చెత్తబుట్టలోకి రూ.6500 కోట్ల బిట్‌కాయిన్లు.. చెత్తకుప్పను కొనేందుకు వ్యక్తి ప్లానింగ్!
Bitcoin : ఓ వ్యక్తి రూ.6500 కోట్ల విలువైన బిట్‌కాయిన్‌లను పొగొట్టుకున్నాడు. అది చెత్త వేసే ప్రదేశానికి చేరింది. దీంతో దానిని కొనేందుకు అతడు ప్లా్న్ చేస్తున్నాడు.

అతను ఒక ఐటీ ఉద్యోగి. ప్రస్తుతం ఒక చెత్త వేసే ప్రదేశాన్ని కొనేందుకు చూస్తున్నాడు. చెత్త నుంచి ఏం సంపాదిస్తాడు అని మీరు అనుకోవచ్చు. కానీ చెత్తకుప్పను కొనడం వెనక అతడి ఉద్దేశం వేరు. అందులో రూ.6500 కోట్ల విలువైన బిట్‌కాయిన్ల సమాచారం ఉంది.
బ్రిటన్‌కు చెందిన ఐటీ ఉద్యోగి జేమ్స్ హోవెల్స్. ఇతడు కంప్యూటర్ ఎక్స్‌పర్ట్. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని సౌత్ వేల్స్‌లోని న్యూపోర్ట్‌లో చెత్త కుప్పను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. అనుకోకుండా చెత్తబుట్టలో పోగొట్టుకున్న హార్డ్‌డ్రైవ్ ఇప్పుడు అతడికి అవసరం. ఎందుకంటే అందులో సుమారు రూ.6,500 కోట్లు విలువైన బిట్‌కాయిన్‌ల డేటా ఉంది. సుమారు 12 సంవత్సరాలుగా దీనికోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.
చెత్తబుట్టలో పడేసిన భార్య
ఈ సంఘటన 2013లో జరిగింది. బిట్‌కాయిన్ డేటా ఉన్న హార్డ్ డ్రైవ్‌ను ఒక నల్లటి సంచిలో పెట్టి తన ఇంటి హాలులో వదిలేశాడు. కానీ ఇక్కడే కథ అడ్డం తిరిగింది. ఆ నల్లటి సంచిలో ఏదో అనవసరమైన వస్తువు ఉంటుందని భావించిన భాగస్వామి, ఆ సంచిని చెత్తగా భావించి చెత్తబుట్టలో పడేసింది. అప్పటి నుండి అది కనిపించడం లేదు. తర్వాత చెత్తబుట్టలో పడేసినట్టుగా తెలుసుకున్నాడు.
హోవెల్స్ హార్డ్ డ్రైవ్‌ను తిరిగి పొందడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. అతడు ఉండే ప్రాంతంలోని చెత్తను అంతా సౌత్‌వేల్స్‌లోని చెత్తకుప్పలో పడేస్తారు. హార్డ్‌డ్రైవ్ కోసం న్యూపోర్ట్ సిటీ కౌన్సిల్ సహాయం కోరాడు హోవెల్స్. కానీ చెత్తకుప్పను శోధించడానికి అతడు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
కోర్టు నిరాకరణ
హోవెల్స్ కోర్టుకు వెళ్ళాడు. బిట్‌కాయిన్ ఉన్న హార్డ్ డ్రైవ్ వెతికేందుకు అనుమతించాలని కోరాడు. కానీ కోర్టు కూడా నిరాకరించింది. కౌన్సిల్ త్వరలోనే చెత్తకుప్పను మూసివేయాలని ప్రణాళికలు ప్రకటించింది. ఈ ప్రదేశంలో సోలర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని న్యూపోర్ట్ సిటీ కౌన్సిల్ అనుకుంటోంది. చెత్త కుప్ప వేసే ప్రదేశం మూసివేత గురించి విని తాను చాలా ఆశ్చర్యపోయానని జేమ్స్ హోవెల్స్ అన్నాడు.
చెత్తకుప్పలో వెతకడానికి అనుమతించడం న్యూపోర్ట్ ప్రజలపై భారీ హానికరమైన ప్రభావాన్ని చూపుతుందని కౌన్సిల్ కోర్టులో వాదించింది. అదే సమయంలో ఎలాగైనా చెత్తకుప్పను మూసివేయాలని అనుకుంది.
చెత్త కుప్పను కొనేందుకు ప్లాన్
'చెత్తకుప్పతో ఈ ప్రదేశం ఇప్పటికే 80-90 శాతం నిండిపోయింది. రాబోయే సంవత్సరాల్లో మూసివేస్తారని నేను ఊహించాను. కానీ ఇంత త్వరగా మూసేస్తారని అనుకోలేదు. న్యూపోర్ట్ సిటీ కౌన్సిల్ సిద్ధంగా ఉంటే, నేను సైట్‌ను యథాతథంగా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతాను.' అని హోవెల్స్ చెప్పారు. అతడి ప్రయత్నం ఏమవుతుందో చూడాలి. రూ.6500 కోట్ల విలువైన బిట్‌కాయిన్లను సొంతం చేసుకుంటాడో లేదో తెలియాల్సి ఉంది.
బిట్‌కాయిన్ ఒక డిజిటల్ కరెన్సీ. దీనిని ఎలక్ట్రానిక్ డబ్బు అంటారు. . బిట్‌కాయిన్ ఇప్పటికే కొనడం, అమ్మడం, నిల్వ చేయడం (పెట్టుబడి) ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. బిట్‌కాయిన్ లావాదేవీలు క్రిప్టోగ్రఫీ అనే సాంకేతికత ద్వారా నిర్వహిస్తారు.
టాపిక్