ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా తన అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీలైన బొలెరో నియో, బొలెరోకు సంబంధించిన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లలో మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఈ కొత్త మోడళ్లలో పలు మార్పులు చేసినప్పటికీ, వాటి ప్రధాన ఆకృతి మాత్రం పాత మోడళ్ల మాదిరిగానే స్థిరంగా ఉంది. కస్టమర్ల డిమాండ్‌లను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేశామని మహీంద్రా చెప్పింది.
ఫేస్‌లిఫ్ట్ అయిన మహీంద్రా బొలెరో నియో, బొలెరో ధరలు కూడా పాత మోడళ్లకు దగ్గరగానే ఉన్నాయి.
మహీంద్రా బొలెరో నియో ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.49 లక్షల నుంచి రూ. 9.99 లక్షల మధ్య ఉంది.
మహీంద్రా బొలెరో ధర రూ. 7.99 లక్షల నుంచి రూ. 9.69 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.
ఈ రెండు ఎస్‌యూవీల ఇంజిన్‌లలో మహీంద్రా ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే, మెరుగైన రైడ్ అనుభవం కోసం బ్రాండ్ కొత్త 'రైడ్‌ఫ్లో టెక్' టెక్నాలజీతో సస్పెన్షన్‌ను ట్యూన్ చేసింది.
అప్‌డేట్ అయిన మహీంద్రా బొలెరో నియో ఎస్యూవీ ముందు భాగాన్ని కొత్త గ్రిల్‌తో మార్చారు. కొత్త గ్రిల్‌లో క్రోమ్ అలంకరణతో కూడిన అడ్డంగా ఉండే గీతలు ఉన్నాయి. ఇది ముందు భాగానికి కొద్దిగా ప్రీమియం లుక్‌ను ఇస్తుంది.
కొత్త వేరియంట్- రంగులు: ఇందులో ‘జీన్స్ బ్లూ’, ‘కాంక్రీట్ గ్రే’ అనే రెండు కొత్త రంగులు లభిస్తాయి. ఈ కొత్త రంగులు టాప్-ఎండ్ ఎన్11 వేరియంట్‌లో అందుబాటులో ఉన్నాయి.
ఎక్స్‌టీరియర్: ఈ కొత్త టాప్-ఎండ్ ఎన్11 వేరియంట్‌కు డ్యుయల్-టోన్ పెయింట్ ఆప్షన్లతో పాటు కొత్త 16- ఇంచ్ అల్లాయ్ వీల్స్ కూడా ఇచ్చారు.
ఇంటీరియర్ మార్పులు: కారు తయారీదారులు ఇంటీరియర్‌లో కూడా కొన్ని మార్పులు చేశారు. ఎన్11 వేరియంట్‌కు లైట్ షేడ్‌లో ఉండే కొత్త ‘లూనార్ గ్రే’ కలర్ థీమ్ ఇచ్చారు. అయితే, తక్కువ వేరియంట్లలో డార్కర్ 'మోచా బ్రౌన్' షేడ్ కొనసాగుతుంది.
మెరుగైన సౌకర్యం: సీట్లకు అదనపు కుషనింగ్ జోడించారు. దీంతో పాటు, ఆధునిక కనెక్టివిటీ కోసం యూఎస్బీ- సీ ఛార్జింగ్ పోర్ట్ కూడా చేర్చారు.
టెక్నాలజీ: బొలెరో నియో ఎన్10, ఎన్11 వేరియంట్లలో 8.9-ఇంచ్ కొత్త టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు రియర్-వ్యూ కెమెరాను కూడా మహీంద్రా అందించింది.
మహీంద్రా బొలెరో ఫేస్‌లిఫ్ట్ విషయానికొస్తే, అన్ని ట్రిమ్ ఆప్షన్లలో ‘స్టెల్త్ బ్లాక్’ అనే సరికొత్త పెయింట్ షేడ్ అందుబాటులో ఉంది.
ఎక్స్‌టీరియర్: బొలెరో ఎస్‌యూవీకి కూడా కొత్తగా డిజైన్ చేసిన గ్రిల్ ఇచ్చారు. ఇందులో కొత్త క్రోమ్ హైలైట్స్ కూడా ఉన్నాయి.
కొత్త వేరియంట్: బొలెరోలో బీ8 అనే కొత్త టాప్-స్పెక్ వేరియంట్‌ను ప్రవేశపెట్టారు.
బీ8 వేరియంట్ ఫీచర్‌లు: టాప్-స్పెక్ బీ8 వేరియంట్‌లో డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, యూఎస్బీ-సీ ఛార్జింగ్ పోర్ట్‌లు, లెదరెట్ సీట్ కవర్లు, మెరుగైన సీట్ కుషనింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
అదనపు సౌకర్యాలు: అదనంగా, బొలెరోలో కొత్త ఫాగ్ ల్యాంప్‌లు, డోర్ ట్రిమ్‌లలో బాటిల్ హోల్డర్లను కూడా చేర్చారు.
భారత మార్కెట్లో మహీంద్రాకు అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లలో బొలెరో నియో, బొలెరో ఎస్‌యూవీలు ముందు వరుసలో ఉంటాయి. కొత్త జీఎస్టీ నిబంధనలు అమలులోకి రావడం, పండుగ సీజన్ వస్తుండటంతో, ఈ కొత్త మోడళ్ల విక్రయాలు పెరుగుతాయని తయారీదారులు ఆశిస్తున్నారు.
| స్పెసిఫికేషన్స్ | మహీంద్రా బొలెరో | మహీంద్రా బొలెరో నియో |
|---|---|---|
| ఇంజిన్ | mHawk75 | mHawk100 |
| సీసీ | 1493 సీసీ | 1493 సీసీ |
| డ్రైవింగ్ టైప్ | 2డబ్ల్యూడీ | 2డబ్ల్యూడీ |
| టర్బో ఛార్జర్ | ఉంది | ఉంది |
| పవర్ | 75 బీహెచ్పీ | 100 బీహెచ్పీ |
| టార్క్ | 210 ఎన్ఎం | 260 ఎన్ఎం |
| సిలిండర్లు | 3 | 3 |
| వాల్వ్‌లు | 4 | 4 |
| ట్రాన్స్మిషన్ | మేన్యువల్ | మేన్యువల్ |
సంబంధిత కథనం