Electric cars : 5ఏళ్లు.. 4 ఈవీలు- ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్‌పై మారుతీ సుజుకీ ఫోకస్..
Maruti Suzuki Electric cars : మారుతీ సుజుకీ సంస్థ త్వరలోనే తన తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని లాంచ్ చేయనుంది. అయితే భవిష్యత్తులో ఈవీ సెగ్మెంట్‌పై ఫోకస్ పెట్టి 4 కొత్త మోడల్స్‌ని తీసుకురావాలని ప్రణాళికలు రచించింది.
ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ సెగ్మెంట్లో దేశీయ దిగ్గజం మారుతీ సుజుకీ చాలా ఆలస్యంగా అడుగుపెడుతోంది. మారుతీ సుజుకీ ఈ విటారను సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సంస్థ నుంచి మరొ ఎగ్జైటింగ్ అప్డేట్ వచ్చింది. ప్రస్తుతానికి వెనకపడినా, భవిష్యత్తులో దేశ ఈవీ రంగంలో ప్రత్యేక ముద్రవేసేందుకు భారీ ప్లాన్సే వేసింది మారుతీ సుజుకీ. ఇందులో భాగంగానే 2030 నాటికి ఈవీ లీడర్‌గా ఆవిర్భవించాలని చూస్తోంది. ఇందుకోసం ఎఫ్వై30 నాటికి కనీసం 4 ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయాలని భావిస్తోంది. 2025-2030 ఆర్థిక సంవత్సరానికి తన ఉత్పత్తి వ్యూహం, మిడ్ టర్మ్ మేనేజ్మెంట్ ప్రణాళికను వెల్లడిస్తూ.. నాలుగు ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సంస్థ ధృవీకరించింది.
మారుతీ సుజుకీ ఎలక్ట్రిక్ కార్లు..
మారుతీ సుజుకీ తన మొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఈ విటారాను త్వరలో భారతదేశంలో విడుదల చేయనుంది. ఈ మోడల్ని ఆటో ఎక్స్పో 2025 లో ప్రదర్శించారు. 2030 నాటికి మరో మూడు ఎలక్ట్రిక్ కార్లను దేశీయ మార్కెట్లోకి విడుదల చేయాలని సంస్థ యోచిస్తోంది. మారుతీ సుజుకీ ఇప్పటికే బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా రూపొందించిన మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ క్రాసోవర్కి ఎలక్ట్రిక్ వర్షెన్‌ని తీసుకురాబోతున్నట్టు వెల్లడించింది.
ఇది కాకుండా ఎర్టిగాకి ఈవీ టచ్ ఇచ్చేందుకు మారుతీ సుజుకీ ప్లాన్ చేయొచ్చు. సరసమైన ఎంపీవీ సెగ్మెంట్ (ఈవీ)లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలు పెద్దగా అందుబాటులో లేవు. అందుకే ఎర్టిగా ఈవీ క్లిక్ అవుతుందని సంస్థ అంచనా వేస్తోందని సమాచారం. అయితే, ఆటో కంపెనీ తన ఎలక్ట్రిక్ వాహన ఉత్పత్తి వ్యూహం, ప్రాడక్ట్స్ గురించి ఇంకా ఎటువంటి వివరాలను వెల్లడించలేదు.
మారుతీ సుజుకీ టార్గెట్..
ప్రత్యర్థి కంపెనీల నుంచి పెరుగుతున్న పోటీతో ఈ కార్ల మార్కెట్ వాటా 50 శాతం దిగువకు పడిపోయింది. భారత ప్యాసింజర్ వాహన మార్కెట్లో కోల్పోయిన వాటాను తిరిగి పొందాలని మారుతీ సుజుకీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు, మారుతీ సుజుకీ 2030 ఆర్థిక సంవత్సరం నాటికి దానిని తిరిగి పొందాలని చూస్తోంది. నాలుగు ఎలక్ట్రిక్ కార్లతో సహా కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణలు ఈ వ్యూహంలో భాగం.
2030 ఆర్థిక సంవత్సరం నాటికి, మారుతీ సుజుకీ ఐసీఈ ఆధారిత మోడళ్లు కంపెనీ మొత్తం అమ్మకాలలో 60 శాతం, బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు 15శాతం, హైబ్రిడ్లు మొత్తం అమ్మకాలలో 25 శాతం వాటాను కలిగి ఉండేలా చూసుకోవాలని సంస్థ ప్రణాళికలు రచించింది.
సంబంధిత కథనం