LIC Smart Pension Plan : ఎల్ఐసీ నుంచి కొత్త స్మార్ట్ పెన్షన్ ప్లాన్.. పింఛన్ కోసం అనేక రకాల ఆప్షన్స్!
LIC Smart Pension Plan : ఎల్ఐసీ కొత్త ప్లాన్‌ను లాంచ్ చేసింది. స్మార్ట్ పెన్షన్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ పథకం గురించి వివరాలేంటో చూడండి.

ప్రభుత్వ రంగ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) స్మార్ట్ పెన్షన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్‌లో అనేక ఫీచర్లు ఉన్నట్టుగా ఎల్ఐసీ తెలిపింది. ఈ పథకం పెన్షన్ కోసం, ఒక వ్యక్తికి ఉమ్మడిగా వివిధ రకాల ఆప్షన్స్ అందిస్తుంది. ఈ పథకాన్ని ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ ఎం.నాగరాజు, ఎల్ఐసీ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ్ మొహంతి ప్రారంభించారు. ఈ పాలసీ నిబంధనల ప్రకారం పాక్షిక లేదా పూర్తి ఉపసంహరణకు అనేక నగదు ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయని ఎల్ఐసీ తెలిపింది.
పెన్షన్ ప్లాన్స్
ఎల్ఐసీ స్మార్ట్ పెన్షన్ ప్లాన్ అనేది నాన్ పార్టిసిపేటింగ్, నాన్ లింక్డ్, ఇండివిడ్యూవల్/గ్రూప్, సేవింగ్స్, తక్షణ యాన్యుటీ ప్లాన్. పెన్షన్, రిటైర్మెంట్ సేవింగ్ విభాగంలో ఈ కొత్త ప్లాన్ విప్లవాత్మకంగా మారుతుంది ఎల్ఐసీ పేర్కొంది. పదవి విరమణ కోసం పొదుపు చేయడానికి సురక్షితంగా ఇది ఉంటుందని వెల్లడించింది. ఇతర పెన్షన్లకంటే భిన్నంగా ఉంటుంది. ఇందులో తక్షణ యాన్యుటీ ప్లాన్.. అంటే పాలసీ తీసుకున్న తర్వాతి నెల నుంచి పెన్షన్ వచ్చేలా ఆప్షన్ ఎంచుకోవచ్చు.
ఈ పథకం పదవీ విరమణ తర్వాత మీకు ఆర్థిక భద్రతను అందిస్తుంది. వన్-టైమ్ ప్రీమియం లాగా ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన తర్వాత, మీకు పెన్షన్ అందుతూనే ఉంటుంది. పెన్షన్ పొందడానికి, మొత్తం ప్రీమియం ఒకేసారి చెల్లించాలి. వివిధ పెన్షన్ ఎంపికలు(యాన్యుటీ ఎంపికలు) అందుబాటులో ఉన్నాయి. ఈ పథకంలో పాలసీదారుడు నెలవారీ, త్రైమాసిక, అర్ధ వార్షిక, వార్షిక ప్రాతిపదికన పెన్షన్ పొందే అవకాశాన్ని పొందుతారు.
పోత్సహకాలు
ఈ స్మార్ట్ పెన్షన్ ప్లాన్‌లో సింగిల్ లైఫ్, జాయింట్ లైఫ్ యాన్యుటీ ఆప్షన్స్ ఎంచుకోవచ్చు. ప్రస్తుత పాలసీదారులకు చనిపోయిన పాలసీదారుల నామినీ లేదా వారసులకు యాన్యుటీ రేటు పెంపు ద్వారా మంచి ప్రోత్సహకాలు ఉంటాయి. పాలసీ నిబంధనలకు అనుగుణంగా పాక్షింగానైనా లేదా పూర్తిస్థాయిలో నగదు ఉపసంహరించుకోవచ్చు. కనీస కొనుగోలు ధర లక్ష రూపాయలు. ఎక్కువ కొంటే ప్రోత్సాహకాలూ లభిస్తాయి.
ప్రవేశ వయసు
ఈ పథకంలో కనీస ప్రవేశ వయస్సు 18 సంవత్సరాలు. ఎంచుకున్న యాన్యుటీ ఆప్షన్‌ను బట్టి గరిష్ట ప్రవేశ వయస్సు 65 నుంచి 100 సంవత్సరాల మధ్య ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఎల్ఐసీ పాలసీదారులు, మరణించిన పాలసీదారుల నామినీలకు పెరిగిన యాన్యుటీల రూపంలో ప్రోత్సాహకాలు లభిస్తాయి. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పిఎస్) చందాదారులు తక్షణ యాన్యుటీని ఎంచుకునే అవకాశం ఉంది.
వికలాంగులపై ఆధారపడిన వారికి ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం, వారి దీర్ఘకాలిక ఆర్థిక శ్రేయస్సును నిర్ధారించే అవకాశం ఈ పథకంలో ఉంది. పాలసీదారులు మూడు నెలల తర్వాత రుణం పొందవచ్చు. రుణ లభ్యత నిర్దిష్ట యాన్యుటీ ఆప్షన్స్, షరతులకు లోబడి ఉంటుంది.
ఎల్ఐసీ స్మార్ట్ పెన్షన్ ప్లాన్ ఎలా తీసుకోవాలి?
ఎల్ఐసీ స్మార్ట్ పెన్షన్ ప్లాన్‌ను వివిధ మార్గాల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఎల్ఐసీ ఏజెంట్లు, మధ్యవర్తులు, పాయింట్ ఆఫ్ సేల్ పర్సన్-లైఫ్ ఇన్సూరెన్స్ (పీవోఎస్‌పీ-ఎల్ఐ), కామన్ పబ్లిక్ సర్వీస్ సెంటర్లు (సీపీఎస్సీ-ఎస్పీవీ) ద్వారా ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. www.licindia.in లో నేరుగా కూడా కొనుగోలు చేయవచ్చు.
సంబంధిత కథనం