Maruti E For Me : భారత్ మెుబిలిటీ ఈవెంట్‌లో ఎన్నో సర్‌ప్రైజ్‌లు.. 'ఈ ఫర్ మీ' విజన్‌తో వస్తున్న మారుతి
Maruti E For Me : దేశంలో అతిపెద్ద ఆటో ఈవెంట్ అయిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఆటో షో 2025 ప్రారంభానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ ఈవెంట్‌లో ఎన్నో గొప్ప సర్‌ప్రైజ్‌లు ఉండనున్నాయి. మారుతి కూడా ఈ ఫర్ మీ స్ట్రాటజీతో వస్తుంది.
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఆటో షో జనవరి 17 నుంచి ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్‌లో ఎన్నో గొప్ప సర్‌ప్రైజ్‌లతో కూడిన ఏడు బిగ్ లాంచ్‌లు ఉండబోతున్నాయి. దేశంలోని అతిపెద్ద కార్ల కంపెనీ మారుతి సుజుకి కూడా ఈ ఈవెంట్‌లో తన బ్లూప్రింట్ వివరాలను పంచుకోనుంది. అంటే కంపెనీ ఈవీ డెవలప్మెంట్ విజన్‌తో పాటు ఎలక్ట్రిక్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేసే ప్రయత్నాలను కూడా అందిస్తుంది.
మారుతి సుజుకి తన ఎలక్ట్రిక్ విజన్‌కు 'ఈ ఫర్ మీ' అని పేరు పెట్టింది. ఇది ఎలక్ట్రిక్ వాహనాలు, దాని మౌలిక సదుపాయాలకు సమగ్ర విధానంతో పాటు వాటిని మరింత అందుబాటులోకి తీసుకురావడానికి సృజనాత్మక పరిష్కారాలను లక్ష్యంగా పెట్టుకుందని కంపెనీ తెలిపింది. దీని ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలే కాకుండా ఛార్జింగ్ స్టేషన్లు కూడా అభివృద్ధి చేయనుంది.
మారుతి సుజుకి ఇండియా మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ మాట్లాడుతూ, 'ఈ వ్యూహం కేవలం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రారంభించడమే కాదు.. అంతకు మించినది. ఇది పర్యావరణ వ్యవస్థ గురించి, ఎలక్ట్రిక్ మొబిలిటీకి మార్పును ప్రతి భారతీయుడికి అంతరాయం లేకుండా చేస్తుంది.' అని చెప్పారు.
రాబోయే ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఆటో షో 2025 లో 'ఈ ఫర్ మీ' పూర్తి కోణాన్ని ప్రజంట్ చేస్తామని మారుతి తెలిపింది. రాబోయే మొబిలిటీ ఆటో షోలో మారుతి తన ఎస్‌యూవీ ఈ విటారాను కూడా ప్రవేశపెట్టనుంది. ఈ మోడల్ మారుతి సుజుకి ఫస్ట్ ఎలక్ట్రిక్ మోడల్. గుజరాత్ ప్లాంట్‌లో ఎలక్ట్రిక్ విటారా ఉత్పత్తి 2025 మార్చి నుండి ప్రారంభమవుతుందని మారుతి సుజుకి తెలిపింది. ఈ ఏడాది చివర్‌లో యూరప్, జపాన్‌లో ఉత్పత్తిని ప్రారంభించే ప్రణాళికలు ఉన్నాయి.
భారత్ మెుబిలిటీ గ్లోబల్ ఆటో షో 2025 జనవరి 17 నుంచి జనవరి 22 వరకు జరగనుంది. ఇందులో దేశీయ కంపెనీలు మాత్రమే కాదు.. విదేశీ కంపెనీలు కూడా తమ వాహనాలను ప్రదర్శించనున్నాయి. మారుతి సుజుకి తన ఈ విటారాతోపాటుగా ఈ ఫర్ మీ స్ట్రాటజీకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనుంది.