petro prices: జూలై 1 నుంచి తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు-maharashtra to reduce petrol and diesel prices in mumbai from july 1 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Petro Prices: జూలై 1 నుంచి తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

petro prices: జూలై 1 నుంచి తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

HT Telugu Desk HT Telugu

జులై 1వ తేదీ నుంచి ముంబైలో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విలువ ఆధారిత పన్ను (VAT) ను తగ్గించడం ద్వారా పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి అజిత్ పవార్ ప్రకటించారు.

జూలై 1 నుంచి తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు (HT Auto/Sameer Contractor)

రాష్ట్ర బడ్జెట్ 2024 ను ప్రకటిస్తున్న సమయంలో, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (MMR) లో ఇంధన పన్నులను తగ్గిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం విలువ ఆధారిత పన్ను (VAT) ను తగ్గిస్తుందని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి అజిత్ పవార్ ప్రకటించారు. ఫలితంగా ముంబైలో పెట్రోల్ పై లీటరుకు 65 పైసలు, డీజిల్ పై లీటరుకు రూ .2.60 తగ్గింది. తగ్గించిన ఇంధన ధరలు జూలై 1, 2024 నుండి అమలులోకి వస్తాయి.

అమ్మకపు పన్ను తగ్గింపు

బృహన్ ముంబై, థానే, నవీ ముంబై మునిసిపల్ ప్రాంతాలలో ఈ పెట్రో ధరల తగ్గింపు అమలు అవుతుంది. ముంబై రీజియన్ లో డీజిల్ పై పన్నును 24 శాతం నుంచి 21 శాతానికి తగ్గిస్తున్నామని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తెలిపారు. ముంబై రీజియన్ లో పెట్రోల్ పై పన్నును 26 శాతం నుంచి 25 శాతానికి తగ్గించడం వల్ల లీటర్ పెట్రోల్ పై 65 పైసలు తగ్గుతాయని చెప్పారు.

రూ.200 కోట్ల భారం

వ్యాట్ తగ్గింపు నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాపై సుమారు రూ.200 కోట్ల భారం పడుతుందని అజిత్ పవార్ వెల్లడించారు. కాగా, మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల్లో ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఈ పెట్రో ధరల తగ్గింపుతో దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని వాహన యజమానులకు ఉపశమనం కలగనుంది. ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.

ఇంధన ధరల పెంపు

ఈ నెల ప్రారంభంలో పలు ఇతర రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. కర్ణాటక, గోవాలు జూన్ నెలలో ఇంధన ధరలను పెంచాయి.గోవా ప్రభుత్వం పెట్రోల్ పై 21.5 శాతం, డీజిల్ పై 17.5 శాతం వ్యాట్ ను పెంచింది. దీంతో లీటర్ పెట్రోల్ పై రూ.1, డీజిల్ పై 36 పైసలు ధర పెరిగింది. కర్ణాటకలో పెట్రోల్ పై 29.84 శాతం, డీజిల్ పై 18.44 శాతం అమ్మకపు పన్నును ప్రభుత్వం పెంచింది. దాంతో, కర్ణాటకలో లీటర్ పెట్రోల్ పై రూ.3, డీజిల్ పై రూ.3.5 చొప్పున ధరలు పెరిగాయి. లోక్ సభ ఎన్నికల తరువాత ఇంధన ధరలు పెరుగుతాయని భావించారు. రాబోయే నెలల్లో మరిన్ని రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరించే అవకాశం ఉంది.