కియా ఇండియా తన కొత్త కారెన్స్ క్లావిస్ ఎలక్ట్రిక్ విడుదల తేదీని ప్రకటించింది. జులై 15న ఈ ఎలక్ట్రిక్ ఎమ్‌పీవీని కంపెనీ లాంచ్ చేయనుంది. కంపెనీ అధికారిక వివరాల ప్రకారం.. ఈ కారు జులై 15న ఉదయం 11:59 గంటలకు లాంచ్ అవుతుంది. 7 సీట్ల ఎమ్‌పీవీ కారెన్స్ మార్కెట్లో హిట్ అయింది. భారత మార్కెట్లో ఎర్టిగా తర్వాత అత్యధికంగా అమ్ముడైన రెండో ఎంపీవీ ఇది. ఇప్పుడు ఈ కారు ఎలక్ట్రిక్ మోడల్‌పై కంపెనీ భారీగా ఆశలు పెట్టుకుంది. జనాలను ఈ సీటర్‌తో లవ్‌లో పడేయాలనే ఆలోచనలో ఉంది కంపెనీ. ఈ సెగ్మెంట్లో మొదటి మూడు వరుసల ఈవీ అవుతుంది.
కారెన్స్ క్లావిస్ ఈవీ క్రెటా ఎలక్ట్రిక్ మాదిరిగానే బ్యాటరీ ప్యాక్ అందించే అవకాశం ఉంది. ఇది దాదాపు ఒకే బ్యాటరీ ప్యాక్, మోటారు ఎంపికలను పొందవచ్చు. క్రెటా ఎలక్ట్రిక్ ప్రస్తుతం 42 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్లు (390 కిలోమీటర్ల రేంజ్), 51.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్లు (473 కిలోమీటర్ల రేంజ్) అందిస్తుంది. వీటి మోటార్ అవుట్‌పుట్స్ వరుసగా 133 బీహెచ్‌పీ, 169 బీహెచ్‌పీ పవర్‌గా ఉన్నాయి.
ఇందులో రెండు 12.3 అంగుళాల ఫ్రీ స్టాండింగ్ స్క్రీన్లు ఉన్నాయి. డ్యూయల్ టోన్ టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంది. ఇది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ క్రింద టెంపరేచర్, వాల్యూమ్ సర్దుబాటు చేయడానికి టచ్-ఎనేబుల్డ్ కంట్రోల్ ప్యానెల్‌ను కలిగి ఉంది. దీనిని ఒక బటన్ నొక్కడం ద్వారా ఎయిర్ కండిషనర్, ఇన్ఫోటైన్మెంట్ కంట్రోల్ మధ్య మార్చవచ్చు. ఇది లేత గోధుమ రంగు లెదర్ సీట్ అప్ హోల్ స్టరీని కలిగి ఉంది. దీని మధ్యలో కెప్టెన్ సీటు ఉంటుంది.
కారులో డ్యూయల్ 12.3 అంగుళాల స్క్రీన్లు (ఒకటి ఇన్ఫోటైన్మెంట్ కోసం, మరొకటి ఇన్స్ట్రుమెంటేషన్ కోసం), పనోరమిక్ సన్‌రూఫ్, 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, 4-వే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ప్యాడిల్ షిఫ్టర్లు ఉన్నాయి. గ్రావిటీ గ్రే, అరోరా బ్లాక్ పెర్ల్, గ్లేసియర్ వైట్ పెర్ల్, క్లియర్ వైట్, ఇంపీరియల్ బ్లూ, ప్యూటర్ ఆలివ్, ఐవరీ సిల్వర్ గ్లాస్, స్పార్క్లింగ్ సిల్వర్ అనే 8 మోనోటోన్ కలర్ ఆప్షన్లలో క్యారెన్స్ క్లావిస్ లాంచ్ అయింది.
కారెన్స్ క్లావిస్ ఈవీలో డ్యూయల్ డిజిటల్ స్క్రీన్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ విత్ రియర్ ఏసీ వెంట్స్, లెవల్ 2 ఏడీఏఎస్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ఫ్రంట్ ప్యాసింజర్ సీటు కోసం బాస్ ఫంక్షన్, వీ2ఎల్, వీ2ఎక్స్, ఫుల్ ఎల్ఈడీ లైట్ ప్యాకేజీలు వంటి ఫీచర్లు ఉంటాయి.
భారతదేశంలో ఇది మారుతి ఈ విటారా, ఎంజీ జెడ్ఎస్ ఈవీ, టాటా కర్వ్ ఈవీ, మహీంద్రా బీఈ 6, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌తో పాటు హోండా, టయోటా, ఫోక్స్‌వ్యాగన్, స్కోడా నుండి రాబోయే ఎలక్ట్రిక్ మోడళ్లతో పోటీపడుతుంది. అధిక వేరియంట్లు నేవీ బ్లూ, బీజ్ రంగుల్లో ఉండగా, తక్కువ వేరియంట్లు నలుపు, లేత గోధుమ రంగుల్లో ఉంటాయి.