Maruti Suzuki Cars : ఒక్క నెలలో 2 లక్షల కార్లను విక్రయించిన మారుతి.. ఇదే కంటిన్యూ అయితే పోటీదారులకు కష్టమే!
Maruti Suzuki Cars Sales : భారత్‌లో మారుతి సుజుకి కార్లకు మంచి డిమాండ్ ఉంది. కొత్త కార్లను మార్కెట్లో పరిచయం చేస్తూ విక్రయిస్తోంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క నెలలోనే రెండు లక్షల కార్ల అమ్మకాలు చేసింది మారుతి.
అక్టోబర్ నెలలో పండుగ సీజన్ కావడంతో భారీగా కార్ల అమ్మకాలు జరిగాయి. కంపెనీలు పండగ చేసుకున్నాయి. అక్టోబర్ 2024 నెల అమ్మకాల గణాంకాలు చూస్తే.. మారుతి సుజుకి టాప్ గెయినర్‌లలో ఒకటిగా ఉంది. మారుతి కార్ల అమ్మకాల్లో ఎప్పుడూ ముందు ఉంటుంది. అయితే గత నెలలో మారుతి సుజుకి ఇండియా తన అత్యధిక నెలవారీ విక్రయాలను చేసింది.
అక్టోబర్‌లో నవరాత్రి, దీపావళి వేడుకల సందర్భంగా మారుతి షోరూమ్‌లలో కస్టమర్ల రద్దీ ఎక్కువే ఉంటుంది. మూడు ప్రధాన ప్రత్యర్థులు కూడా భారతదేశంలో మారుతి అమ్మకాలను అధిగమించలేకపోయాయి. మారుతి సుజుకి గత నెలలో మొత్తం 2,06,434 యూనిట్లను విక్రయించింది.
అక్టోబర్ 2023లో విక్రయించిన 1,99,217 యూనిట్లతో పోల్చితే ఇది సంవత్సరానికి 3.62 శాతం వృద్ధిగా ఉంది. కంపెనీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశీయ విక్రయాలు భారీగా ఉన్నాయి. అక్టోబర్ 2024లో దేశీయంగా మొత్తం 163,130 యూనిట్లు అమ్మకాలు జరిగాయి. మారుతి సుజుకి కార్లకు విదేశాలలో కూడా భారీ డిమాండ్ ఉంది. అక్టోబర్ 2024లో కంపెనీ ఎగుమతులు 33,168 యూనిట్లు. నెలవారీ ఎగుమతుల్లో ఇది కొత్త రికార్డు. విదేశీ మార్కెట్‌లలో భారత్‌లో తయారైన వాహనాలకు డిమాండ్ పెరుగుతుందనేందుకు ఇదో ఉదాహరణ.
ప్యాసింజర్ వాహనాలు అమ్మకాల్లో ఎక్కువగా ఉన్నాయి. ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 1,59,591 యూనిట్లు, తేలికపాటి వాణిజ్య వాహనాల అమ్మకాలు 3539 యూనిట్లుగా ఉన్నాయి. దేశీయ ప్యాసింజర్ వాహన విక్రయాలు అక్టోబర్ 2023 కంటే కొంచెం తక్కువగా ఉన్నాయి. దేశీయ విపణిలో ప్యాసింజర్ వాహన విక్రయాలు అక్టోబర్ 2023లో చూసుకుంటే 1,68,047 యూనిట్లుగా ఉన్నాయి. సెప్టెంబర్ 2024 అంతకు ముందు నెలతో పోలిస్తే, 10.09 శాతం వృద్ధి నమోదైంది. సెప్టెంబర్ 2024లో దేశీయ ప్యాసింజర్ వాహన విక్రయాలు 1,44,962 యూనిట్లుగా ఉన్నాయి.
అక్టోబర్ 2024 అమ్మకాలను సెగ్మెంట్ వారీగా పరిశీలిస్తే.. ఆల్టో, ఎస్-ప్రెస్సోతో కూడిన మినీ సెగ్మెంట్ క్షీణతను చూసింది. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ట్రెండ్ పెద్దగా మారలేదు. అక్టోబర్ 2023లో మినీ విభాగంలో అమ్మకాలు 14,568 యూనిట్లుగా ఉన్నాయి. కానీ అక్టోబర్ 2024లో అమ్మకాలు 10,687 యూనిట్లకు పడిపోయాయి.
స్విఫ్ట్, వ్యాగన్ఆర్, బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్ వంటి కాంపాక్ట్ కార్లకు కూడా డిమాండ్ తగ్గింది. అక్టోబర్ 2023లో విక్రయించిన 80,662 యూనిట్ల అమ్మకాలు జరగ్గా.. గత నెలలో అమ్మకాలు 65,948 యూనిట్లకు తగ్గాయి. ఈ నెలలో కొత్త తరం డిజైర్ విడుదలతో ఈ ట్రెండ్ మారుతుందని భావిస్తున్నారు. అనేక సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లతో వస్తున్న డిజైర్ సెడాన్ మార్కెట్‌కే కొత్త శక్తిని ఇస్తుందని అంచనా.
సియాజ్ మిడ్-సైజ్ సెడాన్ కూడా ఎదురుదెబ్బ తగిలింది. అక్టోబర్ 2023లో విక్రయించిన 695 యూనిట్ల నుండి గత నెల విక్రయాలు 659 యూనిట్లకు పడిపోయాయి. గత నెలలో కూడా యుటిలిటీ వాహనాలే మారుతికి బలంగా నిలిచాయి. ఫ్రాంక్స్, బ్రెజ్జా, ఎర్టిగాలతో పాటు మారుతీ జిమ్నీ, ఇన్విక్టో, XL6 మోడల్‌లను మెరుగుపరిచింది. యుటిలిటీ వెహికల్ విభాగంలో అక్టోబర్ 2023లో అమ్మకాలు 59,147 యూనిట్లుగా ఉన్నాయి. కానీ గత నెలలో 70,644 యూనిట్లకు ఎగబాకింది.
కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ విషయానికి వస్తే మారుతి గత నెలలో 3,539 యూనిట్ల డెలివరీ చేసింది. అక్టోబర్ 2023లో 3,894 యూనిట్లు అమ్ముడయ్యాయి. మారుతీ టయోటాకు రీబ్యాడ్జింగ్, అమ్మకం కోసం కొన్ని కార్లను సరఫరా చేస్తుంది. వీటి విక్రయాలు కూడా పెరిగాయి. అక్టోబర్ 2024లో టయోటాకు మారుతీ 10,136 కార్లను ఇచ్చింది. అక్టోబర్ 2023లో విక్రయించిన 5,325 యూనిట్ల కంటే ఈ పెరుగుదల దాదాపు రెట్టింపు.