భారత స్టాక్ మార్కెట్లలో ‘మార్వలెస్ మండే’! దాదాపు ఆరు నెలలుగా దేశీయ స్టాక్ మార్కెట్లో నష్టాల పరంపరను చూసి, తట్టుకున్న ఇన్వెస్టర్లకు సోమవారం ట్రేడింగ్ సెషన్ ద్వారా మంచి రివార్డు లభించింది. సెన్సెక్స్, నిఫ్టీ50, బ్యాంక్ నిఫ్టీ, స్మాల్ క్యాప్, మిడ్‌క్యాప్‌తో పాటు దాదాపు అన్ని ఇండెక్స్‌లు భారీ లాభాల్లో ముగిశాయి. మరీ ముఖ్యంగా.. ఇయర్ టు డేట్ (వైటీడీ)లో నిఫ్టీ50, బ్యాంక్ నిఫ్టీలు తొలిసారి గ్రీన్‌లోకి రావడం ఇన్వెస్టర్స్‌ని మరింత సంతోషపెట్టే విషయం. మరి దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ స్థాయిలో పెరగడానికి కారణాలేంటి?
సోమవారం ట్రేడింగ్ సెషన్లో బీఎస్ఈ సెన్సెక్స్ 1.40శాతం పెరిగి 77,984.38 వద్ద ముగిసింది. వైటీడీలో లాభాల్లోకి వచ్చేందుకు సెన్సెక్స్ ఇంకా 0.6శాతం పెరగాల్సి ఉంది.
నిఫ్టీ50 సైతం 1.39శాతం లాభపడి 23,658.35కు చేరింది. 2024 డిసెంబర్ 31న (23,644) తర్వాత నిఫ్టీ50 వైటీడీలో గ్రీన్‌లోకి వచ్చింది. అక్కడి నుంచి కాస్త పాయింట్లు కోల్పోయి, వైటీడీకి 0.3శాతం దూరంలో క్లోజ్ అయ్యింది.
ఇక బ్యాంక్ నిఫ్టీ సోమవారం విజృంభించిందనే చెప్పుకోవాలి. 2.3శాతం పెరిగి 51,704.95 వద్ద స్థిరపడింది. 2024 డిసెంబర్ 31 (50,860) తర్వాత వైటీడీని టచ్ చేసింది బ్యాంక్ నిఫ్టీ.
1] మెరుగైన క్యూ4 ఫలితాలు- ఈ క్యూ4 ఫలితాలు మెరుగ్గా ఉంటాయని మార్కెట్లో అంచనాలు మొదలవ్వడం లాభాలకు ఒక కారణం.
“ఎఫ్వై26, 27లో క్యాపిటల్ స్పెండింగ్ పెరుగుతుందని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేయడంతో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని భావిస్తున్నారు. 2024 సెప్టెంబర్‌లో జీడీపీ తగ్గినప్పటికీ, డిసెంబర్ నాటికి పుంజుకుంది. అదే విధంగా క్యూ4లో కూడా మెరుగైన ఫలితాలు వస్తాయని అంచనాలు ఉన్నాయి,” అని ప్రాఫిట్‌మార్ట్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ అవినాశ్ గోరఖ్కర్ తెలిపారు.
2. ఆర్బీఐ రెట్ కట్‌పై బజ్- గత వారం యూఎస్ ఫెడ్ సమావేశం తర్వాత ఆర్బీఐ రేట్ల కోతపై వస్తున్న వార్తలను ప్రస్తావిస్తూ ప్రాఫిట్‌మార్ట్ సెక్యూరిటీస్‌కి చెందిన అవినాష్ గోరఖ్కర్ మాట్లాడుతూ.. “ఏప్రిల్ 2025లో జరగబోయే ఆర్బీఐ పాలసీ సమావేశంలో మార్కెట్ రేట్ కట్ని ఆశిస్తోంది. ఆర్బీఐ రేట్ల కోత వల్ల మార్కెట్లో మరింత లిక్విడిటీ ఉండే అవకాశం ఉన్నందున, దలాల్ స్ట్రీట్ ఇన్వెస్టర్లు బలమైన కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు,” అని అన్నారు.
గత వారం ప్రచురించిన మోర్గాన్ స్టాన్లీ నివేదిక ఫలితాన్ని హైలైట్ చేస్తూ.. “భారతదేశ వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ద్రవ్యోల్బణం 2026 ఆర్థిక సంవత్సరంలో సగటున 4% ఉంటుందని అంచనా వేస్తున్నామని, ఆర్బీఐ 75 బేసిస్ పాయింట్లు (బీపీఎస్) రేటు కోతకు మార్గం సుగమం చేస్తుందని,” గోరక్ష్కర్ అన్నారు.
