Kia EV6 : ఈ అద్భుతమైన ఎలక్ట్రిక్ కారును జనవరిలో ఒక్క కస్టమర్ కూడా కొనుగోలు చేయలేదు
Kia EV6 : కియా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఈవీ6 2025 జనవరిలో ఒక్క కస్టమర్ కూడా కొనుగోలు చేయలేదు. కియా ఈవీ6.. 5 సీట్ల ఎలక్ట్రిక్ కారు. అయితే కియాకు చెందిన ఇతర కార్లు అమ్మకాలు బాగానే ఉన్నాయి.
కియా కార్లను భారతీయ కస్టమర్లు ఎక్కువగానే ఇష్టపడుతున్నారు. కియాకు చెందిన కొన్ని కార్లను జనవరిలో కొనేందుకు కస్టమర్లు ఆసక్తి చూపించారు. అయితే ఈ సమయంలో కంపెనీ ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కియా ఈవీ6కు ఒక్క కొనుగోలుదారు కూడా దొరకలేదు. కియా ఈవీ6 5 సీట్ల ఎలక్ట్రిక్ కారు. కియా ఈవీ6 ఫీచర్లు, పవర్ట్రెయిన్, ధర గురించి చూద్దాం..

ఫీచర్లు
ఫీచర్ల విషయానికొస్తే ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో వినియోగదారులు 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందుతారు. 14 స్పీకర్ల మెరిడియన్ సౌండ్ సిస్టమ్, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు, సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇండియన్ మార్కెట్లో ఈవీ ధర రూ .60.97 లక్షలు(ఎక్స్ షోరూమ్) నుండి రూ .65.97 లక్షల(ఎక్స్ షోరూమ్) వరకు ఉంది.
మరోవైపు ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో ప్రయాణీకుల సేఫ్టీ కోసం 8-ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఏడీఏఎఎస్ టెక్నాలజీ, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. భారత మార్కెట్లో కియా ఈవీ6 బీఎమ్‌డబ్ల్యూ ఐ4, హ్యుందాయ్ ఐయోనిక్ 5 వంటి ఎలక్ట్రిక్ వాహనాలతో పోటీపడుతుంది.
బ్యాటరీ, రేంజ్
ఈ ఈవీలో 77.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లపైన రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది 50 కిలోవాట్ల డీసీ ఫాస్ట్ ఛార్జర్‌కు సపోర్ట్ చేస్తుంది. దీని ద్వారా గంట 13 నిమిషాల్లో 10 నుండి 80 శాతం ఛార్జ్ చేయవచ్చు.
కియా జనవరి మెుత్తం అమ్మకాలు
గత నెలలో అంటే జనవరి 2025 అమ్మకాల గురించి చూస్తే.. కియా పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సోనెట్ 7,000 మందికి పైగా కస్టమర్లను పొందింది. అదే సమయంలో మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెల్టోస్‌ను కూడా 6,000 మందికి పైగా కొనుగోలు చేశారు.
2025 మొదటి నెలలో దేశీయ మార్కెట్‌లో కియా బ్రాండ్ మొత్తం అమ్మకాలు 25,025 యూనిట్లుగా ఉన్నాయి. జనవరి 2024లో విక్రయించిన 23,769 యూనిట్ల అమ్మకాలతో పోల్చితే.. ఏడాది వృద్ధి 5 శాతంగా ఉంది. అదే సమయంలో, డిసెంబర్ 2024లో బ్రాండ్ అమ్మకాలు 8,957 యూనిట్లుగా ఉన్నాయి.