Maruti E Vitara Vs Tata Curvv EV : మారుతి ఈ విటారా Vs టాటా కర్వ్ ఈవీ.. రేంజ్, ఫీచర్లలో ఏది బెటర్?
Maruti E Vitara Vs Tata Curvv EV : ఆటో ఎక్స్‌పో 2025లో మారుతి ఈ విటారా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ప్రదర్శించింది. ఎస్‌యూవీ ఎలక్ట్రిక్ విభాగంలో టాటా కర్వ్ EV ఇప్పటికే మార్కెట్లో ఉంది. ఈ రెండు కార్లు కస్టమర్లకు అందించే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం..

మార్కెట్లో కొత్త కొత్త ఎలక్ట్రిక్ కార్లు సందడి చేస్తున్నాయి. కస్టమర్లు కూడా ఆచితూచి కారు కొనుగోలు చేయాలి. పెట్టిన డబ్బుకు తగ్గట్టుగా ఫలితం ఉండాలి. ఇప్పటికే అనేక కార్లు ఉన్నాయి. అయితే ఈ విటారా కూడా మార్చిలో వచ్చేందుకు సిద్ధమైనట్టుగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు టాటా కర్వ్ ఈవీ మార్కెట్‌లో ఉంది. ఈ రెండు కార్లలో ఏది బెస్ట్?
బ్యాటరీ, రేంజ్
రాబోయే మారుతి ఈ విటారా రెండు బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. 49 kWh, 61 kWh. దీని 49 kWh బ్యాటరీ ప్యాక్ ఫ్రంట్-వీల్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ (FWD)కి జతచేసి ఉంటుంది. ఇది 144 పీఎస్, 192.5 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని 61 kWh బ్యాటరీ ప్యాక్ FWDగా అందుబాటులో ఉన్నప్పటికీ, ఇది 174 పీఎస్, 192.5 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటారుకు జతచేసి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.
టాటా కర్వ్ ఈవీలో 45 kWh, 55 kWh అనే రెండు బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. దీని 45 kWh బ్యాటరీ ఒకే ఎలక్ట్రిక్ మోటారుకు జతచేసి ఉంటుంది. ఇది 150 పీఎస్, 215 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ARAI క్లెయిమ్ చేసిన రేంజ్ 502 కి.మీ. 55 kWh బ్యాటరీ 167 పీఎస్, 215 ఎన్ఎం ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటారుకు జత అయి ఉంటుంది. ARAI క్లెయిమ్ చేసిన రేంజ్ 585 కిలో మీటర్లు.
సేఫ్టీలో ఏది బెటర్?
సేఫ్టీ కోసం రాబోయే ఈ విటారా 7 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీల కెమెరా, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్(టీఎంపీఎస్), లెవల్-2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్(ఏడీఏఎస్), అన్ని డిస్క్ బ్రేక్‌లు, ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు వంటి లక్షణాలను పొందుతుంది.
ప్రయాణీకుల భద్రత కోసం టాటా కర్వ్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్, వెనుక పార్కింగ్ సెన్సార్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, లెవల్-2 ఏడీఏఎస్ వంటి భద్రతా లక్షణాలు ఉన్నాయి.
ధరలు
మారుతి సుజుకి ఈ విటారా ఈ మార్చిలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీని ధర గురించి కచ్చితమైన సమాచారం దాని విడుదలతో పాటు అందుబాటులో ఉంటుంది. అయితే దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 17 లక్షల నుండి ప్రారంభమవుతుందని అంచనా. టాటా కర్వ్ ఈవీ ధర ఎక్స్-షోరూమ్ రూ. 17.49 లక్షల నుండి ప్రారంభమై రూ. 21.99 లక్షల వరకు ఉంటుంది.
ఈ రెండు కార్లు కొనుగోలుదారులకు మంచి ఫీచర్లు, రేంజ్ అందిస్తాయి. అయితే వీటిలో ఏది కొనాలో మీరే డిసైడ్ చేసుకోండి.
సంబంధిత కథనం