Meta layoffs 2025 : ఉద్యోగులకు షాక్ ఇచ్చిన మార్క్ జుకర్‌బర్గ్.. మెటాలో 5 శాతం ఉద్యోగాల కోత
Meta to lay off 2025 : ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటా తన ఉద్యోగుల్లో ఐదు శాతం మందికి లేఆఫ్స్ ఇచ్చే ఆలోచనలో ఉంది. ఉద్యోగులందరికీ సీఈవో మార్గ్ జుకర్ బర్గ్ నుంచి నోట్ వెళ్లినట్టుగా తెలుస్తోంది. అందులో లేఆఫ్స్‌కు సంబంధించిన విషయాన్ని ప్రస్తావించారు.
మెటా కంపెనీ భారీగా ఉద్యోగాల్లో కోత విధించేందుకు సిద్ధమవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. పనితీరు ఆధారంగా దాదాపు 5 శాతం లేదా 3,600 ఉద్యోగులను తగ్గించుకునే పనిలో ఉంది. సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ నుండి ఉద్యోగులకు నోట్ కూడా వచ్చింది. దీని ప్రకారం ప్రభావితమైన ఉద్యోగులకు ఫిబ్రవరి 10 నాటికి నోటిఫికేషన్‌లు అందుతాయని తెలుస్తోంది.
జుకర్‌బర్గ్ ఉద్యోగులందరికీ పంపిన మెమోలో 'నేను పనితీరు నిర్వహణపై పరిమితి పెంచాలని నిర్ణయించుకున్నాను. తక్కువ పనితీరు ఉన్నవారిని వేగంగా తొలగించాలని అనుకుంటున్నాను. ఒక సంవత్సరం వ్యవధిలో అంచనాలను అందుకోలేని ఉద్యోగులను చూస్తాం. పనితీరు ఆధారిత లేఆఫ్స్ చేయబోతున్నాం.' అని ఉంది.
సెప్టెంబర్ 2024 నాటికి మెటా దాదాపు 72,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. 5 శాతం కోతతో కనీసం 3,600 ఉద్యోగాలపై ప్రభావం పడుతుంది. మెటా పనితీరు సైకిల్ ఫిబ్రవరిలో ముగుస్తుంది. లేఆఫ్స్ విషయం యూఎస్‌లోని ఉద్యోగులకు ఫిబ్రవరి 10న తెలియజేయాలని భావిస్తున్నామని, ఇతర దేశాలలో ఉన్న వారికి తర్వాత తెలియజేస్తామని మెమోలో పేర్కొన్నారు.
తొలగించిన ఉద్యోగుల స్థానంలో 2025లో కొత్త నియామకాలు ఉంటాయని జుకర్ బర్గ్ తెలిపారు. ఈ కోతలు పనితీరు ఆధారితమైనవని, కొత్త వ్యక్తులను తీసుకురాగలగడం లక్ష్యంగా పెట్టుకున్నాయని కంపెనీ అంటోంది. 2023లో మెటా 10,000 ఉద్యోగాలను తగ్గించినప్పుడు, జుకర్‌బర్గ్ ఆ ఏడాదిని మెటాకు సమర్థవంతమైన సంవత్సరంగా ప్రకటించారు. కంపెనీ బలోపేతం చేసేందుకు పని ఆధారంగా కోతలు విధిస్తున్నామని మెటా చెబుతోంది.
మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం చేయనున్న సందర్భంలో జుకర్ బర్గ్ ఈ నిర్ణయం తీసుకోవడంపై చర్చ జరుగుతోంది. ఇటీవలే మెటాలో కొన్ని మార్పులు కూడా చేశారు. యూఎస్‌లో ఫ్యాక్ట్ చెకింగ్ ఫీచర్‌ను తొలగించారు. అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌తో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి జుకర్‌బర్గ్ ప్రణాళికలు వేస్తున్నారని కూడా కొందరు అంటున్నారు.