3. ఆకర్షణీయమైన వాల్యుయేషన్లు : నాణ్యమైన స్టాక్స్ మంచి వాల్యూయేషన్‌లో లభిస్తున్న కారణంగా డీఐఐలు, ఎఫ్ఐఐలు ఇద్దరూ కొనుగోళ్లవైపు మొగ్గుచూపుతున్నారు. 2025 మార్చ్‌లో కొన్ని సెషన్లు మినహా, డీఐఐలు నగదు విభాగంలో నిరంతరం కొనుగోళ్లు జరిపారు. గత శుక్రవారం సెషన్ ముగిసే సమయానికి, డీఐఐలు నగదు విభాగంలో రూ. 30,788.19 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగా, ఎఫ్ఐఐలు రూ. 15,412.13 కోట్ల విలువైన భారతీయ షేర్లను విక్రయించడం ద్వారా నికర అమ్మకందారులుగా మిగిలిపోయారు. క్యాష్ మార్కెట్లో రూ.5,819.12 కోట్ల విలువైన దలాల్ స్ట్రీట్ లిస్టెడ్ షేర్లను కొనుగోలు చేసిన ఎఫ్ఐఐలు గత వారం కొనుగోళ్లు ప్రారంభించారు.
ఆకర్షణీయ వాల్యుయేషన్లు, ఆర్థిక రికవరీ సంకేతాల మధ్య విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారత మార్కెట్లోకి తిరిగి రావడంతో ఈ పెరుగుదల జోరు కొనసాగుతుందని భావిస్తున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ రీసెర్చ్ - వెల్త్ మేనేజ్మెంట్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా తెలిపారు.
4. భారత ఆర్థిక వ్యవస్థపై బలమైన దృక్పథం: గత గురువారం ప్రచురించిన మోర్గాన్ స్టాన్‌లో నివేదిక ప్రకారం, భారత ఆర్థిక వ్యవస్థ 2028 నాటికి ప్రపంచంలో మూడొవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంటుంది. 2026 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 3.5 ట్రిలియన్ డాలర్ల నుంచి 4.7 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని గ్లోబల్ బ్రోకరేజీ సంస్థ అంచనా వేసింది.
ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం, ప్రధానంగా ఆహార ధరల తగ్గుదల అదనపు రేట్ల కోతకు అవకాశం కల్పిస్తుందని మోర్గాన్ స్టాన్లీ నివేదిక పేర్కొంది. గ్లోబల్ బ్రోకరేజీ సంస్థ భారతదేశ సీపీఐ ద్రవ్యోల్బణం 2026 ఆర్థిక సంవత్సరంలో సగటున 4% ఉంటుందని అంచనా వేసింది. జనవరి-మార్చి 2025 త్రైమాసికంలో, మోర్గాన్ స్టాన్లీ నివేదిక సీపీఐ ద్రవ్యోల్బణాన్ని దాని మునుపటి అంచనా 4.5% నుంచి సగటున 4% తగ్గించింది. సీపీఐని ఆర్బీఐ 2-6% పరిధిలో లక్ష్యంగా చేసుకున్నందున, ప్రస్తుత ధోరణి మరింత సడలింపులకు తగినంత అవకాశం కల్పిస్తుందని బ్రోకరేజీ సంస్థ తెలిపింది.
5. స్థిరమైన భారత రూపాయి (ఐఎన్ఆర్): "స్థిరమైన భారత రూపాయి కారణంగా, పోర్ట్‌ఫోలియో- సంస్థాగత విదేశీ పెట్టుబడులు పెరుగుతాయి. ఎఫ్ఐఐలలో ఇటీవలి ట్రెండ్ రివర్స్‌కి భారత రూపాయి బలపడటమం కూడా ఒక కారణమని చెప్పవచ్చు. అందువల్ల, 25 బేసిస్ పాయింట్ల రేటు తగ్గింపుతో సహా ఆర్బీఐ చర్యల తరువాత భారత స్టాక్ మార్కెట్లో ప్రస్తుత ర్యాలీ, ఎఫ్ఐఐలు భారతీయ స్టాక్స్ వైపు మొగ్గు చూపడానికి కారణం," అని లక్ష్మీశ్రీ ఇన్వెస్ట్మెంట్ అండ్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ అన్షుల్ జైన్ అన్నారు.
ఈ ర్యాలీ అనంతరం భారత స్టాక్ మార్కెట్ దృక్పథంపై కేజ్రీవాల్ రీసెర్చ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ ఫౌండర్ అరుణ్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. "ఏప్రిల్ 2వ తేదీన సుంకాల విషయంలో డొనాల్డ్ ట్రంప్ చేసే ప్రకటనలు.. స్టాక్ మార్కెట్లకు ముఖ్యమైన ఘట్టం. భారత మార్కెట్లలో ఏప్రిల్ 3న ట్రేడింగ్ పునఃప్రారంభమైనప్పుడు ఈ ప్రకటనల ప్రభావం మనపై పడుతుంది. మార్కెట్లకు అర్థవంతమైన ఎక్స్పోజర్ తీసుకునే ముందు పర్యవసానాలను అధ్యయనం చేయడం అర్థవంతంగా ఉంటుంది," అని అన్నారు.
సంబంధిత కథనం