెప్పవచ్చు. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో ఎంజీ 70 శాతంగా ఉంది.
ఎంజీ విండ్సర్ ఈవీ క్రాస్ఓవర్ యుటిలిటీ వెహికల్(సీయూవీ) ఈ అమ్మకాలకు కారణంగా చెప్పవచ్చు. విండ్సర్ బుకింగ్‌ల మొదటి రోజున 15,000 మంది కస్టమర్‌లను సంపాదించుకుంది. దసరా వేడుకలతో పాటు ఈవీ డెలివరీ ప్రారంభమైంది. విండ్సర్ భారతదేశంలో బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్(BAAS) ప్రోగ్రామ్ కింద వచ్చిన మొదటి ఎలక్ట్రిక్ కారు. ఈ పద్ధతి ధరను గణనీయంగా తగ్గిస్తుంది.
BAAS ప్రోగ్రామ్ కింద ఈవీ రూ. 9.99 లక్షలకు అందుబాటులో ఉంది. అలా కాకుండా ప్రతి కిలోమీటరుకు రూ.3.50 అద్దె కంపెనీకి చెల్లిస్తే సరిపోతుంది. ఇదిలా ఉంటే బ్యాటరీ లేకుండా కొనుగోలుదారులు కారును రూ. 13.50 లక్షల నుంచి కొనుగోలు చేయవచ్చు.
ఎంజీ విండ్సర్ ఈవీ ఒక పెద్ద హ్యాచ్‌బ్యాక్ లాగా కనిపిస్తుంది. CUV ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్, ఎసెన్స్ అనే మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. టర్కోయిస్ గ్రీన్, స్టార్‌బర్స్ట్ బ్లాక్, పెర్ల్ వైట్, క్లే బీజ్ కలర్ ఆప్షన్స్‌లో ఉన్నాయి. 15.6-అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్, కనెక్టివిటీ ఆప్షన్స్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రానిక్ టెయిల్‌గేట్, యాంబియంట్ లైటింగ్, స్టీరింగ్ వీల్-మౌంటెడ్ మీడియా కంట్రోల్స్, లెవల్-2 ఏడీఏఎస్, 360-డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, టైర్ కారులో ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌లు, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు, ఆటో-డిమ్మింగ్ ఇంటీరియర్ రియర్‌వ్యూ మిర్రర్‌లు ఉన్నాయి.
కారు సేఫ్టీ చూసుకుంటే ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ISOFIX చైల్డ్ సీట్ ఎంకరేజ్‌లు, వెనుక పార్కింగ్ సెన్సార్‌లతో కూడిన 360-డిగ్రీ కెమెరా ఉన్నాయి.
38 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ పూర్తి ఛార్జ్‌పై సుమారు 330 కి.మీల రేంజ్ అందిస్తుంది. ఇది 136 పీఎస్ పవర్, 200 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటారు ద్వారా శక్తిని పొందుతుంది. 3kW ఛార్జర్ ద్వారా బ్యాటరీని 15 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. 7.4 kW ఫాస్ట్ ఛార్జర్‌తో బ్యాటరీని గంటలో 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.
విండ్సర్ ఈవీ ఎంట్రీ .. టాటా ప్రముఖ మోడల్స్ అయిన పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీలకు కూడా ప్రత్యర్థిగా ఉంది. టాటా కూడా త్వరలో తన కార్లలో BAAS ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.