Maruti Suzuki Q3 result: క్యూ3 లో 16% పెరిగిన మారుతి సుజుకీ నికర లాభం
Maruti Suzuki Q3 result: మారుతీ సుజుకీ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికం ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. దేశీయంగా అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ అయినమారుతి సుజుకి ఇండియా ఏకీకృత నికర లాభం రూ .3,726.9 కోట్లకు చేరుకుంది.
Maruti Suzuki Q3 result: దేశీయ అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికం ఫలితాలను ప్రకటించింది. ఈ క్యూ 3 లో మారుతి సుజుకీ కన్సాలిడేటెడ్ నికర లాభం 16.22 శాతం పెరిగి రూ.3,726.9 కోట్లకు చేరుకుంది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,206.8 కోట్లుగా ఉంది. ఈ క్యూ 3 లో కార్యకలాపాల ద్వారా వచ్చిన మొత్తం కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.38,764.3 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ 3 లో ఇది రూ.33,512.8 కోట్లుగా ఉంది. స్టాండలోన్ ప్రాతిపదికన కంపెనీ లాభం రూ.3,130 కోట్ల నుంచి 13 శాతం పెరిగి రూ.3,525 కోట్లకు చేరింది.

తగ్గిన ఇబిటా మార్జిన్
వడ్డీ, పన్నులు, తరుగుదల, అమోర్టైజేషన్ (IBITA)కు ముందు కంపెనీ ఆదాయం 14.4 శాతం పెరిగి రూ.3,907.9 కోట్ల నుంచి రూ.4,470.3 కోట్లకు పెరిగింది. అయితే ఇబిటా మార్జిన్ 11.7 శాతం నుంచి 11.6 శాతానికి స్వల్పంగా తగ్గింది. ఈ త్రైమాసికంలో అత్యధికంగా రూ.36,802 కోట్ల నికర అమ్మకాలను నమోదు చేసినట్లు మారుతి తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే తమ అమ్మకాలు దాదాపు 13 శాతం పెరిగాయని కంపెనీ తెలిపింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 5,01,207 యూనిట్లతో పోలిస్తే ఈ ఏడాది మూడో త్రైమాసికంలో 5,66,213 వాహనాలను విక్రయించినట్లు (car sales) వెల్లడించింది. దేశీయ మార్కెట్లో గత ఏడాది ఇదే త్రైమాసికంలో 4,29,422 యూనిట్లను విక్రయించగా, ఈ త్రైమాసికంలో 4,66,993 యూనిట్లను విక్రయించింది. ఈ త్రైమాసికంలో 99,220 యూనిట్లను ఎగుమతి చేసింది. ఇది ఏ త్రైమాసికంలోనూ ఎన్నడూ లేనంత అత్యధికం. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 71,785 యూనిట్లను ఎగుమతి చేసింది.
ఎఫ్ వై25 మొదటి 9 నెలల పనితీరు
గతంలో ఎన్నడూ లేనంతగా తొమ్మిది నెలల అమ్మకాల పరిమాణం, నికర అమ్మకాలు, నికర లాభాన్ని నమోదు చేసినట్లు మారుతి సుజుకి (maruti suzuki) కంపెనీ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (9MFY25) తొమ్మిది నెలల (ఏప్రిల్-డిసెంబర్) కాలంలో మారుతి సుజుకి 16,29,631 యూనిట్లను విక్రయించింది. దేశీయ మార్కెట్ అమ్మకాలు 13,82,135 యూనిట్లు, ఎగుమతులు 2,47,496 యూనిట్లుగా ఉన్నాయి. మారుతి 9MFY25లో రూ.1,06,266.4 కోట్ల నికర అమ్మకాలను నమోదు చేయగా, 9MFY24లో రూ.98,240.3 కోట్లుగా నమోదైంది. 9ఎంఎఫ్వై25లో రూ.10,244.1 కోట్ల నికర లాభాన్ని ఆర్జించగా, 9ఎంఎఫ్వై24లో రూ.9,331.6 కోట్లుగా నమోదైంది. మధ్యాహ్నం 2:20 గంటల సమయంలో మారుతి సుజుకి షేరు ధర (share price) 0.93 శాతం క్షీణించి రూ.12,009.85 వద్ద ట్రేడ్ అయింది.
సూచన: పై అభిప్రాయాలు, సిఫార్సులు వ్యక్తిగత విశ్లేషకులు, నిపుణులు, బ్రోకరేజీ సంస్థలవి, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు వి కాదు. ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ నిపుణులను సంప్రదించాలని మేము పెట్టుబడిదారులకు సలహా ఇస్తున్నాము.