డబ్బులు ఊరికే రావు- లలితా జ్యువెలరీ ఐపీఓపై బిగ్​ అప్డేట్​!-lalithaa jewellery mart ipo draft papers filed with sebi for 1700 crore offering ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  డబ్బులు ఊరికే రావు- లలితా జ్యువెలరీ ఐపీఓపై బిగ్​ అప్డేట్​!

డబ్బులు ఊరికే రావు- లలితా జ్యువెలరీ ఐపీఓపై బిగ్​ అప్డేట్​!

Sharath Chitturi HT Telugu

ఐపీఓగా స్టాక్​ మార్కెట్​లోకి అడుగు పెట్టేందుకు ప్రముఖ లలితా జ్యువెలరీ రెడీ అవుతోంది. ఈ మేరకు సెబీ వద్ద కీలక పేపర్లను సమర్పించింది. వీటి ద్వారా లలితా జ్యువెలరీ మార్ట్​ ఐపీఓకి సంబంధించిన పలు వివరాలు బయటకు వచ్చాయి. అవి..

లలితా జ్యువెలరీ..

‘డబ్బులు ఊరికే రావు’ అంటూ తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్​ అయిన వ్యాపారవేత్త ఎం. కిరణ్​ కుమార్​కి చెందిన లలితా జ్యువెలరీ మార్ట్​ లిమిటెడ్​ త్వరలోనే ఐపీఓగా రానుంది. ఈ మేరకు సెబీకి తాజాగా డీఆర్​హెచ్​పీ (డ్రాఫ్ట్​ రెడ్​ హెర్రింగ్​ ప్రాస్పెక్టస్​)ని దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో ఈ సంస్థ గురించి, ఐపీఓ వివరాల గురించి ఇక్కడ తెలుసుకుందాము..

లలితా జ్యువెలరీ మార్ట్​ లిమిటెడ్​..

చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ఈ లలితా జ్యువెలరీ సంస్థ.. బంగారం ఆభరణాల విక్రయాల్లో ప్రత్యేకతను కలిగి ఉంది. వీటితో పాటు వెండి వస్తువులు, వజ్రాల ఆభరణాలను కూడా విక్రయిస్తోంది. ఈ సంస్థ దక్షిణ భారత మార్కెట్‌కు తన సేవలను అందిస్తోంది. టైర్ 1, 2, 3 నగరాల్లో 56 స్టోర్‌లను ఈ సంస్థ ప్రస్తుతం నిర్వహిస్తోంది. ఈ స్టోర్‌లలో బీఐఎస్​ హాల్‌మార్క్ ఉన్న, ప్రామాణికమైన ఆభరణాలను విక్రయిస్తోంది.

ప్రస్తుతం ఉన్న 56 స్టోర్‌లలో.. 22 ఆంధ్రప్రదేశ్‌లో, 20 తమిళనాడులో, ఏడు కర్ణాటకలో, ఆరు తెలంగాణలో, ఒకటి పుదుచ్చేరిలో ఉన్నాయి. డిసెంబర్ 31, 2024 నాటికి ఈ స్టోర్‌ల మొత్తం విస్తీర్ణం 6,09,408 చదరపు అడుగులు. వీటిలో 47 స్టోర్‌లు ఒక్కొక్కటి 5,000 చదరపు అడుగులకు పైగా విస్తీర్ణాన్ని కలిగి ఉన్నాయి.

డిసెంబర్ 31, 2024తో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి, కంపెనీ ఏకీకృత కార్యకలాపాల ఆదాయం 12,594.67 కోట్లుగా, పన్ను తర్వాత లాభం 262.33 కోట్లుగా నమోదయ్యాయి.

లలితా జ్యువెలరీ మార్ట్​ లిమిటెడ్​ ఐపీఓ వివరాలు..

ముఖ విలువ 5 రూపాయలు కలిగిన ఈ లలితా జ్యువెలరీ మార్ట్​ లిమిటెడ్​ ఐపీఓలో.. 1200 కోట్ల రూపాయల విలువైన తాజా ఇష్యూతో పాటు, ఎం. కిరణ్ కుమార్ జైన్ ద్వారా 500 కోట్ల రూపాయల విలువైన ఆఫర్-ఫర్-సేల్ (ఓఎఫ్​ఎస్​) ఉన్నాయి.

తాజా ఇష్యూ ద్వారా సేకరించిన నిధుల్లో 1014.50 కోట్ల రూపాయలను భారతదేశంలో కొత్త స్టోర్‌ల ఏర్పాటుకు సంబంధించిన మూలధన వ్యయాల కోసం, అలాగే సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగిస్తారు.

ఈ ఐపీఓను బుక్-బిల్డింగ్ ప్రక్రియ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. నికర ఆఫర్‌లో 50% కంటే ఎక్కువ క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్‌లకు, కనీసం 15% నాన్​ ఇన్​స్టిట్యూషనల్​ బిడ్డర్లకు, 35% రిటైల్ బిడ్డర్లకు కేటాయించడం జరుగుతుంది. అర్హులైన ఉద్యోగులకు సబ్‌స్క్రిప్షన్ కోసం రిజర్వేషన్ ఉంటుంది. ఉద్యోగుల రిజర్వేషన్ విభాగంలో పాల్గొనే సంస్థ ఎంప్లాయీస్​కి డిస్కౌంట్ కూడా అందిస్తారు!

ఆనంద్ రాఠీ అడ్వైజర్స్ లిమిటెడ్, ఈక్వైరస్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఇష్యూకు బుక్-రన్నింగ్ లీడ్ మేనేజర్‌లుగా వ్యవహరిస్తున్నాయి. ఎంయూఎఫ్​జీ ఇంటిమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇష్యూకు రిజిస్ట్రార్‌గా పనిచేస్తుంది.

లలితా జ్యువెలరీ మార్ట్​ లిమిటెడ్ ఓపీఓ ప్రైజ్​ బ్యాండ్​, సబ్​స్క్రిప్షన్​​ ఓపెనింగ్​ తేదీ వంటి విషయాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. కాగా డీఆర్​హెచ్​పీకి సెబీ అనుమతి ఇస్తే, సంస్థ మార్కెట్​ ఎంట్రీని ప్లాన్​ చేసుకుంటుంది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం