ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ షేర్లు స్టాక్ మార్కెట్‌లో మంగళవారం భారీ ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి. ఈ సంస్థ షేరు ధర బీఎస్‌ఈలో ఇష్యూ ధర రూ. 1,140తో పోలిస్తే, ఏకంగా రూ. 575 అధికంగా (50.44% ప్రీమియం).. రూ. 1,715 వద్ద నమోదైంది. అదేవిధంగా ఎన్ఎస్ఈలో కూడా ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ షేరు ధర 50.01% ప్రీమియంతో రూ. 1,710.10 వద్ద తన ప్రయాణాన్ని ప్రారంభించింది.
ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ లిస్టింగ్.. అంచనాలను మించిపోయింది. దీనికి ముందే గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ) కూడా సానుకూల సంకేతాలు ఇచ్చింది. మార్కెట్‌లో లిస్ట్ కావడానికి ముందు, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ షేర్లు రూ. 1,562 వద్ద ట్రేడ్ అయ్యాయి, ఇది దాదాపు 37% లిస్టింగ్ ప్రీమియంను సూచించింది.
లిస్టింగ్ రోజుకు ముందే, దేశీయ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ షేర్లపై బుల్లిష్ స్టాండ్ కవరేజీని ప్రారంభించింది. భారతదేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ను అందిపుచ్చుకోవడానికి ఎల్‌జీ సంస్థ సిద్ధంగా ఉందని, ముఖ్యంగా కీలకమైన ఉత్పత్తి విభాగాలలో సంస్థకు ఉన్న అగ్రస్థానం దీనికి దోహదపడుతుందని ఎంఓఎస్‌ఎల్ అభిప్రాయపడింది.
ఈ బ్రోకరేజ్ సంస్థ ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌కు ‘బై’ రేటింగ్‌ను ఇచ్చింది. షేర్ ప్రైజ్ టార్గెట్‌ని రూ. 1,800గా నిర్ణయించింది.
"బలమైన రిటర్న్ రేషియోలు, అధిక ఓసీఎఫ్ కన్వర్షన్, స్థానికీకరణపై వ్యూహాత్మక దృష్టి, అధిక లాభాలు వచ్చే బీ2బీ, ఏఎంసీ ఆదాయాలలో లక్షిత వృద్ధి, కీలక ఉత్పత్తుల విభాగాలలో నాయకత్వ స్థానం కారణంగా ఎల్‌జీఈఐఎల్ అధిక మల్టిపుల్స్‌లో ట్రేడ్ అవుతుందని మేము ఆశిస్తున్నాము," అని మోతీలాల్ ఓస్వాల్ తెలిపింది.
ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ యొక్క రూ. 11,607 కోట్ల ఐపీఓ, భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యధికంగా సబ్‌స్క్రైబ్ చేసిన పబ్లిక్ ఇష్యూగా నిలిచింది. ఈ ఐపీఓకు సుమారు రూ. 4.5 లక్షల కోట్ల విలువైన బిడ్లు వచ్చాయి. ఈ ఘనతతో, గతంలో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ పేరిట ఉన్న రూ. 3.2 లక్షల కోట్ల రికార్డును ఎల్‌జీ బద్దలు కొట్టింది.
మొత్తంగా, ఈ ఐపీఓలో 7,13,34,320 షేర్లకు గాను ఏకంగా 3,85,33,26,672 షేర్ల కోసం బిడ్లు దాఖలయ్యాయి. అంటే, ఐపీఓ 54.02 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది.
క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్ (క్యూఐబీలు) కోసం కేటాయించిన భాగం 166.51 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది.
నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ (ఎన్ఐఐ) కోటా 22.44 రెట్లు సబ్‌స్క్రిప్షన్ అందుకుంది.
రిటైల్ వ్యక్తిగత పెట్టుబడిదారుల (ఆర్ఐఐ) విభాగం 3.54 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది.
ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ ధరల శ్రేణిని రూ. 1,080 నుంచి రూ. 1,140గా నిర్ణయించారు. అత్యధిక ధర వద్ద కంపెనీ విలువ రూ. 77,400 కోట్లుగా అంచనా వేశారు. పెట్టుబడిదారులు 13 షేర్ల లాట్‌లలో ఈ ఐపీఓకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఐపీఓ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ రూపంలో 10.18 కోట్ల షేర్లతో ఉంది. కాబట్టి, ఈ ఐపీఓ ద్వారా వచ్చే నిధులు పూర్తిగా ప్రమోటర్-అమ్మకందారుల ఖాతాకు వెళ్తాయి. ఈ సొమ్ము కంపెనీకి దక్కదు.
ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్, భారతదేశ స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన రెండొవ దక్షిణ కొరియా కంపెనీ! గత సంవత్సరం, భారతీయ ఐపీఓ చరిత్రలోనే అతిపెద్ద ఇష్యూగా నిలిచిన హ్యుందాయ్ తర్వాత ఎల్‌జీ ఈ ఘనత సాధించింది.
సంబంధిత కథనం