LIC Fraud APP : ఎల్ఐసీ పేరుతో ఉన్న ఈ యాప్‌తో జాగ్రత్త.. మీ డబ్బులు పోయే అవకాశం!
LIC Fraud APP : ఎల్ఐసీ పేరుతో ఉన్న ఒక యాప్‌తో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ డబ్బులు పోయే ప్రమాదం ఉంది. ఈ మేరకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ నోటీసు జారీ చేసింది.
ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు ఎక్కువగా అయ్యాయి. దీనివల్ల ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బు నిమిషాల్లో మాయమవుతుంది. ఇటీవల ఎల్ఐసీ కూడా మోసపూరిత యాప్‌ల గురించి ప్రజలను హెచ్చరించింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ప్రజల ప్రయోజనం కోసం వివిధ బీమా పథకాలను అందిస్తుంది. ఆ విధంగా వినియోగదారులు ఎంతో ప్రయోజనం పొందుతున్నారు. అయితే ఎల్ఐసీ పేరుతో యాప్ తీసుకొచ్చి ప్రజలను మోసగిస్తున్నట్టుగా గుర్తించింది. ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది.

LIC Of India అనే పేరుతో ఒక యాప్ గురించి అలర్ట్ ఇచ్చింది. ఈ యాప్ ఎల్ఐసీ కాదని స్పష్టం చేసింది. ఇది నిజం కాదని, చాలా మంది మోసపోయే అవకాసం ఉందని ఎల్ఐసీ పేర్కొంది. ఈ కారణంగా ఈ మొబైల్ యాప్‌ల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరింది. అన్ని లావాదేవీలు ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్ సహాయంతో మాత్రమే చేయాలని లేదా ఎల్ఐసీ డిజిటల్ యాప్ ద్వారా చేయాలని కూడా తెలిపింది.
ఇటీవల ఎల్ఐసీ పేరుతో నకిలీ ప్రకటనలు ఇంటర్నెట్‌లో ప్రచురించబడి, ప్రజలను మోసం చేస్తున్నాయని నివేదికలు వచ్చాయి. ఎల్ఐసీ ప్రచురించిన ప్రకటన మాదిరిగానే ఎల్ఐసీ పేరు, లోగోను అసలు ఫార్మాట్‌లోనే ముద్రించి మోసాలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో నకిలీ ప్రకటనలు వ్యాప్తి చెందుతున్నాయి. ఎల్ఐసీ పాలసీదారులు, ప్రజలు ఇటువంటి నకిలీ ప్రకటనలు అర్థం చేసుకుని తదనుగుణంగా వ్యవహరించాలని సూచించింది ఎల్ఐసీ.
ఎల్ఐసీ పేరుతో మోసపూరిత మొబైల్ యాప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చక్కర్లు కొడుతోందని హెచ్చరించింది. ఎల్ఐసీ ఆఫ్ ఇండియా పేరుతో ఉన్న ఈ యాప్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. పాలసీదారులు, కస్టమర్లు అధికారిక ఎల్ఐసీ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్ www.licindia.in లేదా ఎల్ఐసీ డిజిటల్ యాప్ ద్వారా లావాదేవీలు చేయాలని చెప్పింది.