Mahindra Scorpio : జనవరిలో దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన 7 సీటర్ కారు ఇదే
Mahindra Scorpio : మహీంద్రా స్కార్పియో దేశంలో 7 సీటర్ కార్ల సెగ్మెంట్‌లో మంచి అమ్మకాలు చేసింది. గతంలో టాప్ పొజిషన్‌లో ఉన్న కంపెనీలను అధిగమించింది.

ఆటోమెుబైల్ పరిశ్రమలో జనవరి సేల్స్ రిపోర్టులు సందడి చేస్తున్నాయి. కొన్ని కార్లు అమ్మకాల్లో దూసుకెళ్తుంటే.. మరికొన్ని తోపు కార్లు ఈసారి విక్రయాలు తగ్గి వెనక్కు వెళ్లాయి. గత కొన్ని నెలలుగా ఎర్టిగా కంటే వెనుకబడిన మహీంద్రా స్కార్పియో ఈ విభాగంలో అగ్రస్థానంలో నిలిచింది. టాప్ 10 కార్ల జాబితాలో స్కార్పియో ఏడో స్థానంలో ఉంది. గత నెలలో 15,442 స్కార్పియో కార్లు అమ్ముడయ్యాయి. ఈ విధంగా, స్కార్పియో తన విభాగంలో ఈ సంవత్సరం గొప్ప ప్రారంభాన్ని చూసింది. టాప్ 10 జాబితాలో మహీంద్రాకు చెందిన ఏకైక కారు స్కార్పియో.
మహీంద్రా స్కార్పియో ఫీచర్లు
స్కార్పియో ఎన్‌లో కంపెనీ సరికొత్త సింగిల్ గ్రిల్‌ను ఇచ్చింది. ఇది క్రోమ్ ఫినిషింగ్‌ను చూపిస్తుంది. గ్రిల్‌పై కంపెనీ కొత్త లోగో కనిపిస్తుంది. ఇది దాని ముందు భాగం అందాన్ని పెంచుతుంది. రీడిజైన్ చేసిన ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, కొత్త ఫాగ్ ల్యాంప్ హౌసింగ్స్‌తో ఫ్రంట్ బంపర్, సి ఆకారంలో ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు, హెక్సాగోనల్ లోయర్ గ్రిల్ ఇన్సర్ట్స్‌తో వెడల్పాటి సెంట్రల్ ఎయిర్ ఇన్లెట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఈ ఎస్‌యూవీలో కొత్తగా డిజైన్ చేసిన టూ టోన్ వీల్స్ ఉన్నాయి. ఇక ఎక్స్టీరియర్ విషయానికి వస్తే క్రోమ్డ్ డోర్ హ్యాండిల్స్, క్రోమ్డ్ విండో లైన్, పవర్ ఫుల్ రూఫ్ రైల్స్, ట్వీక్డ్ బానెట్, బూట్ లిడ్స్‌తో సైడ్ హిండెడ్ డోర్లు, అప్‌డేటెడ్ రియర్ బంపర్, సరికొత్త వర్టికల్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. స్కార్పియో ఎన్‌లో ఇంజిన్ స్టార్ట్/స్విచ్ స్టాప్ బటన్ ఇస్తారు.
ఇందులో కొత్త డాష్ అండ్ సెంటర్ కన్సోల్, అప్‌డేటెడ్ సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, రూఫ్-మౌంటెడ్ స్పీకర్లు, లెదర్ సీట్లు, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, సెంట్రల్ మౌంటెడ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. సన్ రూఫ్, ఆరు ఎయిర్ బ్యాగులు, రివర్స్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, రియర్ డిస్క్ బ్రేక్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
టాప్ 10 కార్లు
2025 జనవరిలో అత్యధికంగా అమ్ముడైన టాప్-10 కార్ల విషయానికి వస్తే మారుతీ సుజుకీ వ్యాగన్ఆర్ 24,078 యూనిట్లు, మారుతి సుజుకి బాలెనో 19,965 యూనిట్లు, హ్యుందాయ్ క్రెటా 18,522 యూనిట్లు, మారుతి సుజుకి స్విఫ్ట్ 17,081 యూనిట్లు, టాటా పంచ్ 16,231, మారుతి సుజుకి గ్రాండ్ విటారా 15,784, మహీంద్రా స్కార్పియో 15,442, టాటా నెక్సాన్ 15,397, మారుతి సుజుకి డిజైర్ 15,383, మారుతి సుజుకి ఫ్రాంక్స్ 15,192 యూనిట్లను విక్రయించాయి.