Maha kumbh Mela : ప్రజల సెంటిమెంట్‌పై ‘వ్యాపారం’! విమాన టికెట్ ధరలు 6రెట్లు అధికం..
మహా కుంభమేళాని క్యాష్ చేసుకునేందుకు విమానయాన సంస్థలు పోటీపడుతున్నట్టు కనిపిస్తోంది! ఫలితంగా దేశవ్యాప్తంగా వివిధ నగరాల నుంచి ప్రయాగ్‌రాజ్‌కి వెళ్లి, వచ్చే టికెట్ ధరలు అకాశాన్ని తాకుతున్నాయి. హైదరాబాద్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది!
ఓవైపు కోట్లాది మంది భక్తులు మహా కుంభమేళాకు వెళ్లి పవిత్ర స్నానాలు చేస్తుంటే, మరోవైపు విమాన టికెట్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మహా కుంభమేళతో వస్తున్న డిమాండ్‌ని క్యాష్ చేసేందుకు.. అనేక విమానయాన సంస్థలు పోటీపడి మరీ టికెట్ రేట్లను పెంచుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల, టికెట్ ధరలు సాధారణం కన్నా 3 నుంచి 6రెట్లు ఎక్కువ చూపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సాధారణంగా కన్నా 3 నుంచి 6 రెట్లు అధికం!
మహా కుంభమేళా కోసం వివిధ ప్రాంతాల నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లి వచ్చేందుకు విమాన టికెట్ ధరలు భారీగానే పెరిగాయి. మరీ ముఖ్యంగా రిటర్న్ టికెట్ రేట్లకు రెక్కలు వచ్చాయి. ప్రయాగ్‌రాజ్ నుంచి చెన్నైకి తిరిగి వెళ్లాలంటే రూ. 30వేల వరకు ఖర్చు అవుతోంది. ఇక కోల్‌కతాకి అది రూ. 32,500 వరకు ఉంది. హైదరాబాద్ విషయం మరింత ఆందోళనకరంగా ఉంది. ఇక్కడి నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్లాలంటే రూ. 48,000 నుంచి 54,000 వరకు ఖర్చు చేయాల్సిందే. ముంబై, దిల్లీల్లో కూడా ఇదే పరిస్థితి. ఇంకొన్ని నగరాల్లో అయితే టికెట్ ధరలు ఏకంగా రూ. 60వేల మార్క్‌ని టచ్ చేశాయి.
ఫిబ్రవరి 3 వసంత పంచమి, ఫిబ్రవరి 12 మాఘ పౌర్ణి, ఫిబ్రవరి 26 మహా శివరాత్రి వంటి కీలక తేదీల్లోనూ విమాన టికెట్ ధరలు ఇంతే ఉండొచ్చు, లేదా ఇంతకన్నా ఎక్కువ ఉండొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి.
లోకల్ సర్కిల్స్ సర్వే ప్రకారం.. టికెట్ ధరలు సాధారణం కన్నా 3 నుంచి 6 రెట్లు పెరిగాయి. భక్తుల సెంటిమెంట్‌తో విమానయాన సంస్థలు వ్యాపారం చేస్తున్నాయని ప్రజలు మండిపడుతున్నారు.
సర్వేలో పాల్గొన్న ప్రతి 10మంది ప్రయాణికుల్లో 8 మంది.. ఏడాది కాలంలో కనీసం ఒక్కసారైనా సాధారణం కన్నా ఎక్కువ ఖర్చు చేసి టికెట్లు కొన్నట్టు చెప్పారు. టికెట్ ధరలను ప్రభుత్వం నియంత్రించాలని, డిమాండ్ ఉన్న సందర్భాల్లో రేట్లు సాధారణం కన్నా రెండు రెట్లకు మించకుండా చూసుకోవాలని ప్రతి 10 మందిలో ఆరుగురు అభిప్రాయపడ్డారు. కానీ విమాన టికెట్ ధరల నియంత్రణపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలన్న వాదనలను 22శాతం మంది వ్యతిరేకించారు.
విమాన టికెట్ ధరల పెంపు విషయంపై ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. కానీ పెరుగుతున్న డిమాండ్‌కి తగ్గట్టు కెపాసిటీని పెంచాలని విమానయాన సంస్థలకు డీజీసీఏ కొన్ని రోజుల క్రితం సూచించింది.
ఈ వ్యవహారంపై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా స్పందించారు.
"144ఏళ్ల తర్వత జరుగుతున్న మహా కుంభమేళా ఇది. దేశ, విదేశాల నుంచి కోట్లాది మంది ప్రజలు ఇక్కడికి వచ్చి పవిత్ర స్నానాలు చేస్తున్నారు. తపస్సు చేసుకుంటున్నారు. కానీ మహా కుంభమేళా పేరుతో కొన్ని విమానయాన సంస్థలు ప్రజలు దోచుకుంటుండటం చాలా బాధాకరం. ప్రయాగ్‌రాజ్‌కు సాధారణంగా రూ. 5వేలు- రూ. 6వేలు ఉండే టికెట్ ధరలు ఇప్పుడు రూ. 50వేలు- రూ. 60వేలకు చేరుతున్నాయి. విమానయాన సంస్థలు లాభాల గురించి ఆలోచించడం భక్తులను బాధపెడుతోంది. ప్రభుత్వం దీనిపై తగిన చర్యలు తీసుకోవాలి," అని రాఘవ్ చద్దా తెలిపారు.
సంబంధిత కథనం