Kinetic Luna electric moped : ఇండియా మొబిలిటీ సెగ్మెంట్లో విప్లవాత్మక మార్పులు సృష్టించిన కైనెటిక్ లూనా గుర్తుందా? ఈ టూ వీలర్ మోపెడ్.. ఇప్పుడు మళ్లీ దేశ రోడ్ల మీద చక్కర్లు కొట్టడానికి సిద్ధమవుతోంది! ఎలక్ట్రిక్ వర్షెన్‌తో ఈ లూనాను తీసుకొస్తున్నట్టు కైనెటిక్ ఇంజినీరింగ్ లిమిటెడ్ (కేఈఎల్) ప్రకటించింది. అతి త్వరలోనే మార్కెట్లోకి ఈ కైనెటిక్ లూనా ఎలక్ట్రిక్ మోపెడ్‌ను లాంచ్ చేయనున్నట్టు వెల్లడించింది. కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్ ద్వారా ఈ మోపెడ్‌ను విక్రయించనున్నట్టు పేర్కొంది.
మెయిన్ ఛాసీస్, మెయిన్ స్టాండ్, సైడ్ స్టాండ్, స్వింగ్ ఆర్మ్‌తో పాటు ఇతర పార్ట్‌లను ఇప్పటికే సిద్ధం చేసినట్టు కేఈఎల్ చెబుతోంది. మహారాష్ట్ర అహ్మెద్నగర్లోని ఫ్యాక్టరీలో ఈ కైనెటిక్ లూనా ఎలక్ట్రిక్ మోపెడ్ ప్రొడక్షన్ జరుగుతుందని స్పష్టం చేసింది. నెలకు 5వేల యూనిట్ల వరకు మోపెడ్లను తయారు చేసే సామర్థ్యం ఈ మేన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి ఉందమని పేర్కొంది.
Kinetic Luna electric moped price : ఈ తరం వారికి కైనెటిక్ లూనా గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ అప్పట్లో కైనెటిక్ లూనాకు విపరీతమైన డిమాండ్ ఉండేది. ఎక్కడ చూసినా ఇవే కనిపించేవి. ముఖ్యంగా.. గ్రామాల్లో ఎక్కువ మంది దీనినే ఉపయోగించే వారు. ఫలితంగా రోజుకు 2వేలకుపైగా యూనిట్లు అమ్ముడుపోయిన సందర్భాలు కూడా ఉన్నట్టు సంస్థ చెబుతోంది. ఇక ఇప్పుడు.. కైనెటిక్ లూనా ఎలక్ట్రిక్ వర్షెన్‌కి కూడా మంచి డిమాండ్ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది ఆ సంస్థ.
"వచ్చే 2-3 ఏళ్లల్లో.. కైనెటిక్ లూనా ఎలక్ట్రిక్ బిజినెస్‌తో వార్షికంగా రూ. 30కోట్ల ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నాము. దీని ద్వారా.. ఈవీ సెగ్మెంట్లో కేఈఎల్ మార్కెట్ షేర్ కూడా పెరుగుతంది," అని సంస్థ మేనేజింగ్ డైరక్టర్ ఆజిక్య ఫిరోడియా వెల్లడించారు.
Kinetic Luna electric moped launch date in India : కైనెటిక్ లూనా ఎలక్ట్రిక్ మోపెడ్‌కు సంబంధించిన వివరాలను రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పొందుపరిచింది కేఈఎల్. దేశంలో ఈవీకి ప్రస్తుతం ఉన్న డిమాండ్‌కు తగ్గట్టే ఈ మోపెడ్‌ను రూపొందిస్తున్నట్టు పేర్కొంది. దిగువ శ్రేణి మార్కెట్లు, లోడ్ కారియర్ కేటగిరీని ఈ కైనెటిక్ లూనా ఎలక్ట్రిక్ మోపెడ్ టార్గెట్ చేస్తుందని వివరించింది.
అయితే.. ఈ కైనెటిక్ లూనా ఎలక్ట్రిక్ మోపెడ్‌కు సంబంధించిన ఫీచర్స్, ధర, బ్యాటరీ ప్యాక్ వంటి వివరాలను కేఈఎల్ ఇంకా ప్రకటించలేదు. ఈ కైనెటిక్ లూనా ఎలక్ట్రిక్ మోపెడ్ లాంచ్ డేట్‌ను కూడా రివీల్ చేయలేదు. కాగా.. రానున్న రోజుల్లో వీటిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
సంబంధిత కథనం