Stock Market : స్టాక్ మార్కెట్ పతనం.. ఎల్ఐసీకి రూ.84వేల కోట్ల వరకు లాస్
Stock Market : గత నెలన్నర కాలంలో ఎల్ఐసీ పోర్ట్‌ఫోలియోలోని షేర్ల విలువ సుమారు రూ.84,000 వరకు కోట్లు తగ్గింది. ఐటీసీ, ఎల్ అండ్ టీ, ఎస్బీఐలో ఎల్ఐసీకి అత్యధికంగా పెట్టుబడులు ఉన్నాయి.

కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్లు దారుణంగా పడిపోతున్నాయి. ఈ ఏడాది మెుదటి నుంచి స్టాక్ మార్కెట్ అనుకున్నంతగా రాణించడంలేదు. దీంతో మదుపర్ల డబ్బు ఆవిరైపోతుంది. ఇప్పటికే టాప్ 10 పెట్టుబడిదారులుగా పేరు ఉన్న వ్యక్తులు రూ.81 వేల కోట్లు కోల్పోయిన విషయం తెలిసిందే. జనవరి 1 నుంచి ఇప్పటివరకు చూసుకుంటే.. ఎల్ఐసీ పోర్ట్‌పోలియోలోని షేర్లు కూడా భారీగా పడిపోయాయి.
తగ్గిన ఎల్ఐసీ షేర్లు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్ పతనంతో ప్రభుత్వ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నెలన్నర కాలంలో ఎల్ఐసీ పోర్ట్‌పోలియోలోని షేర్ల విలువ సుమారు రూ.84,000 కోట్లు తగ్గింది. డిసెంబర్ 2024 త్రైమాసికం నాటికి ఎల్ఐసీ పోర్ట్‌పోలియోలోని లిస్టెడ్ కంపెనీల హోల్డింగ్స్ విలువ రూ .14.72 ట్రిలియన్లుగా ఉంది. ఫిబ్రవరి 18, 2025న ఈ హోల్డింగ్స్ విలువ రూ .13.87 ట్రిలియన్లకు పడిపోయింది. ఇది రూ .84,247 కోట్లు. అంటే 5.7శాతం మార్క్-టు-మార్కెట్ నష్టాన్ని చూపిస్తుంది.
330 కంపెనీలు
డిసెంబర్ 2024 త్రైమాసికంలో ఎల్ఐసీ 1శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్న 330 కంపెనీలకు సంబంధించిన డేటా ఇది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్‌లో ఈ కంపెనీల వాటా 66 శాతంగా ఉంది. ఎల్ఐసీ స్వతహాగా మార్కెట్లో లిస్ట్ అయినప్పటికీ.. ఇతర లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుంటుంది. దీంతో స్టాక్ మార్కెట్ కరెక్షన్ కారణంగా భారీగా ఎల్ఐసీ పోర్ట్‌ఫోలియో షేర్ల విలువ పడిపోయింది.
ఎల్ఐసీ టాప్ పెట్టుబడులు
ఎల్ఐసీకి ఐటీసీలో రూ.11,863 కోట్లు, లార్సెన్ అండ్ టూబ్రో(ఎల్అండ్‌టీ) రూ.6,713 కోట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.5,647 కోట్లు ఉన్నాయి. ఎల్ఐసీ మొత్తం క్షీణతలో ఈ స్టాక్స్ 29 శాతం వాటాను కలిగి ఉన్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, జెఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంకుతోపాటుగా మరికొన్నింటిలోనూ ఎల్ఐసీకి షేర్లు ఉన్నాయి.
సంబంధిత కథనం