MAB : మీ బ్యాంకు ఖాతాలో నెలవారీ సగటు బ్యాలెన్స్ లేకపోతే ఏమవుతుంది?
Monthly Average Balance In Bank Accounts : చాలా మంది బ్యాంక్ అకౌంట్లు జీరో బ్యాలెన్స్‌తోనే ఉంటాయి. ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ దీనితో చాలా సమస్యలు వస్తాయి. మీ బ్యాంకు ఖాతాలో నెలవారీ సగటు బ్యాలెన్స్(MAB) మెయింటెన్ చేయాలి. లేకపోతే అన్ని రకాలుగా మీకే నష్టం.
నెలవారీ సగటు బ్యాలెన్స్(ఎంఏబీ) అనేది క్యాలెండర్ నెలలో మీరు మీ పొదుపు, కరెంట్ ఖాతాలలో ఉంచవలసిన సగటు మొత్తం. కనిష్ట రోజువారీ బ్యాలెన్స్ కాకుండా MAB నెల పొడవునా మీ రోజువారీ ముగింపు బ్యాలెన్స్‌ల సగటు ఆధారంగా లెక్కిస్తారు. ప్రతి నెలాఖరులో మీరు అవసరమైన MABని సాధించారా లేదా అని బ్యాంక్ లెక్కిస్తుంది. లేకపోతే మీకు జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. ఎంఏబీ అనేది మీ ఆర్థిక ప్రయాణంలో కచ్చితంగా సాయపడుతుంది.
బ్యాంకు విధులకు
బ్యాంకులు తమ నిధులను సమర్ధవంతంగా నిర్వహించడానికి మీ ఎంఏబీపై ఆధారపడతాయి. మీరు మీ ఖాతాలో ఉంచుకున్న డబ్బును బ్యాంకు రుణగ్రహీతలకు క్రెడిట్‌ని అందించడానికి, మ్యూచువల్ ఫండ్స్, సెక్యూరిటీల వంటి ఆర్థిక సాధనాల్లో పెట్టుబడి పెట్టడానికి ఉపయోగిస్తుంది. ఇది బ్యాంకింగ్ స్థిరత్వాన్ని కొనసాగించడంలో సహాయపడటమే కాకుండా మీ డిపాజిట్లు, పెట్టుబడులను పరోక్షంగా రక్షించడం ద్వారా ఆర్థిక స్థిరత్వానికి దోహదం చేస్తుంది.
లోన్ తీసుకునేటప్పుడు ఉపయోగం
మీ ఎంఏబీ అనేది మీ ఆర్థిక స్థిరత్వం, బాధ్యతకు ప్రతిబింబంగా చెప్పవచ్చు. అవసరమైన బ్యాలెన్స్‌ను ఖతాలో నిలకడగా ఉంచడం అనేది ఆర్థిక నిర్వహణలో మీ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఇది రుణాలు లేదా క్రెడిట్ కార్డ్‌ల కోసం దరఖాస్తు చేసేటప్పుడు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఆర్థిక క్రమశిక్షణను అంచనా వేయడానికి బ్యాంకులు తరచుగా మీ ఖాతా ఎంఏబీని చూసి అంచనా వేస్తాయని గుర్తుంచుకోవాలి.
ప్రయోజనాలు రావొచ్చు
ఎంఏబీని మెయింటెన్ చేయడం అనేది అదనపు బ్యాంకింగ్ అధికారాలతో వస్తుంది. మీరు ఏదైనా లోన్ తీసుకునేటప్పుడు ఉపయోగడుతుంది. ఇందులో వివిధ ఆర్థిక ఉత్పత్తులపై ప్రాధాన్యతా వడ్డీ రేట్లు, తగ్గింపులు ఉండవచ్చు. నమ్మకమైన, బాధ్యతగల కస్టమర్‌లకు ప్రయోజనాలను విస్తరించడానికి బ్యాంకులు ఎంఏబీని బెంచ్‌మార్క్‌గా ఉపయోగిస్తాయి.
పెనాల్టీ ఛార్జీలు
మీ ఖాతాలో నెలవారీ సగటు బ్యాలెన్స్ నిర్వహించలేకపోతే పెనాల్టీ ఛార్జీలు విధించవచ్చు. ఇది బ్యాంక్, ఖాతా రకాన్ని బట్టి మారుతుంది. MABని నిర్వహించడంలో మీరు విఫలమైతే.. కొన్ని సందర్భాల్లో నెలవారీ నిర్వహణ రుసుము విధించవచ్చు. కొన్ని సందర్భాల్లో ఖాతా మూసివేత కూడా ఉండవచ్చు. మీ ఖాతా బ్యాలెన్స్ ఎంఏబీ కంటే ఎక్కువగా ఉందని నిర్ధారించుకోవడం ద్వారా మీరు ఈ అనవసరమైన ఛార్జీలను నివారించవచ్చు. రుణాలు, క్రెడిట్ కార్డ్‌లను పొందేందుకు మంచి క్రెడిట్ స్కోర్‌ను నిర్వహించడం అవసరం. ఎందుకంటే ఇది మీ ఆర్థిక, ట్రాక్ రికార్డ్‌పై సానుకూలంగా ఉంటుంది.
నెలవారీ సగటు బ్యాలెన్స్ అంటే
నెలవారీ సగటు బ్యాలెన్స్ అనేది ఒక నెల వ్యవధిలో బ్యాంక్ ఖాతాలో నిర్వహించబడే సగటు ముగింపు బ్యాలెన్స్‌ని సూచిస్తుంది. ఇది నెలలోని ప్రతి రోజు ముగింపు బ్యాలెన్స్‌ని జోడించి.., ఆపై ఆ నెలలోని రోజుల సంఖ్యతో మొత్తాన్ని భాగించడం ద్వారా లెక్కిస్తారు. నెలవారీ సగటు బ్యాలెన్స్ అవసరం రూ. 10,000 అయితే.. మీ ఖాతాలో ప్రతిరోజూ రూ. 10,000 ఉండాలి అని కాదు.