SUV Cars : సెవెన్ సీటర్ వైపు జనాల చూపు.. మారుతి సుజుకి, హ్యుందాయ్, టయోటా మాస్టర్ ప్లాన్
SUV Cars : ఇటీవలి కాలంలో ఎస్‌యూవీలకు డిమాండ్ పెరుగుతుంది. మార్కెట్‌లో స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్స్ వైపు కస్టమర్లు మెుగ్గుచూపుతున్నారు. దీంతో కంపెనీలు సైతం డిమాండ్‌కు తగ్గట్టుగా కొత్త కార్లను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. వచ్చే ఏడాది మరికొన్ని సెవెన్ సీటర్ ఎస్‌యూవీలు విడుదల కానున్నాయి.
2024-25 ఏడాదికి సంబంధించి మొదటి నాలుగు నెలల్లో భారతదేశంలో విక్రయించిన మొత్తం ప్యాసింజర్ వాహనాలలో 63 శాతం ఎస్‌యూవీలు, ఎంపీవీల వంటి యుటిలిటీ వాహనాలే ఉన్నాయి. వీటికి డిమాండ్ పెరుగుతుండటంతో కంపెనీలు సైతం కొత్త కార్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
మారుతి సుజుకి, హ్యుందాయ్, టయోటాతోపాటుగా మరికొన్ని కంపెనీలు వచ్చే ఏడాది కాలంలో ఏడు సీట్ల యుటిలిటీ వాహనాలను ప్రవేశపెట్టనున్నట్లు ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. కరోనా మహమ్మారి తరువాత ప్రజలు తమ కుటుంబాలతో ఎక్కువగా ప్రయాణిస్తున్నందున పెద్ద ప్యాసింజర్ వాహనాల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. పెరుగుతున్న డిమాండ్‌ను క్యాష్ చేసుకోవడానికి కంపెనీలు సైతం ప్రయత్నాలు చేస్తున్నాయి.
లాంచ్ అయ్యే కార్లు
హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్ లిఫ్ట్ వెర్షన్ మొదట సెప్టెంబర్ ప్రారంభంలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. తరువాత మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా హైదర్ ఏడు సీట్ల వెర్షన్లు 2025లో రానున్నాయి. ఎంజీ గ్లోస్టర్, జీప్ మెరిడియన్, కియా కార్నివాల్ అప్డేటెడ్ వెర్షన్లు కూడా రోడ్లపై వస్తున్నాయి.
వీటివైపే మెుగ్గు
2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో భారతదేశంలో విక్రయించిన మొత్తం ప్యాసింజర్ వాహనాలలో 63 శాతం ఎస్‌యూవీలు, ఎంపీవీల వంటి పెద్ద యుటిలిటీ వాహనాలు ఉన్నాయి. వీటి ఆధారంగా ఎంత డిమాండ్ ఉందని అర్థం చేసుకోవచ్చు. ఇది అంతకుముందు సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే 50 శాతం ఎక్కువ.
ఖరీదైన కార్లపై ఆసక్తి
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో రూ .10 లక్షల కంటే ఎక్కువ ధర కలిగిన వాహనాలు 47 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఇది 2020-21 తో పోలిస్తే 22 శాతం పెరుగుదలగా నివేదిక తెలిపింది.
ప్రస్తుతం ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో చాలా మార్పులు వస్తున్నాయి. అమ్ముడు అయ్యే కార్లలో ఎక్కువ శాతం వాటా ఎస్‌యూవీలదే ఉంటుంది. మరోవైపు పెద్ద కార్ల వైపు కస్టమర్లు ఎక్కువగా మెుగ్గుచూపుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. చాలా మంది ఇండియన్లు ఖరీదైన కార్లను కొనేందుకు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఆటో మెుబైల్ ఇండస్ట్రీలో ఇండియా కీలకంగా మారింది. ఇతర దేశాలతో పోటీ పడుతుంది.