203 కిలో మీటర్ల రేంజ్‌తో వస్తున్న ఎల్ఎంఎల్ స్టార్ ఎలక్ట్రిక్ స్కూటర్.. సీఎంవీఆర్ సర్టిఫికేట్ కూడా వచ్చేసింది!
LML Electric Scooter : ఎల్ఎంఎల్ ఎలక్ట్రిక్ స్కూటర్ త్వరలో మార్కెట్‌లోకి రాబోతోంది. ఈ ఈవీ రేంజ్ 203 కిలోమీటర్లు. దీనిని చూశాక జనాలకు మైనే ప్యార్ కియా అనాలి అనిపించేలా ఉన్నాయి లుక్స్.
భారతీయ ఆటోమెుబైల్ రంగంలో దూసుకెళ్తోంది. 2024లో ఈ రంగంలో అమ్మకాలు చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. అయితే ఇందులో మరో విషయం ఏంటంటే.. ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ బాగా పెరగడం. గతంలో లేనంతగా ఈవీలు అమ్ముడయ్యాయి. ఈ విషయం గమనించిన కంపెనీలు కొత్త మోడళ్లను తీసుకొస్తున్నాయి. తాజాగా ఎల్ఎంఎల్ కూడా ఇందుకు సిద్ధమవుతోంది.
భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో పునరాగమనం చేయడానికి ఎల్ఎంఎల్ ఎలక్ట్రిక్ స్కూటర్ స్టార్ కీలక ఫీచర్లు, పనితీరు వివరాలను వెల్లడించింది. 2023లో జరిగిన ఆటో ఎక్స్ పోలో తొలిసారిగా ఈ స్కూటర్‌ను ప్రదర్శించారు. ఇది ఈ ఏడాది లాంచ్ అయ్యే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో విడుదల కానున్న స్టార్ ఎల్ఎంఎల్ నుండి మూడు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఇది మొదటిది.
203 కి.మీ రేంజ్
ఎల్ఎంఎల్ స్టార్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 203 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఇది భారతీయ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్‌లో అత్యధికం అవుతుంది. ఈ స్కూటర్ రెండు రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్‌లను పొందుతుంది. బ్యాటరీ కచ్చితమైన సామర్థ్యాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు.
మంచి లుక్స్‌తో
ఎల్ఎంఎల్ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా 7.8 బిహెచ్పీ శక్తిని ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లు. ఫ్యూచరిస్టిక్ లుక్‌తో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందుతుంది. డిజైన్ ఫ్యూచరిస్టిక్, నలుపు, తెలుపు, ఎరుపు ఆప్షన్స్‌లో డ్యూయల్-టోన్ బాడీ కలర్‌తో ఉంటుంది. ఇందులో ఎల్ఈడీ డీఆర్ఎల్‌లు, ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు ఉన్నాయి. డిజిటల్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, హిల్ హోల్డ్ అసిస్ట్, రివర్స్ మోడ్, ఏబీఎస్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి. ఈ స్కూటర్ 14 అంగుళాల వీల్స్‌తో నడుస్తుంది.
సీఎంవీఆర్ సర్టిఫికేట్
డుకాటీ, ఫెరారీ, యమహా, కవాసాకి వంటి గ్లోబల్ బ్రాండ్లకు చెందిన డిజైనర్లు ఎల్ఎంఎల్ స్టార్ రూపకల్పనకు సహకరించారు. ఈ స్కూటర్ సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్(సీఎంవీఆర్) సర్టిఫికేట్ కూడా పొందింది. ఈ మేరకు కంపెనీ ప్రకటించింది. ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని ఈ సర్టిఫికేట్ చూపిస్తుంది.
భారత మార్కెట్లో ఎంఎల్ స్టార్ ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్లైన ఓలా ఎస్ 1 ప్రో, ఏథర్ 450ఎక్స్, టీవీఎస్ ఐక్యూబ్, చేతక్ ఎలక్ట్రిక్ స్కూటీలతో పోటీ పడనుంది.