30 ఏళ్లలోపు ఈ 5 అలవాట్లు చేసుకోవడం తెలివైన పని, లేదంటే జీవితంలో ఆర్థిక సమస్యలు!
Financial Habits : జీతం ఎక్కువైనా.. తక్కువైనా 30 ఏళ్లలోపు కొన్ని ఆర్థిక చిట్కాలు పాటించాలి. కొన్ని అలవాట్లు చేసుకుంటే మీరు భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదుర్కోకుండా ఉంటారు. కచ్చితంగా పాటించాల్సిన 5 అలవాట్లు ఏంటో చూద్దాం..

చాలా మంది డబ్బు సంపాదిస్తారు, కానీ వాటిని ఎలా ఉపయోగించాలో తెలియక.. అనవసరమైన ఖర్చులు పెడుతుంటారు. జీతం తక్కువగా ఉన్నా.. కచ్చితంగా మీకు ఆర్థిక క్రమశిక్షణ అనేది ఉండాలి. లేదంటే చిన్న వయసులోనే అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. చాలా మంది డబ్బు సంపాదించినా.. వాటిని చక్కగా నిర్వహించలేకపోతున్నారు. దీనివల్ల అప్పుల భారం పడటం మెుదలవుతుంది. దీని కారణంగా వారి సిబిల్ స్కోరు కూడా తగ్గుతుంది. భవిష్యత్తులో రుణం కావాలన్నా.. ఇబ్బందులు పడుతుంటారు. 30 ఏళ్లలోపు ఈ 5 అలవాట్లు చేసుకుంటే మీరు భవిష్యత్తులో ఆర్థిక భద్రతతో ఉండవచ్చు.
సిబిల్ స్కోర్ చూసుకోండి
మీరు పదే పదే రుణాలు తీసుకొని వాటిని సకాలంలో తిరిగి చెల్లించకపోతే ఇది మీ CIBIL స్కోర్‌ను దెబ్బతీస్తుంది. మీ సిబిల్ స్కోర్‌ను మెరుగుపరచుకోవడానికి, అన్ని బిల్లులు, లోన్ ఈఎంఐలను సకాలంలో చెల్లించండి. ఏ చెల్లింపులను డిఫాల్ట్ చేయవద్దు. సిబిల్ స్కోరు ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది.
బడ్జెట్ వేసుకోవాలి
మీ జీతం రూ. 15,000 అయినా లేదా రూ. 60,000 అయినా మీరు ఒక బడ్జెట్ తయారు చేసుకోవాలి. తద్వారా మీ ఖర్చులను సులభంగా నిర్వహించవచ్చు. బడ్జెట్ తయారు చేయకుండా ఖర్చు చేస్తే, మీరు అప్పుల ఉచ్చులో చిక్కుకోవచ్చు. ఎందుకంటే ప్రతినెలా దేనికి ఎంత పోతుందో మీ దగ్గర లెక్క ఉండాలి. ఎంత అవసరమో అంతే ఖర్చు చేయాలి. బడ్జెట్ వేసుకోకుంటే ఖర్చు ఇష్టం వచ్చినట్టుగా చేస్తారు.
ఎమర్జెన్సీ ఫండ్
మీరు బడ్జెట్ తయారు చేసుకున్నప్పుడల్లా ఎమర్జెన్సీ ఫండ్‌ను కూడా ఏర్పాటు చేసుకోవాలి. మీకు అకస్మాత్తుగా డబ్బు అవసరమైనప్పుడల్లా మీరు ఎవరినీ డబ్బు అడగాల్సిన అవసరం లేదు. అలాగే ఇది మీ బడ్జెట్‌ను పాడు చేయదు. సేఫ్‌గా సైడ్‌లో ఉంటుంది.
ప్రతి లావాదేవీపై నిఘా ఉంచండి
మీ జీతం ఎంత ఉన్నా మీ డబ్బును జాగ్రత్తగా చూసుకోవాలి. మీ బ్యాంక్ ఖాతాను చెక్ చేస్తూ ఉండండి. ఎంత ఖర్చు చేస్తున్నారో, ఎంత ఆదా చేస్తున్నారో తెలుసుకోవడానికి అన్ని ఖర్చులను ట్రాక్ చేస్తూ ఉండండి. ఈ అలవాటు భవిష్యత్తులో మిమ్మల్ని ఆర్థిక సంక్షోభం నుండి కాపాడుతుంది. డబ్బు సమస్యలను లేకుండా చేస్తుంది. అనవసరమైన చోట ఖర్చు పెట్టే అలవాటు తగ్గుతుంది.
పెట్టుబడి తప్పనిసరి
మీరు డబ్బు సంపాదించడం ప్రారంభించిన వెంటనే స్వల్పకాలిక, దీర్ఘకాలిక పెట్టుబడులను ప్రారంభించండి. మీ భవిష్యత్తు ఆర్థిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని ఇన్వెస్ట్ చేయవచ్చు. తద్వారా మీరు తరువాత డబ్బు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆర్థిక లక్ష్యాలలో ఇల్లు కొనడం, కారు కొనడం, పిల్లల చదువు మొదలైనవి ఉండవచ్చు.